క్యూ3లో కార్పొరేట్ల ఆదాయాల వృద్ధి 2 శాతమే..
క్రిసిల్ రీసెర్చ్ అంచనాలు
న్యూఢిల్లీ: పెట్టుబడుల డిమాండ్ బలహీనంగా ఉండటం, కమోడిటీల ధరలు పతనం కావడం తదితర పరిణామాల నేపథ్యంలో డిసెంబర్ త్రైమాసికంలో బీఎఫ్ఎస్ఐ, ఆయిల్..గ్యాస్ కంపెనీలు మినహా ఇతర కార్పొరేట్ల ఆదాయాలు కేవలం 2 శాతం మాత్రమే వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని క్రిసిల్ రీసెర్చ్ వెల్లడించింది. తక్కువ బేస్-ఎఫెక్ట్, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం తగ్గుతుండటం తదితర అంశాలు కూడా దీనికి కారణం కాగలవని పేర్కొంది. క్రిత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కార్పొరేట్ల ఆదాయాలు 5 శాతం మేర పెరిగాయి.
స్టాక్ ఎక్స్చేంజీ ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్లో దాదాపు 70 శాతం వాటా ఉన్న 600 కంపెనీల (ఫైనాన్షియల్, చమురు, గ్యాస్ సంస్థలను మినహాయించి) అధ్యయనం ఆధారంగా క్రిసిల్ రీసెర్చ్ ఈ నివేదిక రూపొందించింది. పట్టణ ప్రాంత వినియోగదారులపై ఆధారపడిన ఆటోమొబైల్స్, మీడియా, రిటైల్, టెలికం కంపెనీలు మెరుగ్గా రెండంకెల స్థాయి వృద్ధిని నమోదు చేయొచ్చని అందులో పేర్కొంది.
అమెరికాకు ఎగుమతుల వృద్ధితో మధ్య స్థాయి ఫార్మా కంపెనీల పనితీరు కూడా మెరుగుపడొచ్చని క్రిసిల్ రీసెర్చ్ తెలిపింది. అయితే, స్థూలంగా చూస్తే కార్పొరేట్ సంస్థలు బలహీన డిమాండ్ సెంటిమెంటుతో సమస్యలు ఎదుర్కొంటున్నాయని క్రిసిల్ రీసెర్చ్ సీనియర్ డెరైక్టర్ ప్రసాద్ కొపార్కర్ తెలిపారు. చెన్నైలో వరదలు సైతం ఐటీ, ఆటోమొబైల్ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వంటి రంగాల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చన్నారు.