పోస్టాఫీసుల్లో కోర్ బ్యాంకింగ్ సేవలు
టెక్కలి,న్యూస్‌లైన్: ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే దిశగా పోస్టల్ కార్యాలయాల్లో కోర్ బ్యాం కింగ్ సేవలను అందుబాటులోకి తేనున్నట్టు ఆ శాఖ విశాఖ రీజియన్ పోస్టు మాస్టర్ జనరల్( పీఎంజీ) శారదా సంపత్ వెల్లడిం చారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి హెడ్ పోస్టాఫీసును సందర్శించిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. కమర్షియల్ బ్యాంకులకు దీటుగా పోస్టల్ సేవలను విస్తృతం చేస్తున్నామని, ఇందులో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా శ్రీకాకుళం, టెక్కలి హెడ్ పోస్టాఫీసుల్లో కోర్ బ్యాంకింగ్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్టు చెప్పారు.
ఫిబ్రవరి నెల నుంచి సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ఆయా కార్యాలయాల్లో ఖాతాదారుల రికార్డులను తనిఖీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. మొబైల్ మనియార్డర్ సేవలను పూర్తిస్థాయిలో ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సుమారు 18 ప్రభుత్వ శాఖలకు చెందిన 150 రకాల సేవలను తమ శాఖ ద్వారా అందజేస్తున్నామన్నారు. ఆమె వెంట శ్రీకాకుళం పోస్టల్ సూపరింటెండెంట్ వై.ఎస్.నర్సింహరావు ఉన్నారు.