ఇచ్చోడలోని ఓ జిన్నింగ్ మిల్లుకు వచ్చిన పత్తి(ఫైల్)
ఇచ్చోడ(బోథ్): తెల్ల బంగారం రైతుకు ఈసారి కూడా నిరాశ తప్పడం లేదు. కీలక దశలో భారీ వర్షాలు పడడంతో పత్తి చెట్టు ఎదగలేదు. దీంతో ఆశించిన స్థాయిలో కాత, పూత రాలేదు. ఈ నేపథ్యంలో గతేడాది కష్టాలే ఇప్పుడు కూడా పునరావృతమయ్యాయి. చేనంత చూస్తే ఎక్కడా పత్తి బుగ్గ కనిపిస్తుండకపోవడంతో రైతన్నలు దిగాలు చెందుతున్నారు. ఒకేసారి పత్తి ఏరడంతోనే చేను మొత్తం ఖాళీగా కనిపిస్తోంది. చెట్టుకు ఒక్క కాయ కూడా కానరాకపోవడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ఈసారి పత్తి క్వింటాల్ ధర రూ.5450 ఉంది. అయినా దిగుబడి లేనిది ఏం లాభం అంటూ బోరున విలపిస్తున్నారు.
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 3.5లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈసారి ఖరీఫ్ సాగు విస్తీర్ణం లక్ష్యం 5 లక్షలు కాగా ఇందులో పత్తిదే అధిక భాగం. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్ ఉండడంతో గత ఐదు, ఆరు సంవత్సరాల నుంచి జిల్లా రైతులు పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఆహార ధాన్యాల పంటల సాగు విస్తీర్ణం ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తోంది. ఈసారైనా ఆశించిన స్థాయిలో లాభం రాకపోతుందా అని పత్తి సాగు చేసిన రైతన్నకు ప్రతిసారి నష్టాలే ఎదురవుతున్నాయి.
అయినా పత్తి పంటనే..
జిల్లాలో సాగులో ఉన్న భూముల్లో 80 శాతానికి నీటి సౌకర్యం లేదు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో పత్తి పంట సాగు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో సోయాబీన్, ఇతర ఆహార ధాన్యాల పంటల సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. పప్పు దినుసుల సాగు చేపట్టాలని ప్రభుత్వం 2016– 17 సీజన్‌లో విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో ఆ ఏడాది పత్తి సాగు కాస్త తగ్గింది. 2.70లక్షల ఎకరాలకే పరిమితమైంది. కంది, పెసర సాగు కూడా కొంత పెరిగింది. అయితే పప్పు దినుసుల ధరలు కూడా అమాంతం తగ్గాయి. 2015– 16లో క్వింటాల్ కందులకు రూ.9వేలు పలికింది. కాని ఆ తర్వాత ఏడాది ధర ఏకంగా రూ.5వేలకు పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో కొంచెం అటు, ఇటుగా పత్తి ధరలు ఉంటుండడంతో రైతులు పత్తి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. కాగా పత్తి పంట సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నా రైతులు లాభాల బాట పట్టడం లేదు. గతేడాది ఓ మోస్తారులో పత్తి దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర లేదు. ఈసారి గిట్టుబాటు ధర ఉన్నా దిగుబడి లేదు. ఈ పరిస్థితులకు తోడు ప్రతి ఏటా కీలక దశలో వర్షాలు పడి పంట ఎదగకపోవడం, గులాబీ రంగు పురుగు సోకడం వంటి వాటితో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
సగానికి పడిపోయిన దిగుబడులు..
ఈఏడాది జిల్లా వ్యాప్తంగా పత్తి దిగుబడి అమాంతం పడిపోయింది. ఆగస్టు నెల మొత్తం వర్షాలు కురవడంతో పూత, కాత లేకుండా పోయింది. అనంతరం వర్షాలు కానరాకుండా పోయాయి. ఈ ప్రభావంతో చెట్టు ఎదుగుదల లోపించింది. రెండు, మూడు సార్లు రసాయనాలు పిచికారీ చేసినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎకరాకు 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. పంట పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు తల పట్టుకుంటున్నారు.
పరిస్థితి తారుమారు..
పత్తి ధర విషయంలో ప్రతిఏడాది పరిస్థితి తారుమారు అవుతోంది. దిగుబడులు ఉన్న సమయంలో మద్ధతు ధర ఉండడం లేదు. మద్ధతు ధర ఉన్న సమయంలో దిగుబడి ఉండడం లేదు. గతేడాది ఓ మోస్తారులో దిగుబడులు ఉన్నాయి. అయినా క్వింటాల్ ధర రూ.4320లు మాత్రమే పలికింది. ఈసారి దిగుబడి పూర్తిగా తగ్గింది. కాని మద్ధతు ధర మాత్రం రూ.5450 పలుకుతోంది. ఈ పరిస్థితులు అర్థం కాక రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఈసారి ధర ఉండడంతో ఇలాగే ఉంటుందని భావించి వచ్చే ఏడాది పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. కాని మద్ధతు ధర పెరుగుతుందో, తగ్గుతుందో తెలియదు.
మొత్తంగా ఈఏడాది పత్తి రైతుకు నష్టాలు తప్పడం లేదు. దిగుబడి అమాంతం తగ్గిపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోతుందని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment