చినుకు విలువ డాలర్!
► రొయ్యల రైతులు ఎదురు చూపులు
► సకాలంలో వర్షాలు పడితేనే దిగుబడికి అనుకూలం
► రొయ్య పిల్లలు స్టాక్ చేసిన రైతులు
డాలర్ పంటగా పిలుచుకొనే రొయ్యల రైతులు ఇప్పుడు గాబరా పడుతున్నారు. సాగుకు ఎంతో కీలకమైన వర్షం ఉంటే రైతులు ఆనందంగా నాట్యం చేస్తాయి. చెరువుల్లో ఉప్పు శాతం తగ్గి పంటలో ఎదుగుదల ఉంటుంది. అంటే చినుకు పడితే ఇంట్లో డాలర్లు వచ్చినట్లేనని రైతులు ఆనంద పడతారు. వర్షానికి చెరువులో ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గి చల్లబడుతుంది. ఎలాంటి రోగాలు కూడా రావు. పిల్లలు కూడా ఆహారం ఎక్కువగా తీసుకొని బలంగా పెరుగుతాయి. కానీ కొత్తపట్నం మండలంలోని రొయ్యల చెరువుల్లో ఇప్పటికీ వర్షపు నీరు నిలవలేదు. దీంతో రైతుల్లో నిస్తేజం అలముకుంది.
కొత్తపట్నం: ఈ ఏడాది సీజన్లో వర్షం ముఖం చాటేసింది. వర్షం పడితే నేచురల్ ఫీడ్ అయిన ప్లైటోప్లాంటీన, జూప్లాంటీనాలు చెరువుల్లో ఉత్పత్తి అవుతాయి. దీంతో రొయ్యలు ఈ సహజమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుని ఉత్పత్తి చేసే మేత తక్కువ తీసుంటాయి. దీనివల్ల రైతులకు ఖర్చు తగ్గుతుంది.
వరుణుడి కోసం ప్రార్థనలు
మండలంలో 2200 ఎకరాల్లో రొయ్యల సాగు ఉంది. కాగా 1700 ఎకరాల్లో రైతులు రొయ్య పిల్లలు వదిలి వర్షం కోసం పడిగాపులు కాస్తున్నారు. వారి ఆశలు ఫలిస్తే 500 ఎకరాల్లో నీరు నింపాలని ఎదురు చూస్తున్నారు. ఆయా ప్రాంత నీటి తీరునుబట్టి సంవత్సరానికి రెండు సార్లు పిల్లలు వదిలి సాగుబడి చేస్తారు. ప్రధానంగా సముద్రపు నీరు, బోరు నీరు, వర్షం నీరు ఉంటే రొయ్యల సాగు లాభదాయంగా ఉంటుందని రైతులంటున్నారు.
ఎకరాకు 2 లక్షల పిల్లలు
జూన్ నుంచి అక్టోబర్ వరకు.. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఎకరా చెరువుకు 1,50 లక్షల నుంచి 2 లక్షల వరకు రొయ్య పిల్లలు వదులుతారు. ఒక్కొక్క రొయ్య పిల్లను హేచరీల్లో 30 నుంచి 33 పైసలకు విక్రయిస్తారు. 4 నెలల 15 రోజుల వరకు పిల్లల్ని పెంచుతారు. ఒక్కో పిల్ల 20 నుంచి 30 గ్రాముల దాకా పెరుగుతుంది. 30 గ్రాములు పెరిగితే మాత్రం రైతుకు లాభం చేకూరుతుంది. అయితే వైరస్లు, డీఓ, చెరువులో పిల్లలు లేకపోవడం, ఇతర వ్యాధులు సోకడం వంటివి సంభవిస్తే భారీ నష్టం తప్పదు.
బీడు భూముల్లో కోట్ల సిరులు
వ్యవసాయ పంటలకు పనికరాని చౌడు భూముల్లో డాలర్ల పంట పండటం అదృష్టమే. సుమారు 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రొయ్యలు ఉత్పత్తి చేస్తూ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఏటా సాగుబడి పెరుగుతోంది. ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తోంది. వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. చిన్న సన్నకారు రైతులకు కొన్ని వసతులు లేకపోవంతో నష్ట పోయారు. ఇలాంటి రైతులను ఆదుకోవాలని, సంక్షేమ పథకాల్లో అవకాశం కల్పించాలని అంతా కోరుకుంటున్నారు.
వర్షం పడితే పంట బాగా వస్తుంది
నేను నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నా. చెరువులకు నీరు నింపి వారం రోజులైంది. జూన్లో పిల్లలు వేయాల్సింది. రెండు నెలలు ఆలస్యం అయింది. నెలకు ఒక్కో పదును వర్షం పడితే పంట చేతికొచ్చి లాభం వస్తుంది.
– పురిణి బ్రహ్మారెడ్డి, మోటుమాల
భారీగా నష్టపోతా...
పది ఎకరాల్లో నీరు నింపా. వారం రోజుల్లో రొయ్య పిల్లలు స్టాక్ చేస్తా. వర్షం పడుతుందని నమ్మకంతో పిల్లలు ఒదులుతున్నాను. వర్షం పడకపోతే భారీగా నష్టపోతాను. పోయిన సారి కూడా వర్షం పడక భారీగా నష్టపోయా.
– మూగ వెంకటేశ్వర్లు, కొత్తపట్నం