అసలే అక్రమం... ఆపై నకిలీ!
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి నకిలీ, అక్రమ ఔషధాలను తీసుకువచ్చి వివిధ ఆస్పత్రులతో పాటు సామాన్యులకు విక్రయిస్తున్న ముఠా గుట్టును సౌత్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఆరుగురు సభ్యులున్న ముఠాలో ఇద్దరిని అరెస్టు చేసి రూ.28.72 లక్షల విలువైన ఔషధాలు స్వాదీనం చేసుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శనివారం వెల్లడించారు. కర్మన్‌ఘాట్‌కు చెందిన పోకల రమేష్, పెద్ద అంబర్‌పేట వాసి బి.రాఘవరెడ్డి వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఇందులో తీవ్రనష్టాలు రావడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అనువైన మార్గాలు అన్వేషించారు.
రమేష్ కు సమీప బంధువైన పూర్ణచంద్రరావుకు ఫార్మ రంగంలో అనుభవం ఉంది. గతంలో ఆల్ఫాజోలమ్ టాబ్లెట్లు అక్రమంగా విక్రయిస్తూ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులకు చిక్కాడు. ఇతగాడు ఉత్తరాది నుంచి అక్రమ, నకిలీ ఔషధాలను సిటీకి తీసుకువచ్చి తక్కువ ధరకు విక్రయిద్దామంటూ సలహా ఇచ్చాడు. లైసెన్సు లేకపోయినా ఈ దందాలోకి దిగిన వీరితో పాటు లక్ష్మణ్ అనే వ్యక్తి కూడా ముఠాలో చేరాడు. వీరంతా కలిసి ఉత్తరప్రదేశ్‌కు చెందిన నదీమ్, ఢిల్లీ వాసి అరుణ్ చౌదరి నుంచి ఈ ఔషధాలను తక్కువ ధరకు ఖరీదు చేస్తున్నారు. ఎలాంటి బిల్లులు, పత్రాలు లేకుండానే కొరియర్లో సిటీకి రప్పిస్తున్నారు. ఈ ఔషధాలను మార్కెట్ రేటు కంటే 30 నుంచి 40 శాతం తక్కువ ధరకు అమ్ముతూ రోగులను ఆకర్షిస్తున్నారు.
కొన్ని ఆస్పత్రులకు సైతం వీటిని సరఫరా చేస సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠా వ్యవహారాలపై ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎస్సై మహ్మద్ ముజఫర్ తన బృందంతో వలపన్నారు. శనివారం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఆస్పత్రి వద్ద రమేష్, రాఘవలను పట్టుకున్నారు. వీరి నుంచి స్వాదీనం చేసుకున్న ఔషధాల్లో డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌మార్క్, అరిస్టో సహా వివిధ కంపెనీల పేర్లతో ఉన్న వాటితో పాటు ఆస్పత్రులకు సరఫరా అయ్యే ‘నాట్ ఫర్ సేల్’ మందులు కూడా ఉన్నాయి. ఈ ముఠా కొన్ని ఔషధాలను వివిధ వైద్యశాలలకు సరఫరా చేసినట్లు గుర్తించారు. కేసును మలక్‌పేట పోలీసులకు అప్పగించారు.