తప్పు చేస్తే ఆమ్వే పై చర్యలు తీసుకోండి: హైకోర్టు
చట్ట విరుద్ధంగా ఆమ్వే ఇప్పటికీ మనీ సర్కులేషన్ కింద వ్యాపారం చేస్తున్నట్లు తేలితే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
చట్ట నిబంధనలకు, హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఆమ్వే మనీ సర్కులేషన్ వ్యాపారం చేస్తోందని, దీనిని అడ్డుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన కార్పోరేట్ ఫ్రాడ్స్ వాచ్ సొసైటీ 2009లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది.
ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన హైకోర్టు గురువారం దీనిని మరోసారి విచారణ చేపట్టింది. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం ఇందులో విచారించడానికి ఏమీ లేదని తేల్చి చెప్పింది. ఈ సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఆమ్వే ఇప్పటికీ గొలుసుకట్టు వ్యాపారం చేస్తోందన్నారు. అయితే చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఆమ్వే మనీ సర్కులేషన్ కింద వ్యాపారం చేస్తుంటే సంబంధిత చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఇరు ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశిస్తూ ఈ వ్యాజ్యాన్ని మూసివేస్తున్నట్లు పేర్కొంది.