తలాక్ లాక్.. ఇప్పుడు విడాకులు ఎలా?
సాక్షి, ఆగ్రా: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టు ఆరు నెలలపాటు నిషేధం విధించటంతో ఇస్లాం వివాహ చట్టాల్లో విడాకుల అంశం సుప్తావస్థలో ఉండిపోయింది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయాలను అన్వేషించే పనిలో పడ్డారు ఇస్లాం మత పెద్దలు. మరోవైపు ఉత్తర ప్రదేశ్లోని మదరసాలు సరైన పద్ధతిలో విడాకులు తీసుకోవటం ఎలా అన్న అంశం అవగాహన కల్పించేందుకు సిద్ధమైపోయాయి.
‘సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో మత పెద్దలతో మదరసాలలో భేటీ అవుతున్నాం. ఆ చర్చా కార్యక్రమాల్లో విద్యార్థులు కూడా పాలు పంచుకుంటున్నారు. సరైన తలాక్ విధానం ఎలా ఉండాలి? అన్న అంశంపై అన్ని చోట్లా సదస్సులు నిర్వహిస్తాం. విడాకులు తీసుకోవటం ఎలా అన్న విధానంపై విద్యార్థుల ద్వారా ముస్లిం పురుషులకు అవగాహనం కల్పిస్తాం. ’ అని సున్ని బరెల్వి వర్గ నేత మౌలానా సుబుదిన్ రజ్వీ తెలిపారు. ప్రస్తుతం విడాకులపై స్పష్టమైన పద్ధతి లేకపోవటంతో కొన్ని సమస్యలు తలెత్తటం సహజం. అయితే మహిళలు పోలీస్ స్టేషన్లు, కోర్టులను ఆశ్రయించకపోవటమే ఉత్తమం అని సుబుదిన్ సూచించారు.
ఇక ముస్లిం విడాకుల విధానాన్ని ఇప్పుడు పూర్తిగా ప్రక్షాళన చేయాల్సి ఉంటుందని ముఫ్తీ ముద్దాసర్ ఖాన్ అనే మరో మదరసా నిర్వాహకుడు వ్యాఖ్యానించారు. అయితే తొందరపడి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో మరోసారి వివాదాలు తలెత్తే అవకాశం ఉండటంతో ఈసారి ప్రభుత్వానికే ఆ అంశం వదిలేయటం ఉత్తమమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం ఆగ్రాలో 200 మదరసాలు ఉండగా, అందులో 150 మదరసాలు అలీఘడ్లోనే ఉన్నాయి. వీటిల్లో ప్రతి శుక్రవారం మీటింగ్లు నిర్వహించి విడాకుల విధానంపై ఓ రూపకల్పన చేయనున్నారు. తొలుత మదరసాల్లో వీటిని పాఠ్యాంశాలుగా బోధించిన విద్యార్థుల ద్వారా అవగాహన సదస్సులను నిర్వహిచనున్నారు.