గ్రామాల్లో పత్తి కొనుగోళ్లు (ఫైల్)
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో పత్తి రైతులు దళారుల దందాకు చిత్తవుతున్నారు. ప్రభుత్వ అలసత్వం, సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కేంద్రాలు ప్రారంభించకపోవడం దళారులకు కలిసి వస్తోంది. తూకం, ధరలో మోసం చేస్తూ నిండుగా ముంచేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పత్తికి మద్దతు ధరరాక రైతులకు అప్పులే మిగిలేలా ఉన్నాయి. పలువురు ఎరువుల, వడ్డీ వ్యాపారులు, ప్రజాప్రతినిధులు పత్తి వ్యాపారుల అవతారం ఎత్తుతున్నారు. గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకుని పత్తిని స్థానికంగా విక్రయించే విధంగా పావులు కదుపుతున్నారు. సిండికేట్‌గా ఏర్పడి తమ వ్యాపారాన్ని మూడు పూలు..ఆరుకాయలుగా కొనసాగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో సుమారు 2 లక్షల 31 వేల హెక్టార్లలో పత్తి సాగు చేశారు.
హెక్టార్‌కు సుమారు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మొదటి, రెండవ దశలో పత్తి తెంపేశారు. ఈ రెండు దశల్లో కలిపి హెక్టార్‌కు 7 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. అంటే ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 20 లక్షల క్వింటాళ్లకుపైగా దిగుబడి పొందారు. కానీ నేటివరకు సీసీఐ.. పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతోపాటు దసరా పండుగ సమీపించడం, కూలీలకు డబ్బులను చెల్లించడం కోసం రైతులు గ్రామాల్లోనే దళారులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో గత సంవత్సరం 19 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు నేటికి ఒక్క కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం పట్ల పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత అవసరాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు తక్కువ ధరకుఅమ్మాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాలు
గత ఏడాది జిల్లాలో నకిరేకల్‌లో 2, చిట్యాలలో 2, చండూరులో 2, దేవరకొండలో 6, మాల్‌లో 5, మిర్యాలగూడలో 2 సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులనుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయించారు. కానీ వాటిని ఇప్పటివరకు ప్రారంభించని కారణంగా రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది వీటితోపాటు తిప్పర్తిలో కూడా సీసీఐ కొనుకోలు కేంద్రాన్ని అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు మార్కెటింగ్ అధికారులు పేర్కొన్నారు. కానీ నేటికీ వాటి ఊసేలేదు.
మోసాలు ఇలా..
దళారులు గ్రామాల్లో మచ్చిక చేసుకున్న ఏజెంట్ల ద్వారా పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.5450 ఉండగా దళారులు రూ.4000 నుంచి రూ.4500 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే మద్దతు ధరలో క్వింటాకు వెయ్యి రూపాయల నుంచి రూ.1500 వరకు నష్టపోతున్నారు. అయితే దళారులు పత్తిని కొన్న వెంటనే డబ్బులను ఇస్తున్నారు. వెంటనే డ బ్బులను చెల్లిస్తున్నందున రైతులు.. వారికే పత్తిని విక్రయించడానికి సుముఖత చూపుతున్నారు.
తూకంలో మోసం..
పత్తిని తూకం వేసేటప్పుడు ఎలక్ట్రానిక్ కాంటా లను వినియోగించాలనే నిబంధనలున్నాయి. అ ధికారుల నిర్లక్ష్యం కారణంగా దళారులు పాతరకం కాంటాలను వినియోగిస్తున్నారు. పాతరకం బా ట్లు వాడడంతోపాటు తూకంలో మోసాలకు పాల్పడుతూ క్వింటాపై సుమారు 15 కిలోల పత్తిని అదనంగా తూకం వేస్తున్నారు. దీనికారణంగా సుమారు రూ.750 వరకు రైతులు అదనంగా నష్టపోవాల్సి వస్తుంది. దళారులపై మార్కెటింగ్ శాఖ అధికారులు, తూనికల కొలతల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వారి మోసాలనుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment