Cost of Revenue
-
మిగులు కాదు లోటు!
♦ 2015-16లో డిసెంబర్ వరకు రూ.8 వేల కోట్ల లోటు ♦ రాష్ట్ర రెవెన్యూ వ్యయం రూ.54 వేల కోట్లు.. రాబడి రూ.46 వేల కోట్లు ♦ అంచనాలు గల్లంతు భూముల అమ్మకంపై ఆశలు ఆవిరి ♦ అంచనా రూ.13,500 కోట్లు... ఇప్పటికి వచ్చింది రూ.350 కోట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆదాయ వ్యయాలు ఇప్పటికీ కుదుటపడలేదు! ఆశించినంత ఆదాయం రాకపోవటం.. అంతకు మించి ఖర్చులుండటంతో ఈ ఏడాది కూడా అంచనాలు తలకిందులయ్యాయి. నిరుడు మిగులు బడ్జెట్ ప్రకటించినప్పటికీ వాస్తవ ఆదాయ వ్యయాలు లోటు దిశగానే పయనిస్తున్నాయి. ఏనెలకానె లా గడ్డు పరిస్థితులు వెంటాడుతున్నాయి. రెవెన్యూ రాబడులతో పోలిస్తే రెవెన్యూ వ్యయం ఎక్కువగా నమోదవుతోంది. ఈ లోటును సర్దుబాటు చేసేందుకు నెలనెలా బాండ్ల విక్రయం ద్వారా అప్పులు తెచ్చుకోవటం తప్ప గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. వచ్చే బడ్జెట్ తయారీకి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో వాస్తవ ఆదాయ వ్యయాలను ప్రభుత్వం నిశితంగా సమీక్షించుకుంటోంది. మూస పద్ధతిలో కాకుండా కొత్త పంథాలో బడ్జెట్ తయారు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించటంతో వచ్చే బడ్జెట్ ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు (2015-16) ఆదాయ వ్యయాలు పరిశీలిస్తే ఖజానాలో డొల్లతనం కనిపిస్తుండటం గమనార్హం. డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఖజనాకు రూ.46 వేల కోట్ల రెవెన్యూ ఆదాయం రాగా... రూ.54 వేల కోట్ల వ్యయం నమోదైంది. నికరంగా రూ.8 వేల కోట్ల లోటు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రణాళికేతర వ్యయమే ఎక్కువ ప్రణాళికేతర వ్యయం ప్రభుత్వానికి గుదిబండగా మారింది. డిసెంబర్ వరకు నమోదైన ఖ ర్చులో ప్రణాళిక వ్యయం కేవలం రూ.16 వేల కోట్లే ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా రూ.38 వేల కోట్లు ప్రణాళికేతర వ్యయమే కావడం గమనార్హం. అందుకే వచ్చే బడ్జెట్లో దుబారాను తగ్గించాలని, ప్రణాళికేతర వ్యయాన్ని కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆదాయ లక్ష్యం గగనమే: గత బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక వ్యయం రూ.52,383 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.63,306 కోట్లుగా ప్రకటించింది. మొత్తం రూ.1.15 లక్షల కోట్లతో బడ్టెట్ ప్రతిపాదించింది. కానీ.. మొదటి తొమ్మిది నెలల వ్యవధిలో రెవెన్యూ ఆదాయం రూ.46 వేల కోట్లకు పరిమితమైంది. దీన్నిబట్టి ప్రతినెలా సగటున రాష్ట్ర ఆదాయం రూ.5,100 కోట్లకు మించటం లేదని అర్థమవుతోంది. ఈ లెక్కన మిగిలిన మూడు నెలల్లో రూ.16 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. ఆర్థిక సంవత్సరం చివర్లో పన్నుల ద్వారా వచ్చే రాబడి పెద్దమొత్తంలో ఉంటుందని అంచనా వేస్తున్నప్పటికీ.. మొత్తం ఆదాయం రూ.70 వేల కోట్ల నుంచి రూ.75 వేల కోట్లు దాటేలా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన మిగులు బడ్జెట్‌ను ప్రతిపాదించిన సర్కారు తమ అంచనాలను ఎంత మేరకు సవరించుకుంటుందో అన్న అంశం ఆసక్తి రేపుతోంది. భూముల అమ్మకంతో అంతంతే.. భూముల అమ్మకంపై ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకున్నా అవి నెరవేరలేదు. భూములు, ఆస్తుల అమ్మకం ద్వారా రూ.13,500 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ భూముల అమ్మకంతో కేవలం రూ.350 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటికే విక్రయానికి సిద్ధంగా ఉన్న భూములు అమ్ముడు పోయినా ఈ ఏడాదిలో రూ.1,000 కోట్లకు మించి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. దీంతో స్టాంపులు రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ ద్వారా వచ్చే ఆదాయంపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. నిరుటి కంటే వీటి ద్వారా వచ్చే ఆదాయం 15 శాతం వృద్ధి చెందిందని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆర్థిక సంక్షోభంలో రాష్ర్టం
రాష్ర్టం ఆర్థిక సంక్షోభంలో పడింది... నెలసరి జీతాలకు సైతం అప్పులు చేసే గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఆశించినంత ఆదాయం రాకపోవడం, అంచనాలకు మించిన వ్యయం నమోదు కావడంతో రెండో ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ప్రభుత్వం ఎంచుకున్న భారీ లక్ష్యాలు, తలపెట్టిన ప్రతిష్టాత్మక పథకాలు, ముఖ్యమంత్రి వరుస వరాల జల్లులతో నిధుల సర్దుబాటుకు మల్లగుల్లాలు పడుతోంది. బాండ్ల విక్రయం ద్వారా ఆర్బీఐ నుంచి అప్పులు తెచ్చుకోవడం తప్ప గత్యంతరం లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర నుంచి వచ్చిన ఉపాధి హామీ పథకం నిధులు రూ.500 కోట్లు ఖజానాకు మళ్లించింది. * రూ.2,500 కోట్లు దాటిన లోటు * అడ్డదారిలో కేంద్రం నిధుల వాడకం * ప్రశ్నార్థకంగా రైతుల రుణమాఫీ నిధులు * గోదావరి పుష్కరాలకు నిధుల కొరత * ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ * వచ్చే నెల ఉద్యోగుల జీతాలకు కటకట సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలో ఖజానా లోటు ఇప్పటికే రూ. 2,500 కోట్లు దాటిపోయింది. ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర ఖజానాకు వచ్చిన రెవెన్యూ ఆదాయం రూ.7,261 కోట్లు కాగా, అదే సమయానికి తెచ్చిన రూ.2 వేల కోట్లకు పైగా అప్పుతో ఆదాయం రూ.9,698 కోట్లకు చేరుకుంది. ఈ రెండు నెలల్లో రెవెన్యూ వ్యయం రూ.8, 501 కోట్లు దాటింది. ప్రణాళిక వ్యయంతో కలిపితే మొత్తం రూ.10,921 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రూ.1,223 కోట్ల లోటు నెలకొంది. ఈ రెండు నెలల లోటును పూడ్చుకునే లోగా జూన్ నెలలో చోటు చేసుకున్న పరిణామాలు సర్కార్‌ను మరింత కుంగదీశాయి. ఎక్సైజ్ అమ్మకాలపై చెల్లించాల్సిన బకాయిల కింద ఐటీ శాఖ ఆర్బీఐ నుంచి రూ.1,274 కోట్లు సీజ్ చేయడంతో ఆర్థిక నిధుల నిర్వహణ ఒక్కసారిగా తలకిందులైంది. రెండో ఏడాది రుణమాఫీ రెండో విడతగా జూలైలో విడుదల చేసే రూ. 2,207 కోట్లు సర్దుబాటు చేయడం ఆర్థిక శాఖకు ఇబ్బందిగా మారుతోంది. ఇదిలాఉండగా, ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన హామీ ప్రకారం కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్సమెంట్ బకాయిలు రూ.2,500 కోట్ల బకాయి బిల్లులు ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు గోదావరి పుష్కరాలకు రూ.600 కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బడ్జెట్లో కేటాయించిన రూ.100 కోట్లకు మించి పైసా ఇచ్చే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ప్రాధాన్యతా క్రమంలో తక్షణ అవసరాలు.. వచ్చే నెల ఉద్యోగుల జీతాలకు అవసరమయ్యే ఖర్చులకు అప్పులు చేయడం తప్ప గత్యంతరం లేదని సర్కారు అప్రమత్తమైంది.