cotton yield
-
పత్తి ‘పాయే’
ఇచ్చోడ(బోథ్): తెల్ల బంగారం రైతుకు ఈసారి కూడా నిరాశ తప్పడం లేదు. కీలక దశలో భారీ వర్షాలు పడడంతో పత్తి చెట్టు ఎదగలేదు. దీంతో ఆశించిన స్థాయిలో కాత, పూత రాలేదు. ఈ నేపథ్యంలో గతేడాది కష్టాలే ఇప్పుడు కూడా పునరావృతమయ్యాయి. చేనంత చూస్తే ఎక్కడా పత్తి బుగ్గ కనిపిస్తుండకపోవడంతో రైతన్నలు దిగాలు చెందుతున్నారు. ఒకేసారి పత్తి ఏరడంతోనే చేను మొత్తం ఖాళీగా కనిపిస్తోంది. చెట్టుకు ఒక్క కాయ కూడా కానరాకపోవడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ఈసారి పత్తి క్వింటాల్ ధర రూ.5450 ఉంది. అయినా దిగుబడి లేనిది ఏం లాభం అంటూ బోరున విలపిస్తున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 3.5లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈసారి ఖరీఫ్ సాగు విస్తీర్ణం లక్ష్యం 5 లక్షలు కాగా ఇందులో పత్తిదే అధిక భాగం. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ ఉండడంతో గత ఐదు, ఆరు సంవత్సరాల నుంచి జిల్లా రైతులు పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఆహార ధాన్యాల పంటల సాగు విస్తీర్ణం ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తోంది. ఈసారైనా ఆశించిన స్థాయిలో లాభం రాకపోతుందా అని పత్తి సాగు చేసిన రైతన్నకు ప్రతిసారి నష్టాలే ఎదురవుతున్నాయి. అయినా పత్తి పంటనే.. జిల్లాలో సాగులో ఉన్న భూముల్లో 80 శాతానికి నీటి సౌకర్యం లేదు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో పత్తి పంట సాగు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో సోయాబీన్, ఇతర ఆహార ధాన్యాల పంటల సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. పప్పు దినుసుల సాగు చేపట్టాలని ప్రభుత్వం 2016– 17 సీజన్లో విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో ఆ ఏడాది పత్తి సాగు కాస్త తగ్గింది. 2.70లక్షల ఎకరాలకే పరిమితమైంది. కంది, పెసర సాగు కూడా కొంత పెరిగింది. అయితే పప్పు దినుసుల ధరలు కూడా అమాంతం తగ్గాయి. 2015– 16లో క్వింటాల్ కందులకు రూ.9వేలు పలికింది. కాని ఆ తర్వాత ఏడాది ధర ఏకంగా రూ.5వేలకు పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో కొంచెం అటు, ఇటుగా పత్తి ధరలు ఉంటుండడంతో రైతులు పత్తి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. కాగా పత్తి పంట సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నా రైతులు లాభాల బాట పట్టడం లేదు. గతేడాది ఓ మోస్తారులో పత్తి దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర లేదు. ఈసారి గిట్టుబాటు ధర ఉన్నా దిగుబడి లేదు. ఈ పరిస్థితులకు తోడు ప్రతి ఏటా కీలక దశలో వర్షాలు పడి పంట ఎదగకపోవడం, గులాబీ రంగు పురుగు సోకడం వంటి వాటితో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. సగానికి పడిపోయిన దిగుబడులు.. ఈఏడాది జిల్లా వ్యాప్తంగా పత్తి దిగుబడి అమాంతం పడిపోయింది. ఆగస్టు నెల మొత్తం వర్షాలు కురవడంతో పూత, కాత లేకుండా పోయింది. అనంతరం వర్షాలు కానరాకుండా పోయాయి. ఈ ప్రభావంతో చెట్టు ఎదుగుదల లోపించింది. రెండు, మూడు సార్లు రసాయనాలు పిచికారీ చేసినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎకరాకు 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. పంట పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు తల పట్టుకుంటున్నారు. పరిస్థితి తారుమారు.. పత్తి ధర విషయంలో ప్రతిఏడాది పరిస్థితి తారుమారు అవుతోంది. దిగుబడులు ఉన్న సమయంలో మద్ధతు ధర ఉండడం లేదు. మద్ధతు ధర ఉన్న సమయంలో దిగుబడి ఉండడం లేదు. గతేడాది ఓ మోస్తారులో దిగుబడులు ఉన్నాయి. అయినా క్వింటాల్ ధర రూ.4320లు మాత్రమే పలికింది. ఈసారి దిగుబడి పూర్తిగా తగ్గింది. కాని మద్ధతు ధర మాత్రం రూ.5450 పలుకుతోంది. ఈ పరిస్థితులు అర్థం కాక రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఈసారి ధర ఉండడంతో ఇలాగే ఉంటుందని భావించి వచ్చే ఏడాది పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. కాని మద్ధతు ధర పెరుగుతుందో, తగ్గుతుందో తెలియదు. మొత్తంగా ఈఏడాది పత్తి రైతుకు నష్టాలు తప్పడం లేదు. దిగుబడి అమాంతం తగ్గిపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోతుందని వాపోతున్నారు. -
పత్తి దిగుబడులు ఢమాల్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి దిగుబడి తగ్గే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పత్తి చివరి దశలో ఉంది. అక్కడక్కడ కొత్త పత్తి మార్కెట్లోకి వస్తోంది. ఈ ఏడాది 35.92 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేయగా, 30 లక్షల టన్నులకు పడిపోయే ప్రమాదముందని అనధికారికంగా చెబుతున్నారు. గతేడాది కూడా ఉత్పత్తి 32 లక్షల టన్నులు వస్తుందని అంచనా వేస్తే, చివరకు 25 లక్షల టన్నులకే పరిమితమైంది. గతేడాది నుంచి పత్తి దిగుబడిపై ప్రభుత్వం వేస్తున్న అంచనాలు తలకిందులు అవుతున్నాయి. ఈ పరిస్థితి పత్తి రైతుల జీవితాలను అతలాకుతలం చేసింది. ఫలితంగా ఈ పంటను నమ్ముకున్న వారంతా ఇబ్బందులు పడే ప్రమాదముంది. దెబ్బతీసిన ‘గులాబీ’పురుగు ఈ ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఏకంగా కోటి ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అత్యధికంగా పత్తి, వరి పంటలే సాగు చేశారు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, 44.91 లక్షల (107%) ఎకరాల్లో సాగైంది. అయితే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినా దాదాపు 10 లక్షల ఎకరాల్లోని పత్తిపై గులాబీ పురుగు దాడి చేసింది. ఇది రైతులను పెద్దఎత్తున నష్టపరిచింది. మరోవైపు కీలకమైన సెప్టెంబర్ నెలలో వర్షాలు లేకపోవడంతో అనేకచోట్ల పత్తి ఎండిపోయింది. జూన్‌లో సాధారణ వర్షపాతం, జూలైలో 30 శాతం లోటు వర్షపాతం, ఆగస్టులో సాధారణ వర్షపాతం, సెప్టెంబర్‌లో 33 శాతం లోటు నమోదైంది. 12 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ప్రధానంగా సెప్టెంబర్ నెలలో వర్షాభావం, డ్రైస్పెల్స్ ఏర్పడటం, ఎండల తీవ్రతతో గులాబీ రంగు పురుగు ఉధృతమైంది. మరింతగా విజృంభించి పత్తికాయలను తొలిచేయడంతో దిగుబడులు దారుణంగా పడిపోయే ప్రమాదం ఏర్పడింది. దాదాపు 10 లక్షల ఎకరాల్లో పత్తికి గులాబీ పురుగు పట్టింది. దీంతో ఆయా పంటంతా సర్వనాశనమైంది. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 10–12 క్వింటాళ్ల వరకు ఉత్పత్తి కావాలి. కానీ అనేకచోట్ల ఏడెనిమిది క్వింటాళ్లకు మించి ఉత్పత్తి కావడం లేదని అంటున్నారు. కొంపముంచిన బీజీ–3 అసలు బీజీ–2 పత్తి విత్తనానికి గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి లేదని తెలిసినా ప్రభుత్వం ఆ విత్తనం విక్రయించేందుకు బహుళజాతి విత్తన కంపెనీలకు అనుమతి ఇచ్చింది. దీనికారణంగానే గులాబీరంగు పురుగు రాష్ట్రంలో పత్తి దిగుబడిని దెబ్బతీసి రైతులను కుదేలు చేసింది. దీంతోపాటు అనుమతిలేని బీజీ–3 పత్తి విత్తనాన్ని కొన్ని కంపెనీలు రైతులకు అంటగట్టాయి. ఇప్పుడు సాగైన పత్తిలో అనుమతిలేని బీజీ–3 విత్తనం దాదాపు 15 నుంచి 20 శాతం ఉంటుందని అంచనా. నకిలీ, అనుమతిలేని పత్తి విత్తనంతో అనేకచోట్ల రైతులు నష్టపోయారు. బీజీ–3 పత్తితో పత్తి ఏపుగా పెరిగిందికానీ కాయ లేదని వ్యవసాయశాఖకు రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా అధికారులు ఏమీచేయలేని పరిస్థితుల్లో చేతులెత్తేస్తున్నారు. ఇతర పంటలదీ అదే పరిస్థితి... రాష్ట్రంలో ఖరీఫ్‌లో వేసిన మెట్ట పంటలదీ అదే పరిస్థితి. చేతికందే సమయంలో వర్షాలు కురవకపోవడం, ఎండలు తీవ్రంగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. మొక్కజొన్న, జొన్న తదితర పంటలూ ఎండిపోయాయి. వీటన్నింటినీ సెప్టెంబర్ నెల వర్షాభావం దెబ్బతీసింది. పైగా ఉష్ణోగ్రతలు మండిపోవడంతో లక్షలాది ఎకరాల్లో పంటలు మాడిపోయాయి. ఆరుతడి పంటలన్నీ గింజ పట్టే దశలో వర్షాలు లేకపోవడంతో ఉత్పత్తి పడిపోయే పరిస్థితి నెలకొంది. మహబూబ్‌నగర్ జిల్లాలోనైతే 2013 తరువాత ఆ స్థాయిలో వర్షాలు ఇంతవరకు మళ్లీ కురవలేదు. -
20 శాతం అధికంగా పత్తి దిగుబడి
అందుకే అదనంగా 66 సీసీఐ కొనుగోలు కేంద్రాలు కోరాం: హరీశ్ సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది పత్తి దాదాపుగా 43.75లక్షల ఎక రాల్లో సాగయ్యే అవకాశం ఉందని, తద్వారా 19.15 లక్షల బేల్స్ వచ్చే అవకాశముందని అంచనా వేసినట్లు మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇది గతంకంటే 20 శాతం అధికం కాబట్టి, ముందు జాగ్రత్తగా కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీని ఢిల్లీలో ఈ నెల 5న కలసి చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్ వచ్చిన సీసీఐ చైర్మన్ చొక్కలింగం తదితర అధికారులతో హరీశ్‌రావు మంగళవారం సమావేశమయ్యారు. పాలమూరు సీసీఐ బ్రాంచివల్ల రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ జిల్లా రైతులకు ప్రయోజనం కలగనుందన్నారు. ఈ బ్రాంచిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని మంత్రి కోరారు. ఈ ఖరీఫ్‌లో పత్తి అధికంగా వస్తున్నందున గతంలో ప్రారంభించిన 84 కొనుగోలు కేంద్రాలకు అదనంగా 66 కేంద్రాలను ప్రారంభించవలసిందిగా కోరారు. ఇందుకు సీసీఐ సాను కూలంగా స్పందించిందన్నారు. సీసీఐ కేంద్రాలు వారానికి ఆరు రోజులు పూర్తి స్థాయిలో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల్లో ఈ–నామ్ అమలుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పత్తి అమ్మిన తరువాత 48 గంటలలోపు రైతు ఖాతాలో డబ్బులు జమయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, దేశవ్యాప్తంగా 125 క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీసీఐ చైర్మన్ చొక్కలింగం తెలిపారు. మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు. -
దేశంలో తగ్గిన పత్తి దిగుబడి
గత మూడేళ్లుగా దేశంలో పత్తి పంట దిగుబడి తగ్గిందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి ఎస్ఎస్ అహ్లూవాలియా తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్ సిపి ఎంపి విజయ సాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాత పూర్వక జవాబిస్తూ కరవు పీడిత ప్రాంతాల్లో పత్తి దిగుబడి తక్కువ కావడంతో ప్రత్యేకించి ఎర్ర భూములలో తెలంగాణా ప్రభుత్వం పప్పులు, సోయాబీన్ పంటలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కూడా పత్తి ఉత్పాదకత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పప్పులు, నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహిస్తోందన్నారు. అంతేకాకుండా సూక్ష్మ సేద్యంను కూడా ప్రోత్సాహమిస్తోందని వివరించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సిసిఐ) దేశీయ ధరల పరిస్దితిని పర్యవేక్షిస్తోందన్నారు. ప్రధానంగా పత్తి పండించే రాష్ట్రాలలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పత్తి పంటపై కరవు ప్రభావం లేదని కేంద్ర మంత్రి చెప్పారు.