ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేయండి
అదనపు సీఈఓ అనూప్‌సింగ్
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న తప్పులను సరిచేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అదనపు చీఫ్ ఎన్నికల అధికారి అనూప్‌సింగ్æఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. ఓటర్ల జాబితాలోని తప్పులు, డబుల్ ఎంట్రీలు, కచ్చితమైన ఫొటోలు, ఓటర్ వివరాలు సరిచేయడంతో పాటు డమ్మీ ఓటర్లను జాబితా నుంచి తొలగించడం వంటి పనులను వేగవంతం చేయాలన్నారు. మున్సిపాలిటీలలోని పోలింగ్ కేంద్రాలను, అధికారుల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి బౌండరీలను పేపర్‌పై స్కెచ్ వేసుకొని గూగుల్ మ్యాప్‌కు, జీఐఎస్ అప్లికేషన్‌కు ఈనెల 31వ తేదీ లోపు అప్లోడ్ చేయాలని సూచించారు. ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో సరిచేయడంతో పాటు ఖచ్చితమైన ఓటర్ వివరాలతో సెప్టెంబర్ 31 వరకు సాంకేతిక ప్రక్రియను పూర్తి చేసి డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలను ప్రకటించాలన్నారు. ఈనెల 29న జిల్లా ఎన్ఐసీ డీఐఓ, టెక్నికల్ సిబ్బందికి ఓటర్ల జాబితాల సవరణలు, ఇతర అంశాలపై హైదరాబాద్‌లో ట్రైనింగ్ ఇవ్వనున్నామని తెలిపారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్వో భాస్కర్, ఎన్ఐసీ డీఐఓ మూర్తి, డిసెక్షన్ తహసీల్దార్ సువర్ణరాజు, ఎన్నికల విభాగం జూనియర్ సహాయకులు కష్ణకుమార్లు హాజరయ్యారు.