మంచి మాట: సాధన.. ఓ తపస్సు
ఏ విద్యలోనైనా పట్టు రావాలంటే సాధన అవసరం. అది నిరంతరం కొనసాగాలి. ‘అభ్యాసం కూసు విద్య..’ అన్నారు కదా పెద్దలు. అభ్యసించటానికి శ్రద్ధాసక్తులే కాక అకుంఠిత దీక్ష కావాలి. దానికి పట్టుదల కలవాలి. ఇష్టపడి నేర్చుకున్న ఒక విద్యను అభ్యసించవలసి వుంటుంది.
ఆ విద్యను సరిగా ఒక గురువు వద్ద నేర్చుకోవాలి. సుశిక్షితులైన పిదప నేర్చిన విద్యను అభ్యసించాలి. అపుడే దానికొక దిశ – దశ ఏర్పడతాయి. సక్రమ మార్గం ఏర్పడుతుంది. నేర్చుకున్న విద్య కరతలామలకమవ్వాలంటే అభ్యాసం వల్లే సాధ్యం. సరైన శిక్షణ లేని విద్య సాధన చేయటం సమయం వృథా. ఇక్కడ జాగరూకత చాలా అవసరం.
తపస్సుకు మనో నిశ్చలత అత్యంత ప్రధానమైనది. ఒక దైవాన్ని మనస్సు లో ప్రతిష్టించుకోవాలి. ఆ దేవుడి నామాన్నో.. మంత్రాన్నో ఉచ్చరిస్తూ వుండాలి.
జగాన్ని మరవాలి. పెదవుల కదలికలు నెమ్మది.. నెమ్మదిగా అదృశ్యమై మీ ఉచ్ఛ్వాస,.. నిశ్వాసాలే ఆ నామ, మంత్రాలవుతాయి. ఇది తపస్సులో గొప్ప దశ. ఆ అద్భుత స్థితికి చేరగలిగామా.. తపస్సులో అత్యున్నత దశకు చేరుకున్నట్టే. సాధనలో కూడ అంతటి త్రికరణ శుద్ధి కావాలి. అపుడే మనం అభ్యసిస్తున్నా దానిలో గొప్ప ప్రావీణ్యం పొందుతాం.
ఎలాగూ మన మనస్సుకు నచ్చిన విద్యను ఎంపిక చేసుకుంటాం కనుక ఆమూలాగ్రంగా నేర్చుకోవాలి. ఏకాగ్రతతో సాధన చేయాలి. మన శక్తియుక్తుల్ని ధారపోయాలి. సంకల్పం... పట్టుదల..మనోనిశ్చలత.. ఏకాగ్రత.. ఈ శక్తుల పిల్ల కాలువలన్నీ సాధన అనే మహా నదిగా మారిన వేళ.. మార్చుకున్న వారికి విద్య స్వాధీనమై.. విద్వత్తు వశమవదా..!
సా.. ధ.. న అనే మూడు అక్షరాల వెనుక ఇన్ని శక్తుల కలయిక ఉందని.. ఉంటుందని గ్రహించాలి. అలా గ్రహించిన వారే వాటిని తమలో అంతర్గతంగా వుంటే గుర్తిస్తారు. లేకుంటే అలవరచుకుంటారు.
అటువంటి వారే ఆ సాధనా తపస్సులో పరిపూర్ణులవుతారు. ఆ తపోఫలితాన్ని పొందుతారు.
సాధారణంగా ఎవరైనా.. నేర్చుకున్న విద్యను సాధన చేస్తారు. ఇది లోకరీతి. గురువు చెప్పిన విద్యను దాని లోతుపాతులను క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే బాగా అభ్యసించాలి. జీవితంతో పోల్చి చూసుకోవాలి. స్వీయ అనుభవాలు, ఇతరుల అనుభవాలు పరిశీలించాలి. ఆ సాధనకు విచక్షణ,
వివేచనల తోడు చేసి మరింతగా గట్టిపరచుకోవాలి.
కొందరికి అద్భుత ప్రతిభా వ్యుత్పత్తులంటాయి. వారి వైఖరే వేరు. అసలు గురువునుండి విద్యను గ్రహించి ఆకళింపు చేసుకునే పద్ధతే విభిన్నం. కౌరవులకు .. పాండవులకు విలువిద్య నేర్పే ఆరంభ దశలోనే.. బాణంతో చేధించవలసిన పక్షికన్ను తప్ప ఇంకేమి కనుపించటంలేదన్న అర్జునుడి మాటలతో అతనే ఆ విద్యకు సరైన అర్హుడని నిర్ణయించుకున్నాడు ద్రోణాచార్యుడు. గొప్ప కలయిక వారిరువురిది. ఏకాగ్రతతో గురువు చెప్పిన విద్యను సాధన చేయసాగాడు.
ఓ రాత్రివేళ.. దీపంలేని తరుణాన... భోజనం చేయగలిగిన పార్థుడు ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. చీకటిలో శబ్దాన్ని బట్టి.. ఆ దిశ వైపు బాణం వేసి వేటాడటం నేర్చుకున్నాడు. గొప్పగా సాధన చేసాడు. పట్టు సంపాదించాడు. తన గురువు మెప్పు పొందాడు. గురువు నేర్పిన విద్యను సాధన చేసే క్రమంలో వచ్చే ఆలోచనలకు తన అద్భుత ఊహశక్తిని మేళవించి తాను నేర్చిన.. నేర్చుకుంటున్న విద్యకు ఒక రూపు.. కోణం.. ఓ వైవిధ్యతను.. ఓ విభిన్నతను కలిపి ఆ విద్యను పరివ్యాపితం చేసాడు తన శక్తి యుక్తులతో. తన గురు ప్రశంస పొందాడు. అలా విశేషమైన ప్రతిభ కల శిష్యులుంటారు.
ప్రతిభకు వైవిధ్యం తోడైతే అది ఓ అద్భుతమే. అంతే కాదు.. ఓ నవ నవోన్మేషమే అవుతుంది. విశ్వనాథ సత్యనారాయణ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభృతులు అటువంటి ప్రతిభ సంపన్నులే.
నిరంతర సాధన మన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎనలేని ఆత్మ విశ్వాసాన్నిస్తుంది. పొరపాట్లు.. తప్పిదాలను గమనించి వాటిని సరిదిద్దుకునే అవకాశమిస్తుంది. విద్యాప్రతిభను ప్రదర్శించే సందర్భాలు నల్లేరు మీద బండిలా సాగాలంటే అభ్యాసం తప్పదు.
భూ గర్భంలోని రత్నం వంటిదే ప్రతిభ. రత్నాన్ని వెలిక్కితీసి సానపెడితే కాని ధగధగద్ధాయమానంగా ప్రకాశించదు. మనలోని పాడగలిగే గొంతుకకైనా.. అద్భుత కవితాశక్తికైనా... చిత్రలేఖనా ప్రతిభకైనా మార్గదర్శకత్వం చేయగల గొప్పగురువు కావాలి. ఆయన నుండి పొందిన మన జ్ఞానానికొక పరిపుష్టి.. పరిపూర్ణత.. అద్భుత స్వాధీనత.. రాణింపు రావాలంటే సాధన కావాలి.
ఒక విద్వాంసుడి.. లేదా ఒక కళాకారుడి ప్రతిభ నిజానికి పేరు ప్రఖ్యాతులు ఎంత బాగా వస్తే వారు అంత ఎక్కువగా సాధన చేయాలి. ఒక కళాకారుడు అత్యున్నత స్థాయికి చేరిన తరువాత అతని ప్రదర్శన తిలకించటానికి వచ్చేప్రేక్షకులు అది అత్యున్నతంగా ఉండాలని... ఉంటుందని ఆశించి వస్తారు. అది ఎంతో సహజమైనది. తాను ఎప్పుడూ ఇస్తున్న ప్రదర్శనే కదా.. సాధన ఎందుకు చేయాలన్న ఆలోచన ఏ కళాకారుడికైనా.. పండితుడికైనా వచ్చిన క్షణం అతడి ప్రతిభాభానుడికి మేఘాలు కమ్ముతాయి. కళాకారులు ఎంతటి లోకప్రసిద్ధులైతే అంతటి సాధన కావాలి. చేయాలి. వారి స్థాయికి తగ్గని ప్రదర్శన ఇవ్వాలి.
అలా ఇవ్వాలంటే సాధన చేయక తప్పదు.
సాధన చేసే క్రమంలో ఏకాగ్రత.. పట్టుదలలు సడలకూడదు. మనస్సు చంచలం కాకూడదు. సాధన ఎంత కాలం చేయాలి, దీనిని ఎక్కడ ఆపాలి..? అసలు ఆపచ్చా... అన్న ప్రశ్నలు.. సందేహాలు వస్తుంటాయి. సాధన నిలుçపు చేయటం అన్న ఆలోచనే పుట్టకూడదు మనలో. వచ్చిన క్షణం మనలో నేర్చుకునే తపన చనిపోతుంది. చాలానే నేర్చుకున్నామన్న తృప్తి.. ఇంకా నేర్చుకోవలసిన అవసరం లేదన్న ఆలోచనే అందుకు కారణం!
సాధనకు దూరమయ్యామంటే నేర్చుకున్న విద్య మీద పట్టు తగ్గచ్చు. అందుకే సాధన ఒక జీవనది కావాలి. ఎంత సాధన చేస్తే. అంత పరిపూర్ణత. అంత అలవోకగా చేయగల సామర్థ్యం వస్తుంది. నేర్చుకునే సమయంలో సాధన చాలా మంది చేస్తారు. ఇది సహజం. ఒక దశకు చేరుకున్న తరువాత శ్రద్ధ పెట్టం. కాని సాధన ఊపిరున్నంత వరకు చేయాల్సిందే. అలా చేసినవారే తమ విద్వత్తును, దానిలోని సారాన్ని అనాయాసంగా చదువరులకు లేదా శ్రోతలకు ఇవ్వగలరు. రంజింప చేయగలరు.
‘మాలో మీరనే ఉత్కృష్టత నిరంతరాభ్యాసం వల్ల ఒక అలవాటుగా మారింది’ అన్నారు గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్.