భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్న వాణిజ్య పన్నుల సహాయ అధికారి
చైతన్యపురి,న్యూస్‌లైన్: ఉన్నత హోదాలో ఉండి నిత్యం సూటిపోటి మాటలతో కట్టుకున్న భార్యను వేధిస్తున్న ఓ అధికారిపై పోలీసులను ఆశ్రయించింది. భర్త చిత్రహింసలు, అత్త, ఆడపడుచుల వేధింపులు భరించలేని ఆ ఇల్లాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి వివరాలు బాధితురాలు కథనం ప్రకారం...ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన డి.కోటేశ్వరరావు ట్రాన్స్‌కోలో ఏడీఈ. ఈయన రెండోకూతురు దివ్యభారతి (23)ని నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన రవీంద్రనాయక్‌కిచ్చి 2011లో వివాహం జరిపించారు. ఈ సమయంలో భారీగా కట్నకానుకలు ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశారు.
రవీంద్రనాయక్ నాంపల్లిలోని కమర్షియల్‌ట్యాక్స్ ప్రధానకార్యాలయంలో ఏసీటీవోగా పనిచేస్తూ కర్మన్‌ఘాట్ శ్రీనిధికాలనీలో ఉంటున్నారు. పెళ్లయిన కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగగా.. కొన్నాళ్లకు దివ్యభారతికి అబార్షన్ అయ్యింది. దీంతో ఆడపడుచు మంగమ్మ, తోటికోడలు లావణ్య, అత్త లక్ష్మమ్మ దివ్యభారతిని వేధించడం ప్రారంభించారు. వీరి మాటలు విని రవీంద్రనాయక్ కూడా భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. దీన్ని తట్టుకోలేక దివ్యభారతి ఓసారి ఆత్మహత్యకు యత్నించగా తల్లిదండ్రులు నచ్చజెప్పి పంపించారు. ఈనెల 2న రవీంద్రనాయక్ తీవ్రంగా కొట్టడంతోపాటు పుట్టింటికి పొమ్మని దివ్యభారతిని గెంటేశారు. చేసేదిలేక ఆమె మంగళవారం సరూర్‌నగర్ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు రవీంద్రనాయక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అబ్దుల్‌హమీద్ వెల్లడించారు.