ఆర్థిక సంక్షోభంలో రాష్ర్టం | State of economic crisis | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంక్షోభంలో రాష్ర్టం

Published Mon, Jul 6 2015 2:03 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

ఆర్థిక సంక్షోభంలో రాష్ర్టం - Sakshi

ఆర్థిక సంక్షోభంలో రాష్ర్టం

రాష్ర్టం ఆర్థిక సంక్షోభంలో పడింది... నెలసరి జీతాలకు సైతం అప్పులు చేసే  గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఆశించినంత ఆదాయం రాకపోవడం, అంచనాలకు మించిన వ్యయం నమోదు కావడంతో రెండో ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ప్రభుత్వం ఎంచుకున్న భారీ లక్ష్యాలు, తలపెట్టిన ప్రతిష్టాత్మక పథకాలు, ముఖ్యమంత్రి వరుస వరాల జల్లులతో నిధుల సర్దుబాటుకు మల్లగుల్లాలు పడుతోంది.

బాండ్ల విక్రయం ద్వారా ఆర్‌బీఐ నుంచి అప్పులు తెచ్చుకోవడం తప్ప గత్యంతరం లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర నుంచి వచ్చిన ఉపాధి హామీ పథకం నిధులు రూ.500 కోట్లు ఖజానాకు మళ్లించింది.    
 
 
* రూ.2,500 కోట్లు దాటిన లోటు
* అడ్డదారిలో కేంద్రం నిధుల వాడకం
* ప్రశ్నార్థకంగా రైతుల రుణమాఫీ నిధులు
* గోదావరి పుష్కరాలకు నిధుల కొరత
* ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్
* వచ్చే నెల ఉద్యోగుల జీతాలకు కటకట

సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలో ఖజానా లోటు ఇప్పటికే రూ. 2,500 కోట్లు దాటిపోయింది. ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర ఖజానాకు వచ్చిన రెవెన్యూ ఆదాయం రూ.7,261 కోట్లు కాగా, అదే సమయానికి తెచ్చిన రూ.2 వేల కోట్లకు పైగా అప్పుతో ఆదాయం రూ.9,698 కోట్లకు చేరుకుంది.

ఈ రెండు నెలల్లో రెవెన్యూ వ్యయం రూ.8, 501 కోట్లు దాటింది. ప్రణాళిక వ్యయంతో కలిపితే మొత్తం రూ.10,921 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రూ.1,223 కోట్ల లోటు నెలకొంది. ఈ రెండు నెలల లోటును పూడ్చుకునే లోగా జూన్ నెలలో చోటు చేసుకున్న పరిణామాలు సర్కార్‌ను మరింత కుంగదీశాయి. ఎక్సైజ్ అమ్మకాలపై చెల్లించాల్సిన బకాయిల కింద ఐటీ శాఖ ఆర్‌బీఐ నుంచి రూ.1,274 కోట్లు సీజ్ చేయడంతో ఆర్థిక నిధుల నిర్వహణ ఒక్కసారిగా తలకిందులైంది.

రెండో ఏడాది రుణమాఫీ రెండో విడతగా జూలైలో విడుదల చేసే రూ. 2,207 కోట్లు సర్దుబాటు చేయడం ఆర్థిక శాఖకు ఇబ్బందిగా మారుతోంది. ఇదిలాఉండగా, ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన హామీ ప్రకారం కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్‌‌సమెంట్ బకాయిలు రూ.2,500 కోట్ల బకాయి బిల్లులు ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్నాయి.

మరోవైపు గోదావరి పుష్కరాలకు రూ.600 కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బడ్జెట్‌లో కేటాయించిన రూ.100 కోట్లకు మించి పైసా ఇచ్చే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ప్రాధాన్యతా క్రమంలో తక్షణ అవసరాలు.. వచ్చే నెల ఉద్యోగుల జీతాలకు అవసరమయ్యే ఖర్చులకు అప్పులు చేయడం తప్ప గత్యంతరం లేదని సర్కారు అప్రమత్తమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement