Cotton Purchasing Centers
-
చంద్రబాబు ఆర్థిక క్రమశిక్షణ తప్పారు..
సాక్షి, కర్నూలు : చంద్రబాబు నాయుడు ఆర్ధిక క్రమశిక్షణ తప్పి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ విమర్శించారు. ఆదివారం జిల్లాలో పర్యటించిన మంత్రి గోపాల మిత్ర, ఇతర శాఖల నిధులను పసుపు కుంకుమకు తరలించారని ఆరోపించారు. నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబు రైతులను నిర్లక్ష్యం చేశాడని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులెదురైనా రైతులకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రైతు పండించిన పంటకు మద్ధతు ధరను అందించాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి ఉన్నారని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పత్తి పంట కొనుగోలుకు ఈ క్రాప్ బుకింగ్‌ను ఏర్పాటు చేశామని, ఈ క్రాప్ బుకింగ్ లేకున్నా పత్తి కొనుగోలు చేస్తామని వెల్లడించారు. అవసరమైతే మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని, రైతులెవరూ కూడా గిట్టుబాటు ధర రావట్లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
పత్తి ధర ఢమాల్
ఆదిలాబాద్‌టౌన్: పత్తి ధర రోజురోజుకు పడిపోతోంది. క్వింటాలు ధర రూ.6వేలకు పైగా పెరుగుతుం దని భావించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. తెల్లబంగారంగా భావించే ధర ఢమాల్ అవుతోంది. పత్తి కొనుగోళ్లు ప్రారంభం రోజు క్వింటా లు పత్తి రూ.5800కి కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యాపారులు మంగళవారం కనీసం ప్ర భుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,450 కంటే తక్కువతో కొనుగోలు చేశారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం పది రోజుల నుంచి రోజురోజుకు ధర తగ్గుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బేళ్ల ధర తక్కువగా ఉందని, పత్తి గింజల ధర కూడా పడిపోయిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ ధర కంటే ఎక్కువగా చెల్లించలేమని కరాఖండిగా చెబుతున్నారు. దీంతో పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక, వేరే దారిలేక రైతులు వారు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. మద్దతు ధర కంటే తక్కువ.. మార్కెట్లో మద్దతు ధర కంటే తక్కువగా ప్రైవేట్ వ్యాపారులు ధర నిర్ణయించడంతో మార్కెటింగ్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ ద్వారా కొనుగోలుకు సిద్ధమయ్యారు. సీసీఐ సవాలక్ష నిబంధనలు విధించడంతో గత్యంతరం లేక రైతులు ప్రైవేట్ వ్యాపారులకే పంటను విక్రయించుకుంటున్నారు. సీసీఐలో పంట విక్రయించినా రైతులకు కూడా వారం పది రోజుల వరకు డబ్బులు చెల్లించకపోవడం, తదితర కారణాలతో రైతులు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ధరలో కొంత తేడా వచ్చినా ప్రైవేట్ వ్యాపారులకు అమ్మి అప్పటికప్పుడు డబ్బులను తీసుకెళ్తున్నారు. ఈ నెల 20న క్వింటాలు పత్తి ధర రూ.5600 ఉండగా, ఆ తర్వాత రూ.5550, రూ.5490, మంగళవారం రూ.5440 ధర నిర్ణయించారు. మద్దతు ధర కంటే ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.10 కంటే తక్కువగానే కొనుగోలు చేశారు. ఆశ నిరాశే.. ఆదిలాబాద్ జిల్లాలో చాలామంది రైతులు అధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేస్తారు. మొదట్లో పత్తి ధర రూ.5800 వరకు ఉండడంతో క్వింటాలుకు రూ.6వేలకు పైగా ధర వస్తుందని ఆశ పడ్డారు. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో బేళ్ల ధర తగ్గిందని ప్రైవేట్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బేల్ ధర రూ.43వేలకు పడిపోవడంతో పత్తి ధర తగ్గుతూ వస్తుందని, పత్తి గింజలు క్వింటాలుకు రూ.2వేల వరకు పడిపోయిందని చెబుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వ్యాపారులు ధరను పెంచేందుకు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. మంగళవారం సిద్దిపేటలో క్వింటాలుకు రూ.5250, వరంగల్‌లో రూ.5,300, ఖమ్మంలో రూ.5,450, జమ్మికుంటలో రూ.5,350తో కొనుగోలు జరిగాయని మార్కెటింగ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 40 శాతం తగ్గిన దిగుబడి.. మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారింది రైతుల పరిస్థితి. ప్రతియేడు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. గతేడాది అనావృష్టితో పంటలు నష్టపోగా, ఈ యేడాది అతివృష్టి కారణంగా పంట దిగుబడిపై ప్రభావం పడింది. గతం కంటే ఈసారి 40 శాతం దిగుబడి పడిపోయింది. ఎకరానికి రెండు మూడు క్వింటాళ్ల కంటే ఎక్కువ పత్తి దిగుబడి రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 10,65,378 క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరగగా, జిల్లా వ్యాప్తంగా ఈయేడాది ఇప్పటివరకు 4,07,372 క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. ఆదిలాబాద్ మార్కెట్లో 3,55,144 క్వింటాళ్లు, బోథ్‌లో 28వేల క్వింటాళ్లు, ఇచ్చోడలో 11వేల క్వింటాళ్లు, జైనథ్‌లో 9వేల క్వింటాళ్ల కొనుగోళ్లు చేపట్టారు. ఇప్పటివరకు సీసీఐ జిల్లాలో బోణీ చేయలేదు. గతేడాది 6,672 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. రైతులు ఆందోళన చెందవద్దు పత్తి ధర తగ్గుతుందని రైతులు ఆందోళన చెందవద్దు. మార్కెట్లో మద్దతు ధర కంటే తక్కువ ఉంటే సీసీఐ ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం సీసీఐని రంగంలోకి దించాం. తక్కువ ధరకు పంటను విక్రయించి నష్టపోవద్దు. – శ్రీనివాస్, మార్కెటింగ్ ఏడీ, ఆదిలాబాద్ -
పత్తి రైతులపై దళారుల పంజా
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో పత్తి రైతులు దళారుల దందాకు చిత్తవుతున్నారు. ప్రభుత్వ అలసత్వం, సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కేంద్రాలు ప్రారంభించకపోవడం దళారులకు కలిసి వస్తోంది. తూకం, ధరలో మోసం చేస్తూ నిండుగా ముంచేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పత్తికి మద్దతు ధరరాక రైతులకు అప్పులే మిగిలేలా ఉన్నాయి. పలువురు ఎరువుల, వడ్డీ వ్యాపారులు, ప్రజాప్రతినిధులు పత్తి వ్యాపారుల అవతారం ఎత్తుతున్నారు. గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకుని పత్తిని స్థానికంగా విక్రయించే విధంగా పావులు కదుపుతున్నారు. సిండికేట్‌గా ఏర్పడి తమ వ్యాపారాన్ని మూడు పూలు..ఆరుకాయలుగా కొనసాగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో సుమారు 2 లక్షల 31 వేల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. హెక్టార్‌కు సుమారు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మొదటి, రెండవ దశలో పత్తి తెంపేశారు. ఈ రెండు దశల్లో కలిపి హెక్టార్‌కు 7 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. అంటే ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 20 లక్షల క్వింటాళ్లకుపైగా దిగుబడి పొందారు. కానీ నేటివరకు సీసీఐ.. పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతోపాటు దసరా పండుగ సమీపించడం, కూలీలకు డబ్బులను చెల్లించడం కోసం రైతులు గ్రామాల్లోనే దళారులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో గత సంవత్సరం 19 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు నేటికి ఒక్క కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం పట్ల పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత అవసరాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు తక్కువ ధరకుఅమ్మాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాలు గత ఏడాది జిల్లాలో నకిరేకల్‌లో 2, చిట్యాలలో 2, చండూరులో 2, దేవరకొండలో 6, మాల్లో 5, మిర్యాలగూడలో 2 సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులనుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయించారు. కానీ వాటిని ఇప్పటివరకు ప్రారంభించని కారణంగా రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది వీటితోపాటు తిప్పర్తిలో కూడా సీసీఐ కొనుకోలు కేంద్రాన్ని అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు మార్కెటింగ్ అధికారులు పేర్కొన్నారు. కానీ నేటికీ వాటి ఊసేలేదు. మోసాలు ఇలా.. దళారులు గ్రామాల్లో మచ్చిక చేసుకున్న ఏజెంట్ల ద్వారా పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.5450 ఉండగా దళారులు రూ.4000 నుంచి రూ.4500 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే మద్దతు ధరలో క్వింటాకు వెయ్యి రూపాయల నుంచి రూ.1500 వరకు నష్టపోతున్నారు. అయితే దళారులు పత్తిని కొన్న వెంటనే డబ్బులను ఇస్తున్నారు. వెంటనే డ బ్బులను చెల్లిస్తున్నందున రైతులు.. వారికే పత్తిని విక్రయించడానికి సుముఖత చూపుతున్నారు. తూకంలో మోసం.. పత్తిని తూకం వేసేటప్పుడు ఎలక్ట్రానిక్ కాంటా లను వినియోగించాలనే నిబంధనలున్నాయి. అ ధికారుల నిర్లక్ష్యం కారణంగా దళారులు పాతరకం కాంటాలను వినియోగిస్తున్నారు. పాతరకం బా ట్లు వాడడంతోపాటు తూకంలో మోసాలకు పాల్పడుతూ క్వింటాపై సుమారు 15 కిలోల పత్తిని అదనంగా తూకం వేస్తున్నారు. దీనికారణంగా సుమారు రూ.750 వరకు రైతులు అదనంగా నష్టపోవాల్సి వస్తుంది. దళారులపై మార్కెటింగ్ శాఖ అధికారులు, తూనికల కొలతల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వారి మోసాలనుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు. -
పత్తి కొనుగోలుకు 200 కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి కొనుగోలుకు 200 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసు కోవాలని ఆయన జాయింట్ కలెక్టర్లను ఆదే శించారు. ఇకపై ప్రతి వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాలు రైతులకు సమీ పంలో ఉండే విధంగా వికేంద్రీకరించాలన్నారు. పత్తి, వరిధాన్యం, మొక్కజొన్న, సోయా బీన్ తదితర పంటల దిగుబడి, మార్కెట్లో ధర వంటి అంశాలపై శుక్రవారం ఆయన అధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యతగల పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ. 4,320 కన్నా ఎక్కువుందన్నారు. అయితే పత్తికి ధర రావడం లేదన్న వార్తలు వస్తున్నాయన్నారు. పత్తి మార్కెటింగ్ సీజన్ ముగిసే వరకు జాయింట్ కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. తేమ శాతంపై అవగాహన.. పత్తి తేమ శాతం 12 లోపే ఉండేలా రైతుల్లో అవగాహన పెంచాలని మంత్రి హరీశ్ అన్నారు. జిన్నింగ్ మిల్లుల దగ్గర రైతులపై అదనపు చార్జీల భారం వేయకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ఒక ఫోన్ నంబర్‌ను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. రైతు సమన్వయ సమితులు, స్థానిక వ్యవసాయ అధికారులను భాగస్వాములు చేసి రైతు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. 72 గంటల్లోపు ఖాతాలోకి డబ్బులు.. అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులు, ఎంపీలతో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు. పత్తి అమ్మిన వెంటనే 48 నుంచి 72 గంటలలోపు రైతుల ఖాతాలోకి నేరుగా ఆన్లైన్లో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాలు వారంలో ఆరు రోజులు పూర్తి స్థాయిలో పనిచేయాలన్నారు. జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న జిన్నింగ్ మిల్లుల అగ్రిమెంట్లను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని వరంగల్ సీసీఐ బ్రాంచి మేనేజర్ సిన్హాను ఆదేశించారు. కొన్ని చోట్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవడంలో జాప్యం జరుగుతోందని, వాటి వేగం పెంచాలన్నారు. -
43 పత్తి కొనుగోలు కేంద్రాలు కావాలి
► కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన మంత్రి హరీశ్‌రావు ► కాటన్ ప్లకింగ్ యంత్రాలు సబ్సిడీపై సరఫరా చేయాలి ► క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి ► కేంద్ర జౌళిశాఖ కార్యదర్శితో మంత్రి భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో143 పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే నెల 20వ తేదీలోపు వీటిని ప్రారంభించాలని, 3వ తేదీ నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఇక్కడ జలసౌధలో కేంద్ర జౌళిశాఖ కార్యదర్శి అనంతకుమార్‌సింగ్‌తో హరీశ్‌రావు సమావేశమయ్యారు. దళారులు, ట్రేడర్లు గోల్మాల్ చేయకుండా పక్కాగా పరిశీలించాలని ఆయన కోరారు. పత్తికి మద్దతు ధర రూ.4,320 కన్నా తగ్గితే వెంటనే సీసీఐ రంగంలోకి దిగి కొనుగోళ్ళు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులు పత్తి సేకరణను చేతులతో కాకుండా కాటన్ ప్లకింగ్ యంత్రాలద్వారా చేయాలని, వీటిని రైతులకు సబ్సిడీపై సరఫరా చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పత్తి సాగు పెరుగుతున్న నేపథ్యంలో క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్‌లను ఈ–నామ్ మార్కెట్లలో ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే రైతులు పత్తిని సేకరించడానికి కాటన్ సంచులను సబ్సిడీపై సరఫరా చేయాలన్నారు. సిబ్బందిని నియమించండి.. పత్తి కొనుగోలులో ఇబ్బంది లేకుండా అవసరమైన సీసీఐ సిబ్బందిని నియమించాలని, సిబ్బంది కొరత ఉంటే మార్కెటింగ్ శాఖ నుంచి తాత్కాలిక ప్రాతిపదికపై కొందరిని తీసుకోవచ్చునని హరీశ్‌రావు కేంద్ర కార్యదర్శికి సూచించారు. సీజన్లో జరిగే క్రయ, విక్రయాలను ప్రతి రోజూ సమీక్షించాలని కోరారు. రైతులు ఎక్కువ దూరం పత్తిని తీసుకొని వెళ్ళకుండా పండించిన ప్రాంతానికి దగ్గరగా ఉన్న జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేయాలని అనంతకుమార్‌సింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నోటిఫై చేసిన కేంద్రాల పరిధిలోనే ఆయా గ్రామాల రైతులు పత్తిని అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సంవత్సరం పత్తి రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ఆయన మంత్రి హరీశ్‌రావుకు హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డుల్లో కానీ కొనుగోలు కేంద్రాలలో గానీ రైతులు పడిగాపులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేలా సీసీఐని ఆదేశించాలని హరీశ్‌రావు కోరారు. కొనుగోలు కేంద్రాల గురించి ప్రచారం చేయండి వ్యవసాయ మార్కెట్ కమిటీ కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వివరాలు రైతులకు తెలిసే విధంగా అవసరమైన కరపత్రాలు, వాల్ పోస్టర్లు వెంటనే ముద్రించి ప్రచారం చేయాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సీసీఐ అధికారులు కొనుగోలు కేంద్రాల నుంచి పత్తిని తీసుకొని వెళ్లేందుకు అవసరమైన రవాణా టెండర్ల ప్రక్రియను త్వరగా ముగించాలని కేంద్ర కార్యదర్శిని కోరారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి పార్థ సారథి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, జాయింట్ డైరెక్టర్ లక్ష్మణుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు.