counsellors
-
సిట్టింగులకు టికెట్ల దడ!
సాక్షి, సిరిసిల్ల : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు వేంగంగా జరుగుతున్నాయి. వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. పురపోరుకు తెరలేసింది. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఎన్నికల బరిలో నిలిచేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. బస్తీ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థుల వేటలో అన్ని పార్టీల నేతలు తలమునకలయ్యారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మున్సిపల్ వార్డుల సంఖ్య పెరగడంతో అన్ని పార్టీలూ కొత్త వార్డుల్లో అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ప్రస్తుతం సిట్టింగ్ కౌన్సిలర్లకు టికెట్ల దడపట్టుకుంది. క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తూ.. ఎన్నికల్లో రేసుగుర్రాలను ఎంపిక చేయాలని పార్టీలు భావిస్తున్నాయి. అంగ, అర్థబలం ఉన్న అభ్యర్థులను బరిలో దింపేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. సిట్టింగుల్లో సగం మందికి డౌటే.. సిరిసిల్లలో 33 మంది, వేములవాడలో 20 మంది సిట్టింగు కౌన్సిలర్లు ఉండగా.. వీరిలో సగం మందికి మళ్లీ టికెట్లు దక్కే అవకాశం లేదని భావిస్తున్నారు. గతఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ టికెట్లపై పోటీచేసి గెలిచిన అభ్యర్థులు కొందరు.. పార్టీని వదిలేసి అధికార టీఆర్ఎస్లో చేరారు. కండువా మార్చిన కౌన్సిలర్లకు మళ్లీ పార్టీ టికెట్లు ఇస్తామని ఆ పార్టీ ముఖ్యనేతలు మాట ఇచ్చారు. అదేవార్డులో టీఆర్ఎస్ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులు క్షేత్రస్థాయిలో సానుభూతి ఓట్లపై ఆశలు పెట్టుకోగా.. పార్టీ మారిన సిట్టింగ్ కౌన్సిలర్లకు అవకాశం ఇస్తే.. మా సంగతి ఏంది..? అని అప్పట్లో ఓడిపోయిన నాయకులు బెంగపడుగున్నారు. సిట్టింగ్ కౌన్సిలర్లపై వ్యతిరేకత ఉన్న వార్డుల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తోంది. విలీన గ్రామాల్లోనూ పలుబడి ఉన్నవ్యక్తుల్లో ఆర్థికంగా ఉన్న వారిని ఎంపిక చేయాలని చూస్తున్నారు. క్షేత్రసాయిలో అభ్యర్థుల పని తీరు.. గెలుపు ఓటములపై అధికార పార్టీ నేతలు సర్వేలు నిర్వహిస్తున్నారు. ఆ సర్వే నివేదిక ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఏది ఏమైనా .. సిట్టింగు కౌన్సిలర్లను టికెట్ల భయం పట్టుకుంది. అధికార పార్టీ చేసిన అభివృద్ధి పనులు.. సొంత ఇమేజ్‌తో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు సాధిస్తామని సిట్టింగుల్లో ఆశలు ఉన్నాయి. పార్టీ అధిష్టానం టికెట్లు ఇవ్వకుంటే ప్రత్యామ్నాయంపై సిట్టింగులు దృష్టిసారించారు. అసంతృప్తి నాయకులకు బీజేపీ గాలం.. అధికార పార్టీలో టికెట్లు రాని వారికి, వార్డుల్లో మంచిపేరున్న అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో చాలా వార్డుల్లో అధికార టీఆర్ఎస్లో టికెట్ల కోసం పోటీ అధికంగా ఉండగా.. అసంతృప్తి నాయకులకు పువ్వుగుర్తు టికెట్లు ఇచ్చేందుకు ఆ పార్టీ రెడీగా ఉంది. ఇప్పటికే కొందరు మాజీలు, సిట్టింగులు కమలం నేతలతో టచ్‌లో ఉంటున్నారు. గులాబీ టికెట్ రాకుంటే.. వెంటనే కమలం పార్టీ బీ–ఫామ్‌తో పోటీచేయాలని వ్యూహం సిద్ధం చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అధికార టీఆర్ఎస్ కంటే.. బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంతో ఆ పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. యువకులు, మహిళల ఓట్లు వస్తాయనే ఆశతో బీజేపీ నేతలు అన్ని వార్డుల్లోనూ అభ్యర్థులను నిలిపేందుకు సిద్ధమయ్యారు. వేములవాడ పట్టణంలో అధికార పార్టీతోపాటు, బీజేపీ బలంగానే ఉండడంతో బీజేపీ టికెట్ల కోసం పోటీ నెలకొంది. సిరిసిల్లలో టీఆర్ఎస్ టికెట్లకు గిరాకీ పెరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు సాధించడంతో బీజేపీ నేతల్లో ఆశలు పెరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని ఆ పార్టీ అగ్రనేతలు రంగం సిద్ధం చేశారు. టికెట్లతో కాంగ్రెస్ సిద్ధం.. మున్సిపల్ ఎన్నికల్లో పట్టు సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గతంలో పార్టీ టికెట్‌పై పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు పార్టీ మారగా.. ఈసారి కొత్త వారితో ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించింది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు ఆ పార్టీ నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ముందే ఏ వార్డులో ఎవరిని బరిలో దింపాలి అనే అంశాన్ని ఆ పార్టీ ముఖ్య నాయకులు చర్చించుకుంటున్నారు. సిట్టింగ్‌లకు మరో చాన్స్ ఇస్తూనే కొత్త వారితో పురపోరుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎన్నికలు ఖరీదు కావడంతో అన్నిపార్టీల నేతలు ఖర్చు పెట్టగలిగే అభ్యర్థులను ఎంపిక చేయాలని చూస్తున్నారు. -
ముగ్గురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల అరెస్ట్
సాక్షి, శ్రీకాకుళం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో గురువారం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దీనికి నిరసన పలు జిల్లాలో నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని పాలకొండలో ముగ్గురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారన్న నెపంతో కడగల వెంకట రమణ, నీలాపు శ్రీనివాసరావు, తుమ్మగుంట శంకర్రావుతో పాటు పార్టీ నేత దుంపల రమేష్‌ను అరెస్ట్ చేశారు. వీరందరిపై సెక్షన్151 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బల్దియా సమావేశం.. గరం.. గరం
⇒ వార్డుల్లో వివక్షపై కౌన్సిలర్ల ఆగ్రహం ⇒ సమావేశం నుంచి కాంగ్రెస్ సభ్యుల వాకౌట్ ⇒ తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ల మండిపాటు ⇒ చైర్పర్సన్, అధికారులపై కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల ధ్వజం ⇒ అనంతరం ఏజెండా అంశాలు చదవకుండానే ఆమోదం తాండూరు: మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని కాంగ్రెస్ కౌన్సిలర్లు బహిష్కరించారు. తమ వార్డులపై చైర్పర్సన్, అధికారులు వివక్ష చూపుతూ.. అన్యాయం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి అధ్యక్షతన శనివారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో కౌన్సిలర్లు మండిపడ్డారు. సమావేశం ప్రారంభం కాగానే కాంగ్రెస్ కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ సునీత, కౌన్సిలర్లు శ్రీనివాస్, ముక్తార్ అహ్మద్, బీజేపీ కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ బొప్పి అంజలి మాట్లాడారు. రూ.1.50 కోట్లకుపైగా నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నారని, తమ వార్డుల్లో మురుగుకాల్వల కోసం గుంతలు తీశారని కానీ ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదని మండిపడ్డారు. మూడు సమావేశాల్లో చెబుతూనే ఉన్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసిన గుంతలతో జనాలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు కూలిపోయే పరిస్థితి నెలకొందన్నారు. తమ వార్డుల్లో ఎందుకు పనులు చేయడం లేదని చైర్‌పర్సన్‌ను నిలదీశారు. ఈ విషయమై ఇంజినీర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇసుక కొరతవల్ల కాంట్రాక్టర్లు పనులు చేపట్టడం లేదని సమాధానమిచ్చారు. దీంతో ఇసుక సమస్య ఉన్నప్పుడు గుంతలు ఎందుకు తీశారని కౌన్సిలర్లు ప్రశ్నించారు. కాంట్రాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు చైర్పర్సన్, అధికారులతో వాదనకు దిగారు. వైస్‌చైర్మన్ సాజిద్ అలీ, టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ రజాక్ కాంగ్రెస్ కౌన్సిలర్ల వాదనలను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. సమావేశం కొద్దిసేపు రసాభాసగా మారింది. ఉద్దేశపూర్వకంగానే తమ వార్డుల్లో పనులు చేయడం లేదని, చైర్పర్సన్, అధికార పార్టీ కౌన్సిలర్లు ఇష్టానురంగా వ్యవహరిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తమ మాటలకు గౌరవం లేదని కౌన్సిలర్లు సునీత, పట్లోళ్ల సావిత్రి, సరితాగౌడ్, లింగదళ్లి రవి, ముక్తార్ అహ్మద్, శ్రీనివాస్, బొప్పి అంజలి వాకౌట్ చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం, టీడీపీ కౌన్సిలర్లతో చైర్పర్సన్ సమావేశాన్ని కొనసాగించారు. డీఎస్పీ కార్యాలయం పక్కన ఉన్న 384 చదరపు గజాల స్థలం కబ్జా అవుతుందనే ఆరోపణలు వస్తున్నాయని ఎంఐఎం కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ అసిఫ్ అన్నారు. ఈ విషయంలో ఆ స్థలం ఎవరిదో స్పష్టం చేయాలని, ఇతర శాఖలకు ఆ స్థలాన్ని బదలాయించే అవకాశం ఉందా? అని చైర్‌పర్సన్‌ను ప్రశ్నించారు. కమిషనర్ సంతోష్‌కుమార్ సమాధానవిస్తూ.. ఆ స్థలం మున్సిపాలిటీకి చెందిందని సమాధానమిచ్చారు. ఇందుకు సంబంధించి మున్సిపాలిటీ రికార్డులో ఉందన్నారు. పట్టణంలో పార్కుల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని, మినీ స్టేడియం బాధ్యతలు తీసుకోవడం అవసరం లేదని టీఆర్ఎస్ కౌన్సిలర్ అబ్దుల్ ఖవి అన్నారు. మినీ స్టేడియాన్ని అభివృద్ధి పరిస్తే క్రీడల నిర్వహణకు వెసులుబాటు ఉంటుందని కౌన్సిలర్ పరిమళ పేర్కొన్నారు. మున్సిపల్ స్థలాలు, పార్కులు కబ్జాలకు గురికాకుండా బోర్డులు ఏర్పాటు చేయాలని, తాండూరులో రోడ్లు అధ్వానంగా మారాయని, ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని టీడీపీ ఫ్లోర్‌లీడర్ సుమిత్కుమాగౌడ్ కోరారు. అంబేడ్కర్ పార్కు అభివృద్ధి పర్చాలని కౌన్సిలర్ శోభారాణి కోరారు. బస్వన్నకట్ట వద్ద నుంచి పశువుల వధశాలను తరలించాలని కౌన్సిలర్ ఉష కోరారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తామని చైర్పర్సన్ హామీ ఇచ్చారు. అనంతరం ఏజెండాలోని ఒకటి నుంచి 23 వరకు అభివృద్ధి పనుల అంశాలపై చర్చించకుండానే కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మినీస్టేడియం నిర్వహణ బాధ్యతలను మున్సిపాలిటీ తీసుకోవడం తదితర 8 అంశాలపై స్వల్ప చర్చ అనంతరం రూ.1.85 కోట్ల పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. -
నల్లబ్యాడ్జీలతో వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్ల ధర్నా
అనంతపురం : హిందుపురం కౌన్సిల్ సమావేశంలో చర్చ లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మంగళవారం ధర్నాకు దిగారు. గాంధీ విగ్రహం ఎదుట వారు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కాగా కౌన్సిల్ సమావేశం ఈరోజు ఉదయం ప్రారంభం అయిన అయిదు నిమిషాలకే ముగిసింది. ఈ చర్యను వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు అభ్యంతరం తెలుపుతూ ఆందోళనకు దిగారు. -
మమ్మల్ని సెలవుల్లో పంపండి...
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో చైర్మన్, కౌన్సిలర్ల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. దాంతో ఇరువురి అంతర్గత విభేదాలతో తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను సెలవుల్లో పంపాలని ఆయన రీజనల్ జాయింట్ డైరెక్టర్ కి లేఖ రాశారు. మున్సిపల్ కమిషనర్ బాటలోనే ఇతర ఉద్యోగులు సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా మున్సిపల్ సమావేశంలో మంగళవారం సభ్యుల మధ్య గొడవకు దారి తీసింది. చైర్పర్సన్ ఆదేశాల మేరకు కమిషనర్ మల్లారెడ్డి...అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. షెడ్యూల్ ప్రకారం బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ సునీతారాణి నిన్న సాయంత్రం భేటీ అయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు కార్యాలయానికి చేరుకొని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చైర్మన్, కౌన్సిలర్ల మధ్య విభేదాలు అధికారులకు తలనొప్పిగా మారాయి.