‘మధ్యాహ్న భోజనాన్ని’ ప్రైవేట్‌పరం చేయవద్దు
శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కమల
గాంధీనగర్ : మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ ఎ. కమల డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర ఫౌండేషన్‌కు కట్టబెట్టాలన్న ఆలోచనను నిరసిస్తూ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం లెనిన్‌సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అరకొర వసతులతోనే పదిహేనేళ్లుగా భోజనపథకం నిర్వహిస్తున్నామన్నారు. నాలుగు నెలలుగా బిల్లులు చెల్లించడం లేదన్నారు. భోజన పథకం కార్మికులకు కనీస వసతులు కల్పించడం లేదని చెప్పారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. పథకంలో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, సరైన సౌకర్యాలు కల్పించి గతం నుంచి పనిచేస్తున్న కార్మికులకే మధ్యాహ్న భోజన పథకం అప్పగించాలని డిమాండ్‌చేశారు. సమస్యల ప రిష్కరించాలని కోరుతూ విజయవాడ నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు అందజేయనున్నామని చెప్పారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ నగర అధ్యక్షురాలు దుర్గాభవానీ, పి. లక్ష్మీ, రమాదేవి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.