43 పత్తి కొనుగోలు కేంద్రాలు కావాలి | Open 143 new cotton purchase centres | Sakshi
Sakshi News home page

43 పత్తి కొనుగోలు కేంద్రాలు కావాలి

Published Sat, Sep 16 2017 3:39 AM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM

43 పత్తి కొనుగోలు కేంద్రాలు కావాలి

43 పత్తి కొనుగోలు కేంద్రాలు కావాలి

కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన మంత్రి హరీశ్‌రావు
కాటన్‌ ప్లకింగ్‌ యంత్రాలు సబ్సిడీపై సరఫరా చేయాలి
క్వాలిటీ టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి
కేంద్ర జౌళిశాఖ కార్యదర్శితో మంత్రి భేటీ


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో143 పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే నెల 20వ తేదీలోపు వీటిని ప్రారంభించాలని, 3వ తేదీ నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఇక్కడ జలసౌధలో కేంద్ర జౌళిశాఖ కార్యదర్శి అనంతకుమార్‌సింగ్‌తో హరీశ్‌రావు సమావేశమయ్యారు. దళారులు, ట్రేడర్లు గోల్‌మాల్‌ చేయకుండా పక్కాగా పరిశీలించాలని ఆయన కోరారు.

పత్తికి మద్దతు ధర రూ.4,320 కన్నా తగ్గితే వెంటనే సీసీఐ రంగంలోకి దిగి కొనుగోళ్ళు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులు పత్తి సేకరణను చేతులతో కాకుండా కాటన్‌ ప్లకింగ్‌ యంత్రాలద్వారా చేయాలని, వీటిని రైతులకు సబ్సిడీపై సరఫరా చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పత్తి సాగు పెరుగుతున్న నేపథ్యంలో క్వాలిటీ టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఈ–నామ్‌ మార్కెట్లలో ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే రైతులు పత్తిని సేకరించడానికి కాటన్‌ సంచులను సబ్సిడీపై సరఫరా చేయాలన్నారు.  

సిబ్బందిని నియమించండి..  
పత్తి కొనుగోలులో ఇబ్బంది లేకుండా అవసరమైన సీసీఐ సిబ్బందిని నియమించాలని, సిబ్బంది కొరత ఉంటే మార్కెటింగ్‌ శాఖ నుంచి తాత్కాలిక ప్రాతిపదికపై కొందరిని తీసుకోవచ్చునని హరీశ్‌రావు కేంద్ర కార్యదర్శికి సూచించారు. సీజన్‌లో జరిగే క్రయ, విక్రయాలను ప్రతి రోజూ సమీక్షించాలని కోరారు. రైతులు ఎక్కువ దూరం పత్తిని తీసుకొని వెళ్ళకుండా పండించిన ప్రాంతానికి దగ్గరగా ఉన్న జిన్నింగ్‌ మిల్లులను నోటిఫై చేయాలని అనంతకుమార్‌సింగ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

నోటిఫై చేసిన కేంద్రాల పరిధిలోనే ఆయా గ్రామాల రైతులు పత్తిని అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సంవత్సరం పత్తి రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ఆయన మంత్రి హరీశ్‌రావుకు హామీ ఇచ్చారు. మార్కెట్‌ యార్డుల్లో కానీ కొనుగోలు కేంద్రాలలో గానీ రైతులు పడిగాపులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేలా సీసీఐని ఆదేశించాలని హరీశ్‌రావు కోరారు.  

కొనుగోలు కేంద్రాల గురించి ప్రచారం చేయండి
వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్‌ మిల్లులలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వివరాలు రైతులకు తెలిసే విధంగా అవసరమైన కరపత్రాలు, వాల్‌ పోస్టర్లు వెంటనే ముద్రించి ప్రచారం చేయాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సీసీఐ అధికారులు కొనుగోలు కేంద్రాల నుంచి పత్తిని తీసుకొని వెళ్లేందుకు అవసరమైన రవాణా టెండర్ల ప్రక్రియను త్వరగా ముగించాలని కేంద్ర కార్యదర్శిని కోరారు. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ కార్యదర్శి పార్థ సారథి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మణుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement