సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి దిగుబడి తగ్గే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పత్తి చివరి దశలో ఉంది. అక్కడక్కడ కొత్త పత్తి మార్కెట్లోకి వస్తోంది. ఈ ఏడాది 35.92 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేయగా, 30 లక్షల టన్నులకు పడిపోయే ప్రమాదముందని అనధికారికంగా చెబుతున్నారు.
గతేడాది కూడా ఉత్పత్తి 32 లక్షల టన్నులు వస్తుందని అంచనా వేస్తే, చివరకు 25 లక్షల టన్నులకే పరిమితమైంది. గతేడాది నుంచి పత్తి దిగుబడిపై ప్రభుత్వం వేస్తున్న అంచనాలు తలకిందులు అవుతున్నాయి. ఈ పరిస్థితి పత్తి రైతుల జీవితాలను అతలాకుతలం చేసింది. ఫలితంగా ఈ పంటను నమ్ముకున్న వారంతా ఇబ్బందులు పడే ప్రమాదముంది.
దెబ్బతీసిన ‘గులాబీ’పురుగు
ఈ ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఏకంగా కోటి ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అత్యధికంగా పత్తి, వరి పంటలే సాగు చేశారు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, 44.91 లక్షల (107%) ఎకరాల్లో సాగైంది. అయితే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినా దాదాపు 10 లక్షల ఎకరాల్లోని పత్తిపై గులాబీ పురుగు దాడి చేసింది. ఇది రైతులను పెద్దఎత్తున నష్టపరిచింది. మరోవైపు కీలకమైన సెప్టెంబర్ నెలలో వర్షాలు లేకపోవడంతో అనేకచోట్ల పత్తి ఎండిపోయింది.
జూన్‌లో సాధారణ వర్షపాతం, జూలైలో 30 శాతం లోటు వర్షపాతం, ఆగస్టులో సాధారణ వర్షపాతం, సెప్టెంబర్‌లో 33 శాతం లోటు నమోదైంది. 12 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ప్రధానంగా సెప్టెంబర్ నెలలో వర్షాభావం, డ్రైస్పెల్స్ ఏర్పడటం, ఎండల తీవ్రతతో గులాబీ రంగు పురుగు ఉధృతమైంది. మరింతగా విజృంభించి పత్తికాయలను తొలిచేయడంతో దిగుబడులు దారుణంగా పడిపోయే ప్రమాదం ఏర్పడింది. దాదాపు 10 లక్షల ఎకరాల్లో పత్తికి గులాబీ పురుగు పట్టింది. దీంతో ఆయా పంటంతా సర్వనాశనమైంది. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 10–12 క్వింటాళ్ల వరకు ఉత్పత్తి కావాలి. కానీ అనేకచోట్ల ఏడెనిమిది క్వింటాళ్లకు మించి ఉత్పత్తి కావడం లేదని అంటున్నారు.
కొంపముంచిన బీజీ–3
అసలు బీజీ–2 పత్తి విత్తనానికి గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి లేదని తెలిసినా ప్రభుత్వం ఆ విత్తనం విక్రయించేందుకు బహుళజాతి విత్తన కంపెనీలకు అనుమతి ఇచ్చింది. దీనికారణంగానే గులాబీరంగు పురుగు రాష్ట్రంలో పత్తి దిగుబడిని దెబ్బతీసి రైతులను కుదేలు చేసింది.
దీంతోపాటు అనుమతిలేని బీజీ–3 పత్తి విత్తనాన్ని కొన్ని కంపెనీలు రైతులకు అంటగట్టాయి. ఇప్పుడు సాగైన పత్తిలో అనుమతిలేని బీజీ–3 విత్తనం దాదాపు 15 నుంచి 20 శాతం ఉంటుందని అంచనా. నకిలీ, అనుమతిలేని పత్తి విత్తనంతో అనేకచోట్ల రైతులు నష్టపోయారు. బీజీ–3 పత్తితో పత్తి ఏపుగా పెరిగిందికానీ కాయ లేదని వ్యవసాయశాఖకు రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా అధికారులు ఏమీచేయలేని పరిస్థితుల్లో చేతులెత్తేస్తున్నారు.
ఇతర పంటలదీ అదే పరిస్థితి...
రాష్ట్రంలో ఖరీఫ్‌లో వేసిన మెట్ట పంటలదీ అదే పరిస్థితి. చేతికందే సమయంలో వర్షాలు కురవకపోవడం, ఎండలు తీవ్రంగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. మొక్కజొన్న, జొన్న తదితర పంటలూ ఎండిపోయాయి. వీటన్నింటినీ సెప్టెంబర్ నెల వర్షాభావం దెబ్బతీసింది. పైగా ఉష్ణోగ్రతలు మండిపోవడంతో లక్షలాది ఎకరాల్లో పంటలు మాడిపోయాయి. ఆరుతడి పంటలన్నీ గింజ పట్టే దశలో వర్షాలు లేకపోవడంతో ఉత్పత్తి పడిపోయే పరిస్థితి నెలకొంది. మహబూబ్‌నగర్ జిల్లాలోనైతే 2013 తరువాత ఆ స్థాయిలో వర్షాలు ఇంతవరకు మళ్లీ కురవలేదు.
Comments
Please login to add a commentAdd a comment