సంక్షేమ హాస్టళ్లు..కష్టాల లోగిళ్లు
సాక్షి నెట్వర్క్ : అదే పరిస్థితి... ఏళ్లు గడుస్తాయి... కోట్ల రూపాయల నిధులు ఖర్చయిపోతాయి... పేపర్ల మీద ఫైళ్లు చక్కర్లు కొడతాయి... పైరవీలు భారీగా జరుగుతాయి... బండ్లు ఓడలయినట్టు కొందరు అధికారుల ‘జీవన ప్రమాణాలు’ ఊహించని విధంగా మారిపోతాయి.. కానీ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు మాత్రం అష్టకష్టాలు తప్పడం లేదు. అటు అధికారులకు గానీ, ఇటు పాలించే రాజకీయ నాయకులకు గానీ పేదల చదువులపై మక్కువ లేకపోవడంతో సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు తిష్ట వేసే ఉంటున్నాయి. కాలచక్రం గిర్రున తిరిగి సంవత్సరాలు గడిచిపోతున్నా అదే దుస్థితి. సరిగా ఉడకని అన్నం, నాలుగు చెంచాల ఉప్మా.. నీళ్లచారు... ఇదీ హాస్టల్ పిల్లలకు పెట్టేది. పకడ్బందీ మెనూ రూపొందించి ఫలానా ఆహారం పిల్లలకు పెట్టాలని హైదరాబాద్ నుంచి వచ్చే ఆదేశాలూ అమలు కావు. మరుగుదొడ్లుండవు... చద్దర్లుండవు. వాతావరణంలో మార్పులొచ్చి చల్లటి చలి పెడుతున్నా..
ఆ చలికి వణుకుతూ పడుకోవాలే తప్ప కప్పుకోవడానికి దుప్పట్లుండవు. అద్దెభవనాల్లోనే వెళ్లదీయాల్సిందే. కాస్మొటిక్ బిల్లులు రాక పౌడర్లు, దువ్వెనలు ఉండక కళాహీనంగా పాఠశాలలకు వెళ్లాలి. సరిగ్గా అన్నం తినేందుకు ప్లేట్లు రావు.. నీళ్లు తాగేందుకు గ్లాసులుండవు... ఇలా సమస్యల అడ్డాలుగా మారిన హాస్టళ్లలోనే భావిభారత పౌరుల బాల్యం గడిచిపోతోంది. కష్టాల కూడళ్లలోనే మట్టిలో మాణిక్యాలు విద్య నేర్చుకుంటున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి... ఈ పరిస్థితికి కారకులెవరు? రాజకీయ నాయకులా? విద్యార్థి సంఘాలా? ఓట్లేసిన పేద విద్యార్థుల తల్లిదండ్రులా?... కారకులెవరైనా కారణమేదైనా... జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు ఎలా ఉన్నాయని తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నం చేసింది. జిల్లాలోని అన్ని మండలాల్లోని హాస్టళ్లను ‘సాక్షి’ నెట్వర్క్ సందర్శించింది.
జిల్లా కేంద్రంలో
నల్లగొండ పట్టణంలోని శాంతినగర్‌లోని బీసీ బాలుర వసతి గృహం భవనంపై పెచ్చులు ఊడాయి. అద్దె భవనంలో హాస్టల్ కొనసాగుతుంది. దీంట్లో 150 మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. తిప్పర్తిలో బీసీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో కొనసాగుతుంది. ఎస్సీ బాలుర హాస్టల్లో టాయిలెట్స్ లేవు. వంద మంది విద్యార్థులకుగాను ఒకటే టాయిలెట్ ఉంది. విద్యార్థులు సక్రమమైన భోజనం పెట్టడంలేదు. మోనూ పాటించడ ం లేదని విద్యార్థులు చెబుతున్నారు. అన్ని హాస్టళ్లకు దుప్పట్లు, బెడ్ షీట్లు వచ్చాయి.