సోయాకు సాయమేది?
- రాష్ట్ర రుణ ప్రణాళికలో ఊసే లేని సోయాబీన్
- వద్దు వద్దంటున్న పత్తికి ఏకంగా రూ.7 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ‘పత్తి వద్దు.. సోయా ముద్దు..’ కొద్దిరోజులుగా ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలివీ! పత్తి ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సుంకం పెంచినందున మున్ముందు ధరలు భారీగా పడిపోయే ప్రమాదం ఉందని సాక్షాత్తూ సీఎం కేసీఆర్ రైతులను అప్రమత్తం చేశారు. పత్తిని తగ్గించి సోయా వంటి పంటలను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. సర్కారు చర్యలు మాత్రం అందుకు తగ్గట్టుగా లేవు. పత్తి కంపెనీలకు ముకుతాడు వేసి సోయాను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. 2016-17 రుణ ప్రణాళికలో పత్తికే ప్రాధాన్యం ఇచ్చారు.
ప్రోత్సహించాలనుకుంటున్న సోయాబీన్‌ను విస్మరించారు. తగ్గించాలనుకుంటున్న పత్తికి ఏకంగా రూ.7వేల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రుణ ప్రణాళికలో సోయా పంట ఊసే లేదు. జిల్లాల్లో వ్యవసాయాధికారులు చాలామంది పత్తి కంపెనీలతో కుమ్మక్కై సోయాబీన్‌ను నిరుత్సాహపరుస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సోయాబీన్ పంటను కేవలం మూడు నాలుగు జిల్లాల్లోనే ప్రధానంగా సాగు చేస్తుండగా.. మిగిలిన జిల్లాల్లో రైతులను ఒప్పించడంలో అధికారుల వైఫల్యం కనిపిస్తోంది. రైతులకు 3.75 లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలు సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించినా, ఇప్పుడు డిమాండ్ లేదని, 2లక్షల క్వింటాళ్లు సరఫరా చేస్తే సరిపోతుందని భావిస్తున్నారు.
రెండింతల సాగు సాధ్యమేనా?
2015 ఖరీఫ్‌లో మొత్తం సాధారణ పంటల సాగు విస్తీర్ణం 1.03 కోట్ల ఎకరాలు కాగా.. 88.82లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యా యి. అందులో పత్తి 42.22 లక్షల ఎకరాల్లో సాగైంది. మొక్కజొన్న 10.57లక్షల ఎకరా ల్లో, సోయాబీన్ 6.35లక్షల ఎకరాల్లో సాగైం ది. మొత్తం పంటల సాగులో పత్తి సాగు విస్తీర్ణమే సగం వరకు ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈసారి పత్తి సాగు విస్తీర్ణాన్ని కనీసం 10 లక్షల ఎకరాలకుపైగా తగ్గించాలన్నది సర్కారు ఆలోచన. సోయాబీన్ గతేడాది 6.35 లక్షల ఎకరాల్లో సాగైతే ఈసారి దాదాపు 12 లక్షల ఎకరాల వరకు పెంచాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు 3.75లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని నిర్ధారించింది.
వద్దు.. వద్దంటూనే...
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా 2016-17 ఖరీఫ్, రబీ సీజన్లకు రూ.29,101 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) తాజాగా నిర్ణయించిం ది. సాగు తగ్గించాలంటూనే పత్తి సాగు చేసే రైతులకు రూ.7,087కోట్ల రుణాలు ప్రతిపాదించారు. నూనె గింజల సాగుకు రూ.456 కోట్లతో సరిపెట్టారు. అందులో సోయాబీన్‌కు ఎంత మేరకు రుణాలు కేటాయించారన్న స్పష్టత కూడా లేదు. కాగా, పత్తిని వద్దని ప్రభుత్వం చెప్పగానే.. పత్తి విత్తన కంపెనీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. రేటు తగ్గించి పత్తిని ప్రోత్సహించేలా ప్రచారం చేస్తున్నాయి.
ప్రకటనలకే పరిమితం
సోయాబీన్ ప్రోత్సహించాలని చెబుతున్న ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. కిందిస్థాయిలో పత్తిని నిరుత్సాహపరిచే చర్యలు శూన్యం. పత్తిపై రైతుల్లో అసంతృప్తి ఉంది. కనీసం భూసార పరీక్షలు చేయకుండా సోయాబీన్‌ను ఎలా ప్రోత్సహిస్తారు? ఇప్పటివరకు సోయాబీన్ విత్తనాలను రైతుల వద్దకు తీసుకొని రాలేదు.
- సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు అఖిల భారత రైతు సంఘం