దళారుల చేతిలో రైతన్న దగా
కల్వకుర్తి రూరల్: అసలే కరువు పరిస్థితులు.. ఆపై పండిన కొద్దిపాటి పంటకు కూడా మద్దతుధర లభించక పత్తి రైతులు దళారుల చేతిలో దగాపడుతున్నారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా ఆశించిన ధర లభించడం లేదు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ ఏడాది సుమారు 1.3లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేసినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ సీజన్లో పత్తిని కొనుగోలు చేసేందుకు సీసీఐ ద్వారా మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. రోజుకు 50 క్వింటాళ్ల లెక్కన ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సుమారు నాలుగు లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలుచేసినట్లు అంచనా. ఇంతవరకు బాగానే ఉన్నా.. నాణ్యత పేరుతో రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. రైతులకు మద్దతుధర కల్పిస్తూ సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేస్తూ రైతులకు మేలు చేకూర్చాలనే ప్రభుత్వం నిర్ణ యం కాటన్‌మిల్లుల యజమానులకు లాభాలపంట పండిస్తోంది. ప్రభుత్వ పత్తి క్వింటాలుకు రూ.4,050 చెల్లించాలని నిర్ణయించినప్పటికీ నాణ్యతను సాకుగా చూపుతూ క్వింటాలుకు రూ.3600 నుంచి రూ.3900 మాత్రమే చెల్లిస్తున్నారు. అదే పత్తిని బినామీ పాస్‌పుస్తకాల సాయంతో రైతుల నుంచే కొనుగోలు చేస్తున్నట్లుగా కాటన్‌మిల్ యజమానులు సీసీఐకి విక్రయిస్తున్నారు. ఇలా రైతులను నిండా ముంచుతూ కాటన్ మిల్లు నిర్వాహకులు భారీగా లాభాలు పొందుతున్నారు. చాలా మిల్లుల్లో రైతుల పాస్‌పుస్తకాల ద్వారా కొనుగోలు చేసిన పత్తిని సీసీఐకి విక్రయిస్తున్నారు.
చెక్కులకు బదులు చీటిలు
నిబంధనల ప్రకారం పత్తిని విక్రయించేందుకు వచ్చిన రైతుకు చెక్కు ఇవ్వా ల్సి ఉంటుంది, అయితే అందుకు విరుద్ధంగా మిల్లుల నిర్వాహకులు బుక్కచీటిలు రాసిస్తున్నారు. దీనికితోడు నాణ్యతతో కూడిన పత్తిని తీసుకొచ్చినా.. ఏదో ఒక సాకుతో తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఇదేమటని కాటన్‌మిల్లు నిర్వాహకులను ప్రశ్నిస్తే కొనుగోళ్లను నిలిపేస్తున్నారు. దీనిపై సీసీఐ అధికారులు నోరు మెదపడం లేదు. దీంతో పాటు మిల్లుల్లో పత్తిని రెండు కుప్పలుగా విభజించి రెండు రకాలకు వేర్వేరు ధరలు నిర్ణయిస్తూ రైతులను దగా చేస్తున్నారు. రైతులు విక్రయించేందుకు తెచ్చిన పత్తిలో నాణ్యతాలోపం ఉన్నప్పటికీ కొంత ధర తగ్గించైనా సరే కచ్చితంగా కొనుగోలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో సాగుచేసిన పంటలో అధికమొత్తం నష్టపోయిన రైతులు, చేతికందిన కొద్దిపాటి పత్తికి సైతం మద్దతుధర లభించకపోవడంతో మరింత కుదేలవుతున్నారు. పత్తి విక్రయాలపై విచారణ జరిపి, మద్దతు ధర లభించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.