పండుగొచ్చే.. పత్తి మార్కెట్ లేకపాయే..
పత్తిలోడు వాహనంలో కూర్చున్న ఈ రైతు పేరు రాంచందర్. జమ్మికుంట మండలం వావిలాల గ్రామం. తనకున్న రెండెకరాల్లో పత్తి సాగు చేయగా... రెండు రోజులు ఏరితే 10 బస్తాలైంది. జమ్మికుంట పత్తి మార్కెట్‌కు సెలవు ప్రకటించడంతో శనివారం అర్ధరాత్రి వరంగల్ మార్కెట్‌కు బయలుదేరాడు.
జమ్మికుంట మార్కెట్ తెరిచి ఉంటే అదనపు భారంతోపాటు దూర ప్రయాణం ఉండేది కాదంటున్నాడు. స్థానిక మార్కెట్ ఉంటే బస్తాకు రూ.25 ఆటో కిరాయి చెల్లించేది. వరంగల్‌కు రూ.80 అవుతుందని, రాత్రి అక్కడ మార్కెట్లో దోమలు, ఈగలు తెల్లదాక తెలివితోటి ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశాడు.
జమ్మికుంట:
దీపావళి పండగ వేళ జమ్మికుంట పత్తి మార్కెట్ బోసిపోతోంది. దీంతో పండగ ఖర్చుల కోసం...తెచ్చిన అప్పులు చెల్లించేందుకు పత్తి రైతు పడరాని పాట్లు పడుతున్నారు. పట్టించుకునే దిక్కు లేకపోవడంతో పత్తిని అమ్ముకునేందుకు పక్కజిల్లాకు పరుగులు పెడుతున్నారు. అర్ధరాత్రి వేళ అష్టకష్టాలు పడుతూ వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ బాటపడుతున్నారు.
రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్ ఇలాకలో రైతులు పత్తిని అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 26 వరకు పత్తి మార్కెట్‌కు మార్కెట్ కార్యదర్శి సెలవులు ప్రకటించడంతో పండగ సమయంలో రైతులు సందిగ్ధంలో పడ్డారు.శుక్రవారం నుంచి సెలవులు ప్రకటించిన క్రమంలో కొందరు రైతులకు ఈ విషయం తెలియక మార్కెట్‌కు ఉత్పత్తులను తీసుకొచ్చారు. వెంటనే పత్తి వ్యాపారులను పిలిపించి కొనుగోళ్లు జరిపించారు.
మార్కెట్లో మైక్‌ల్లో శనివారం నుంచి 26వరకు పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో పండుగ ఖర్చుల కోసం...పత్తి ఏరిన కూలీల డబ్బులు చెల్లించేందుకు.. పంట పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చేందుకు అన్నదాతలు అవస్థలు పడాల్సిన పరిస్థితి. చేతికి వచ్చిన పత్తిని అమ్ముకునే సమయంలో పత్తిమార్కెట్ బంద్ కావడంతో వారికి ఇబ్బందులు మొదలయ్యాయి.
వరంగల్ బాట..
జమ్మికుంట పత్తి మార్కెట్ బంద్ కావడంతో రైతులు పండుగ అవసరాల కోసం ఏరిన పత్తిని అమ్ముకునే ందుకు వరంగల్ బాట పట్టారు. శుక్రవారం అర్ధరాత్రి జమ్మికుంట, వీణవంక మండలాల నుంచి దాదాపు రెండు వేల క్వింటాళ్ల పత్తిని ఎనమాముల పత్తి మార్కెట్‌కు తీసుకెళ్లారు. అర్ధరాత్రి 12గంటల సమయంలో టాటా ఏసీలు, డీసీఏం వాహనాల్లో తరలించారు. ఏ వాహనం చూసినా పత్తి బస్తాలే కన్పించాయి. వేలాది బస్తాలు పత్తి పక్క జిల్లాకు తరలిపోవడంతో జమ్మికుంట మార్కెట్ ఆదాయానికి గండి పడింది.