20 శాతం అధికంగా పత్తి దిగుబడి
అందుకే అదనంగా 66 సీసీఐ కొనుగోలు కేంద్రాలు కోరాం: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది పత్తి దాదాపుగా 43.75లక్షల ఎక రాల్లో సాగయ్యే అవకాశం ఉందని, తద్వారా 19.15 లక్షల బేల్స్ వచ్చే అవకాశముందని అంచనా వేసినట్లు మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇది గతంకంటే 20 శాతం అధికం కాబట్టి, ముందు జాగ్రత్తగా కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీని ఢిల్లీలో ఈ నెల 5న కలసి చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్ వచ్చిన సీసీఐ చైర్మన్ చొక్కలింగం తదితర అధికారులతో హరీశ్‌రావు మంగళవారం సమావేశమయ్యారు. పాలమూరు సీసీఐ బ్రాంచివల్ల రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ జిల్లా రైతులకు ప్రయోజనం కలగనుందన్నారు.
ఈ బ్రాంచిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని మంత్రి కోరారు. ఈ ఖరీఫ్‌లో పత్తి అధికంగా వస్తున్నందున గతంలో ప్రారంభించిన 84 కొనుగోలు కేంద్రాలకు అదనంగా 66 కేంద్రాలను ప్రారంభించవలసిందిగా కోరారు. ఇందుకు సీసీఐ సాను కూలంగా స్పందించిందన్నారు. సీసీఐ కేంద్రాలు వారానికి ఆరు రోజులు పూర్తి స్థాయిలో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల్లో ఈ–నామ్ అమలుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పత్తి అమ్మిన తరువాత 48 గంటలలోపు రైతు ఖాతాలో డబ్బులు జమయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, దేశవ్యాప్తంగా 125 క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీసీఐ చైర్మన్ చొక్కలింగం తెలిపారు. మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.