రూ.500 కోట్లతో వీవర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
చేనేత కులాల సమాఖ్య డిమాండ్
కాకినాడ సిటీ :
చేనేత వర్గాలను ఆదుకునేవిధంగా రూ.500 కోట్లతో వీవర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చేనేత కులాల సమాఖ్య డిమాండ్ చేసింది. శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చేనేత కులాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పంపన రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో చేనేత రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదన్నారు. సొసైటీ క్యాష్ క్రెడిట్స్ రూ.34 కోట్లు పూర్తిగా మాఫీ చేయాలని, ఆప్కో బకాయిలు రూ.40 కోట్లు వెంటనే చెల్లించాలని, హెల్త్ కార్డులు చేనేత కార్మికులకు అమలు చేయాలని, చేనేత కార్మికులకు ప్రత్యేకంగా గృహ నిర్మాణ పథకాన్ని చేనేత ఔళిశాఖ ద్వారా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా చేనేత సొసైటీ అధ్యక్షుడు చింతకింద రామారావు, కో–ఆపరేటివ్ సెంట్రల్బ్యాంక్ డైరెక్టర్ పేరిశెట్టి లాలయ్య, చేనేత సంఘ నాయకులు దుర్గారమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.