coucilers
-
సమస్యలపై దద్దరిల్లిన కౌన్సిల్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను కౌన్సిలర్లు నిలదీయడంతో కౌన్సిల్ దద్దరిల్లింది. సోమవారం మధ్యాహ్నం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర సమావేశం జరిగింది. చాలా వార్డుల్లో మిషన్ భగీరథ పథకం తాగునీరు సరిపోవడం లేదని, వీధిలైట్లు 24 గంటల పాటు వెలుగుతున్నాయని కౌన్సిలర్లు ఏకరువు పెట్టారు. వర్షాకాలం ఆరంభమైనందున పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎజెండాలోని వివిధ అంశాలపై వాడివేడీగా చర్చ సాగింది. ముందుగా 32వ వార్డు కౌన్సిలర్ సాదతుల్లా మాట్లాడుతూ చాలా గల్లీలలో వీధి దీపాలు, ముఖ్య కూడళ్లలో హైమాస్ట్ లైట్లు సరిగా పనిచేయడం లేదన్నారు. దోమల బెడద ఎక్కువగా ఉందని రసాయన మందులు పిచికారీ చేయించాలన్నారు. ఇవే విషయాలను 19వ వార్డు కౌన్సిలర్ షబ్బీర్ అహ్మద్ ప్రస్తావించారు. అంబేడ్కర్ చౌరస్తా సమీపంలోని ఎక్స్పో–ప్లాజా తొలగించినందున అక్కడి సామగ్రిని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాలన్నారు. 24వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతం రామయ్యబౌలిలో వర్షపు నీరు నిల్వకుండా చూడాలన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ అంజయ్య మాట్లాడుతూ కాంట్రాక్టు పనులు అన్ని మహిళా సంఘాల గ్రూపులకు ఇవ్వాలన్నారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తికాకుండానే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అందరినీ ఆహ్వానించాలన్నారు. అప్పన్నపల్లిలో రెండో ఆర్ఓబీ ప్రారంభమైనందున కింది భాగంలో అటు, ఇటువైపు వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అంతర్గత రోడ్లు దెబ్బ తిన్నాయని 21, 37వ వార్డు కౌన్సిలర్లు అనంతరెడ్డి, స్వప్న సమావేశం దృష్టికి తెచ్చారు. కొందరు ఇంటి యజమానులు రోడ్డును ఆనుకొని ర్యాంపులు నిర్మించడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిని తొలగించాలని 13, 21వ వార్డు కౌన్సిలర్లు లక్ష్మీదేవి, అనంతరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దనాలాలలో మురుగును ఎప్పటికప్పుడు తొలగించాలని 33, 34వ వార్డు కౌన్సిలర్లు మునీరుద్దీన్, నర్సింహులు కోరారు. కొందరు వ్యక్తులు వాహనాల్లో కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డు సమీపంలో అర్ధరాత్రి చికెన్ వ్యర్థ పదార్థాలను పడేసిపోతున్నారని సభ దృష్టికి తెచ్చారు. వీరితో పాటు కౌన్సిలర్లు సంధ్య, శ్రీనివాసులు, ముస్కాన్ సుల్తానా, రామాంజనేయులు తమ వార్డుల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం.. – చైర్మన్, కమిషనర్ సభ్యులు ప్రస్తావించిన ఈ సమస్యలను వీలైనంతవరకు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కమిషనర్ డి.ప్రదీప్‌కుమార్ బదులిచ్చారు. పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, అందుకు అందరూ సహకరించాలన్నారు. ఇదిలా ఉండగా ఎజెండాలోని కొన్ని పద్దుల్లో తప్పులు దొర్లడంతో అధికారులపై చైర్మన్ మండిపడ్డారు. ఇక ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో వైస్‌చైర్మన్ తాటి గణేష్‌కుమార్, టీపీఓ లక్ష్మీపతి, డిప్యూటీ ఈఈ బెంజిమన్, శానిటరీ ఇన్స్పెక్టర్లు రవీందర్‌రెడ్డి, గురులింగం, ఏఓ ఉమాకాంత్, ఆర్ఓ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
కుర్చీ కోసం కుమ్ములాట
ప్రొద్దుటూరుటౌన్: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ కుర్చీ వ్యవహారం టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. వర్గాలుగా విడిపోయి వీధి పోరాటం మొదలు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు 2014లో జరగగా, టీడీపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. అయితే చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంపై కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో పార్టీ నియోజకవర్గ పెద్దల జోక్యంతో ఒక ఒప్పందం కుదిరింది. మొదటి సారిగా ఉండేల గురివిరెడ్డికి అవకాశం ఇవ్వాలని, ఈయన రెండేళ్ల పాటు చైర్మన్ సీటులో ఉంటారని పెద్దలు తెలిపారు. రెండో విడతలో ఆసం రఘురామిరెడ్డికి అవకాశం ఇచ్చేలా, ఆయన మూడేళ్ల పాటు పదవిలో ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. చైర్మన్ ఎన్నికల సందర్భంగా కౌన్సిలర్లను విహార యాత్రకు తీసుకెళ్లేందుకు అయిన అదనపు ఖర్చు విషయమై మరో సారి పార్టీ పెద్దలు సమావేశం అయ్యారు. ఇందుకోసం గురివిరెడ్డి కోటి 60 లక్షల రూపాయలను సమకూర్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు గాను తనకు మూడేళ్ల పాటు చైర్మన్ సీటు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని ఉండేల చెబుతున్నారు. ఈ విషయం తనకు తెలియదని ఆసం పేర్కొంటున్నారు. ఆసంకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న కౌన్సిలర్లు ఈ ఏడాది జూలై 3కు పాలక వర్గం రెండేళ్లు పూర్తి చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గురివిరెడ్డిని ఆ స్థానం నుంచి దింపేందుకు ఆసం రఘురామిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉండేలపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆసం వ్యూహాలకు కొందరు కౌన్సిలర్లు చెక్ పెడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో ఇటీవల చేరిన కౌన్సిలర్లు విఎస్ ముక్తియార్‌తోపాటు మరో 8 మంది, టీడీపీ నుంచి గెలుపొందిన మరో 11 మంది ఇందుకోసం పావులు కదుపుతున్నారు. ఈ మేరకు వీరు సమావేశమై పార్టీ దృష్టికి ఆయన వ్యవహార శైలిని తీసుకెళ్లేందుకు సమాయత్తం అయ్యారు. వీరంతా మున్సిపల్ కార్యాలయంలో సమావేశమై చర్చలు జరిపారు. నేడు జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు తెలుగుదేశం తరఫున కౌన్సిలర్‌గా గెలుపొందిన ఆసం పార్టీ దృష్టికి సమస్య తేకుండా, నాయకుల నిర్ణయం లేకుండా రాజీనామా చేయడం క్రమశిక్షణ రాహిత్యమని వారు ఒక లేఖను తయారు చేశారు. గురివిరెడ్డిని వెంటనే చైర్మన్ పదవి నుంచి దిగిపోవాలంటూ మహిళలతో ర్యాలీ చేయించడం, రోడ్ల వెంట నినాదాలు చేయించడం వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని, ఇన్ని ఏళ్లు కాపాడుకుంటూ వచ్చిన పరువు పోయిందని వారు అధిష్టానం, జిల్లా అధ్యక్షుడి దృష్టికి శుక్రవారం తీసుకెళ్లేలా చర్చలు జరిపారు. ఒప్పందంపై పార్టీ పెద్దలు ఏ నిర్ణయం ప్రకటించనప్పుడు రఘురామిరెడ్డి ఏమి చేసినా అందుకు అర్థం ఉంటుందని వారు లేఖలో పేర్కొన్నారు. కౌన్సిలర్లతో ఆయన ఏ రోజు చర్చలు జరపడం కానీ, మాట్లాడటం కానీ చేయలేదని వారు చెబుతున్నారు. పది మంది కౌన్సిలర్లు ఎటూ తేల్చుకోలేక... పెద్దాయన వర్గీయులుగా ఉన్న మరి కొంత మంది కౌన్సిలర్లు ఎటు వెళ్లాలో తెలియక మథన పడుతున్నారు. ఇలాంటి వారు 10 మంది దాకా ఉన్నారు. అందరూ ఒక వైపు ఉన్నప్పుడు మరో వైపు ఉండటం వల్ల గుర్తింపు కోల్పోతామేమోననే ఆందోళనలో వారిలో కొంత మంది ఉన్నట్లు తెలిసింది. మారిన చట్టం ప్రకారం.. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రూపొందించిన చట్టం ప్రకారం మున్సిపల్ చైర్మన్‌ను 4 ఏళ్ల వరకు కదిలించకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. 4 ఏళ్ల వరకు చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా వీలు లేకుండా ఈ చట్టం రూపొందించారు. ఇది కూడా ప్రస్తుత చైర్మన్‌కు బాగా కలిసి వచ్చిందన్నది కొందరి కౌన్సిలర్ల వాదన. పోటా పోటీగా మద్దతు ఉండేల గురివిరెడ్డికి కొన్ని దళిత సంఘాలు, కౌన్సిలర్లు మద్దతు ఇవ్వగా, ఆసంకు మరికొన్ని దళిత సంఘాలు, బీసీ సంఘాలు, వార్డు ప్రజలు, కొందరు వర్తకులు మద్దతు తెలుపుతూ విలేకరుల సమావేశాలు పెడుతున్నారు.