ప్రశాంతంగా విచారణ
గరుగుబిల్లి : రావివలస పీఏసీఎస్‌లో శనివారం నిర్వహించిన విచారణ ప్రశాంతంగా జరిగింది. విచారణకు హాజరు కావాలని 137మందికి సమన్లు జారీచేస్తే కేవలం 11మంది మాత్రమే హాజరయ్యారు. అలాగే గతనెల 27న నిర్వహించిన విచారణకు కూడా 151మందికి సమన్లు జారీచేస్తే 22 మంది మాత్రమే హాజరయ్యారు. ఇంతవరకు 508 మందికి సమన్లు జారీచేస్తే 376 మంది విచారణ ఎదుర్కొన్నారు. ఇందులో 40మందికి సమన్లు పంపిణీ కాలేదు. రావివలస పీఏసీఎస్‌లో చోటుచేసుకున్న అవకతవకలపై సాక్షిలో ఇటీవల పలు కథనాలు ప్రచురితం కావడంతో అధికారులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన విచారణలో కోపరేటివ్ రిజిస్ట్రార్, విచారణాధికారి పి. చిన్నయ్య మాట్లాడుతూ, ప్రజలు విచారణకు సహకరిస్తే విచారణ వేగవంతమవుతుందన్నారు.
సొసైటీలోని మొత్తం ఖాతాదారులు 4441 మందికి సమన్లు జారీ చేసి వీలైన ంత త్వరగా విచారణ కార్యక్రమం పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే కూరగాయల పెంపకం కోసం రుణాలు తీసుకున్న 12 గ్రూపుల్లోని సభ్యులు 68 మందికి, పాడిగేదెల పెంపక ంనకు సంబంధించి 22 గ్రూపుల్లోని 129 మందికి కూడా సమన్లు జారీచేయనున్నట్లు తెలిపారు. విచారణ పూర్తి చేసి నివేదికను డీసీఓకు పంపించడం జరుగుతుందన్నారు. దోషులపై డీసీఓ చర్యలు తీసుకుంటారని తెలిపారు. అనంతరం పార్వతీపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వి. చంద్రశేఖర్ పీఏసీఎస్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. దీనికి సీఐ స్పందిస్తూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఖాతాదారులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. కాగా ఈనెల 6న పీఏసీఎస్‌లో మరోసారి విచారణ నిర్వహించనున్నారు. విచారణ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక ఎస్సై డి. ఈశ్వరరావు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.