Cooldrink
-
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి.. బలవంతంగా తాగించి.. ఆపై..
సాక్షి, కరీంనగర్: జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్‌బజార్ ప్రాంతానికి చెందిన బోడ చంద్రకళ అనే మహిళకు బలవంతంగా కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించిన గోవర్దన్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నటేశ్ తెలిపారు. చంద్రకళ విద్యుత్ శాఖలో ఫిల్టర్ మెకానిక్ గ్రిడ్‌గా పని చేస్తుంది. అదే శాఖలో పని చేసే గోవర్దన్ అక్టోబర్ 30న కూల్‌డ్రింక్ తీసుకొచ్చి చంద్రకళకు ఇవ్వగా.. ఆమె తాగేందుకు నిరాకరించింది. బలవంతం చేయడంతో ఆమె కూల్‌డ్రింక్ తాగగా.. అస్వస్థతకు గురైంది. ఫోన్లో భర్త బోడ మోహన్‌కు సమాచారమందించింది. మోహన్ కార్యాలయానికి వెళ్లి చంద్రకళను ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు కూల్‌డ్రింక్‌లో విషం కలపడం వల్లే అస్వస్థతకు గురైందని వెల్లడించారు. మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇవి చదవండి: ‘ఎల్ఎండీ’ వాగులో దూకుతున్నట్లు.. వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి.. యువకుడు.. -
డబ్బుపై ఆశే ప్రాణం తీసింది
చిత్తూరు అర్బన్ : రూపాయి రూపాయి ఏం చేస్తావ్ అంటే.. అయినవాళ్లను విడదీస్తాను. తోబుట్టువుల మధ్య రక్తపాతం సృష్టిస్తాను. బంధాలను సైతం బూడిద చేస్తానని చెప్పిందట. ఇదే కోవలో కట్టుకున్న భార్య కన్నబిడ్డ భవిష్యత్తును అదే రూపాయిల కోసం చిదిమేసి తనువు చాలించాడో వ్యక్తి. అర్ధరాత్రి కూల్‌డ్రింక్ తాపించడానికి నిద్రలేపుతుంటే కన్నతండ్రి, కట్టుకున్న భర్తపై ఉంచిన నమ్మకంతో అందులో కలిపి ఉన్న విషాన్ని గ్రహించలేక మృత్యుఒడికి చేరుకున్నారు. చిత్తూరు నగరంలోని ఓబనపల్లె హౌసింగ్ కాలనీలో చోటుచేసుకున్న హృదయవిదారక ఘటన అందరినీ కన్నీళ్లుపెట్టించింది. చిత్తూరు నగరంలోని సంతపేట సమీపంలో ఉన్న ఓబనపల్లె హౌసింగ్ కాలనీకి చెందిన కల్లూరు రవి (50).. అతని భార్య కల్లూరు భువనేశ్వరి (45), కుమార్తె కల్లూరు గాయత్రి (9)కి పురుగులమందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించి తాను కూడా ఇదే పానీయాన్ని తాగడంతో ముగ్గురు మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగుచూసింది. చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, టూటౌన్ సీఐ యుగంధర్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రవి మొదటి భార్య గౌరి 15 ఏళ్ల క్రితం మృతిచెందింది. వీరికి భార్గవి అనే పాప ఉంది. గౌరి మృతి తరువాత బెంగళూరుకు చెందిన భువనేశ్వరితో పెద్దలు రవికి వివాహం చేశారు. వీరికి గాయత్రి, నాగేశ్వరసాయి (6)అనే ఇద్దరు పిల్లలున్నారు. రవి తల్లి కల్లూరు జయలక్ష్మి ఎల్ఐసీలో పనిచేస్తూ ఇటీవల రిటైరయ్యారు. కాస్త డబ్బులు రావడంతో రవి ఆ డబ్బు కోసం నిత్యం తల్లితో వాదులాడేవాడు. పైగా ఓబనపల్లె కాలనీలో ఉన్న ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలని పలుమార్లు గొడవ కూడా పెట్టుకున్నాడు. అయితే మద్యానికి బానిసైన కొడుకు ఇంటిని పోగొట్టుకుంటాడని భావించిన జయలక్ష్మి.. ఇంటిని మనవడి పేరిట రాస్తామంటూ చెబుతూ వచ్చేది. కుటుంబ పోషణ అంతంతమాత్రంగా ఉండటంతో భువనేశ్వరిని ఆర్థికంగా ఆదుకునేది. ఇది నచ్చని రవి, తన భార్యతో కూడా తగాదాలు పెట్టుకునేవాడు. ఈ నేపథ్యంలో నిద్రిస్తున్న భార్య, పిల్లల్ని అర్థరాత్రి లేపి, పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించాడు. కొద్దిసేపు తరువాత తాను కూడా తాగి స్పృహ కోల్పోయాడు. ముగ్గురూ చనిపోయారు. ఇద్దరి రాత బాగుండటంతో... రవి తన కొడుకు నాగేశ్వరసాయికి కూడా పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించాడు. కొద్దిగా తాగిన సాయి, తనకు వద్దని చెప్పి పడుకునేశాడు. కొంతసేపటికి లేచి చూస్తే తల్లిదండ్రులు, అక్క అపస్మారక స్థితిలో పడుంటడాన్ని గమనించాడు. ఇంట్లో కింది అంతస్తులో పడుకున్న నానమ్మకు సమాచారమిచ్చాడు. ఆమె పైకివెళ్లి చూడటంతో అందరూ విగతజీవులుగా ఉన్నారు. స్థానికుల సాయంతో 108 అంబులెన్సులో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురూ చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. సాయి మాత్రం ప్రాణా పాయం నుంచి బయటపడ్డాడు. రవి మొదటి భార్య కుమార్తె భార్గవి, నానమ్మ వద్ద పడుకోవడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. మృతుల కుటుంబాన్ని చిత్తూరు ఆర్డీవో రేణుక పరామర్శించారు. -
కూతురిని చంపి.. తల్లి ఆత్మహత్య
కొత్తకోట రూరల్: బ్రెయిన్ స్ట్రోక్‌తో భర్త మరణం.. చుట్టిముట్టిన ఆర్థిక ఇబ్బందులు.. వెరసి ఓ తల్లి తన కూతురికి కూల్‌డ్రింక్‌లో విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన మండలంలోని పాలెంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఆత్మకూర్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన జానకమ్మ, సవరయ్య దంపతుల కూతురు నిర్మల(30)ని పాలెం గ్రామానికి చెందిన నర్సింహకు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి కూతురు సింధూ(8) ఉంది. అయితే, రెండేళ్ల కిందట భర్త నర్సింహ బ్రేన్ స్ట్రోక్‌తో చనిపోయాడు. అప్పటి నుంచి నిర్మల, ఆమె కూతురు ఇద్దరూ తల్లిగారి ఊరు ఆరేపల్లిలో ఉంటున్నారు. అయితే, ఉగాది పండుగ కావడంతో అత్తగారి ఊరైన పాలెంకు వచ్చారు. కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలిపి.. ఏమైందో తెలియదు కానీ, ఆదివారం రాత్రి పురుగుల మందును కూల్‌డ్రింక్‌లో కలిపి మొదట కూతురు సింధూకు ఇచ్చి, అనంతరం తల్లి నిర్మల తాగి ఇంట్లోనే నిద్రించారు. రాత్రి 10గంటల సమయంలో కూతురు సింధూ కడుపునొప్పిగా ఉందని చెప్పగా.. ఏంకాదులే ఉదయం ఆస్పత్రికి వెళ్దామని చెప్పి తల్లి నిద్రపుచ్చింది. అనంతరం గాడనిద్రలో ఉన్న పాప మృతిచెందిందో లేదోనన్న అనుమానంతో తల్లి కత్తితో రెండు సార్లు పొడిచినట్లు గాట్లు కూడా ఉన్నాయి. తెల్లవారుజామున 4గంటల సమయంలో నిర్మల అత్త సవరమ్మ లేచి చూసేసరికి మంచంపై సింధూ ఒక్కతే కనపడడంతో నిర్మల ఎక్కడ ఉందోనని బయటికి వచ్చి చూసింది. అప్పటికే నిర్మల అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని చూసి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చింది. గ్రామస్తులు మొదట నిర్మలను ఆటోలో ఎక్కించుకుంటుండగా.. నిద్రలో ఉన్న సింధూ లేస్తే తల్లికోసం ఏడుస్తదేమోనన్న ఉద్దేశంతో తనను లేపేందుకు వెళ్లి చూడగా సింధూ అప్పటికే మృతిచెంది ఉంది. వెంటనే తల్లి కూతుళ్లను ఆటోలో వనపర్తి ఆస్పత్రికి తరలిస్తుండగా తల్లి నిర్మల కూడా మార్గమధ్యంలోనే మృతిచెందిందని గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్ఐ రవికాంత్‌రావు గ్రామస్తులతో ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకొని క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించారు. ఇదిలాఉండగా, భర్త చనిపోయాక నిర్మలకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండేవని గ్రామస్తులు పేర్కొన్నారు. బాధితురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెంకటేశ్వర్రావు తెలిపారు. -
కూల్ డ్రింక్‌లో వానపాము
వాకాడు(నెల్లూరు): ఎండకు సేద తీరేందుకు కూల్‌డ్రింక్ కొంటే.. అందులో వానపాము కనిపించడంతో భీతిల్లిన సంఘటన మండలం తూపిలిపాళెం బీచ్‌లో శుక్రవారం జరిగింది. బీచ్‌కు వచ్చిన పర్యాటకుల్లో ఒకరు అక్కడే ఉన్న ఓ కూల్‌డ్రింక్ షాపులో ప్రముఖ శీతలపానియం కంపెనీ బాటిల్ తీసుకున్నాడు. అందులో వానపాము కనిపించడంతో ఒక్కసారిగా భీతిల్లాడు. దీంతో అతను వాంతి చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. పర్యాటకులు ఈ సంఘటన చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు.