Country Division
-
ఉద్విగ్న క్షణాలు .. 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్క, తమ్ముడు
లాహోర్: 75 ఏళ్ల క్రితం దేశ విభజన సమయంలో విడిపోయిన తోబుట్టువులు మళ్లీ కలుసుకున్నారు. చిన్నతనంలో వేరుపడిన అక్క, తమ్ముడిని సామాజిక మాధ్యమాలు వృద్ధాప్యంలో కలిపాయి. ఇటీవల వీరిద్దరూ కర్తార్‌పూర్ కారిడార్ వద్ద కలుసుకుని ఉద్విగ్నభరితులయ్యారు. పంజాబ్‌కు చెందిన సర్దార్ భజన్ సింగ్ కుటుంబం 1947లో దేశ విభజన సమయంలో చెల్లాచెదురైంది. కొడుకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చేరగా కూతురు మహేంద్ర కౌర్ భజన్ సింగ్ వెంటే ఉన్నారు. ఇటీవల రెండు కుటుంబాల వారు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం పంచుకున్నారు. పంజాబ్‌లో ఉండే మహేంద్ర కౌర్ (81), పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండే షేక్ అబ్దుల్ అజీజ్ (78) స్వయానా అక్క, తమ్ముడని తెలుసుకున్నారు. తమ కుటుంబాలతో కలిసి కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా గురుద్వారా దర్బార్ సాహిబ్‌లో కలుసుకున్నారు. ఆలింగనాలు, ఆనంద బాష్పాలతో ఇద్దరూ ఉబ్బితబ్బిబ్బయ్యారని డాన్ పత్రిక పేర్కొంది. -
‘ఆ తప్పు చేయకపోతే దేశ విభజన జరిగేది కాదు’
కోల్‌కతా : ‘కాంగ్రెస్ పార్టీ జాతీయ గేయం వందేమాతరాన్ని కూడా విడదీసి చూస్తుంది... తన రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ గేయానికి మతం రంగు పులుముతుంద’ని విమర్శించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. గురువారమిక్కడ శ్యాంప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫౌండేషన్ వారి అధ్వర్యంలో జాతీయ గేయం ‘వందేమాతరం’ సృష్టికర్త బంకించంద్ర ఛటర్జీ తొలి స్మారకోత్సవానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘జాతీయ గేయమైన వందేమాతరం మన దేశ భౌగోళిక సాంప్రదాయనికి నిదర్శనం. ఇది ఏ మతానికి సంబంధించినది కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. జాతీయతకు ప్రతిరూపమైన ఈ గేయానికి మతం రంగులు పులమడం మంచిది కాదు. 1937లో కాంగ్రెస్ వందేమాతరాన్ని జాతీయ గేయంగా గుర్తించింది. కానీ వందేమాతరం గేయంలోని తొలి రెండు చరణాలను మాత్రమే తీసుకుంది. ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఆ తప్పు చేసి ఉండకపోతే దేశ విభజన జరిగేదే కాదు. కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వందేమాతరంలోని రెండు చరణాలను మాత్రమే జాతీయ గేయంగా తీసుకుంది. కేవలం ఒక మతం వారిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఇలా చేసింది. ఫలితంగా దేశం రెండుగా చీలిపోయింది. కాబట్టి దేశ విభజన పాపం కాంగ్రెస్‌దే. చాలా మంది చరిత్రకారులు దేశ విభజనకు కారణం ఖిలాఫత్ ఉద్యమం, విభజించు - పాలించు విధానం అనుకుంటూ వాటిని విమర్శిస్తారు. కానీ నా వరకూ మాత్రం కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వందేమాతరంలోని రెండు చరణాలను మాత్రమే తీసుకుని దేశ విభజనకు కారణమయ్యింది’ అన్నారు. -
దేశ విభజనకు కారణం నెహ్రూనే
జమ్ము: దేశ విభజన అంశంపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ విభజనకు జవహర్‌లానెహ్రూనే కారణమని ఆరోపించారు. శనివారం జమ్మూలోని షేర్–ఇ–కశ్మీర్ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘దేశ విభజనకు మహ్మద్ అలీ జిన్నా కారణం కాదు.. అప్పటి జాతీయ నేతలు జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్‌లే కారణం. ముస్లింలకు మైనారిటీ హోదా ఇచ్చేందుకు ఈ ముగ్గురు నేతలు అంగీకరించకపోవటమే విభజనకు దారి తీసింది. మొదట్లో జిన్నా పాకిస్తాన్ కావాలని అడగలేదు. ముస్లింలకు, సిక్కులకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించటంతో ప్రత్యేక దేశం డిమాండ్ వైపు జిన్నా మొగ్గు చూపటానికి దారి తీసిందని నేను భావిస్తున్నాను. లేకుంటే దేశం విడిపోయేది కాదు..బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లు ఉండేవికావు, భారత్ మాత్రమే ఉండేది’ అని తెలిపారు. మతాన్ని రాజకీయాల్లో వాడుకోవటాన్ని ఆయన ఖండించారు. మతం ఆధారంగా దేశాన్ని విభజించవద్దని ఆయన బీజేపీని కోరారు. ఇది దేశ అభివృద్ధికి, ఐక్యతకు, శాంతికి విఘాతం కలిగిస్తుందని చెప్పారు. దేశ విభజనకు కారకులెవరనే అంశంపై గత కొన్నేళ్లుగా సర్వత్రా చర్చ సాగుతోంది. పాకిస్తాన్ విడిపోవటానికి నెహ్రూ కారణమని కొందరు.. కాదు, జిన్నానే కారణమని మరికొందరు వాదిస్తున్నారు. -
కేసులు సరే.. అధికారులేరీ?
- సీఐడీలో దర్యాప్తు అధికారుల కొరత - ఏపీకి అధికారులను రిలీవ్ చేయడంతో సమస్య మరింత తీవ్రం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించే కేసులన్నీ నేర దర్యాప్తు సంస్థ (సీఐడీ)కు వెళ్తాయి. అయితే సీఐడీ మాత్రం అధికారుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సీఐడీలో ఒక అద నపు డీజీపీ, నలుగురు ఐజీలు, ఆరుగురు డీఐజీలు, 8 మంది ఎస్పీలు, 14 మంది అదనపు ఎస్పీలుండాలి. కానీ ప్రస్తుతం సీఐడీలో ఒక అదనపు డీజీపీ, ఒక ఐజీ, ఒక ఎస్పీ మాత్రమే ఉన్నారు. దీంతో సంచలనాత్మక కేసుల విచారణ, వాటి దర్యాప్తు మానిటరింగ్.. ఇలా అనేక అంశాలపై చేతులెత్తేసే పరిస్థితి. కాస్తో కూస్తో ఉన్న సిబ్బందితో నెట్టుకొస్తున్న సీఐడీకి ఇటీవల పోలీస్ శాఖ మరో షాక్ ఇచ్చింది. రాష్ట్ర విభజనలో ఏపీకి అలాట్ అయిన పలువురు అధికారులను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దీంతో సీఐడీలో ఇప్పటివరకు పనిచేసిన ముగ్గురు అదనపు ఎస్పీలు, నలుగురు డీఎ స్పీలు రిలీవ్ అయి వెళ్లిపోతున్నారు. మరో వైపు గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో అదనపు ఎస్పీ సస్పెండ్ అయ్యారు. ఇక మియాపూర్ స్కాం కేసుతోపాటు ఎంసెట్ స్కాం, బోధన్ స్కాం.. కేసులు కూడా ఇప్పుడు రిలీవ్ కాబో తున్న అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ అధికారులు రిలీవ్ అయితే ఈ కేసుల్లో దర్యాప్తు పరిస్థితి, వాటి పురోగతి ఏంటన్న దానిపై ఉన్నతాధికారుల్లో ఆందో ళన నెలకొంది. ఉన్న డీఎస్పీలతో దర్యాప్తు చేయించాలని చూస్తున్నా.. వాళ్లకు పాత కేసులే పీకల వరకు ఉన్నాయి. పైగా వారిని మానిటర్ చేసేందుకు నేరుగా సీఐడీ అదనపు డీజీపీయే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు కేసుల దర్యాప్తు, మరో వైపు అడ్మిన్ వ్యవహారాలు, ఆర్థిక నేరాలు, సైబర్ క్రైమ్, క్రైమ్ రికార్డ్స్బ్యూరో.. ఇలా అన్ని విభాగాలను సీఐడీ అదనపు డీజీపీయే చూసుకోవాల్సిన పరిస్థితి. పదోన్నతులు ప్రక్రియ పూర్తయితే కొంత మంది అధికారులను సీఐడీకి తీసుకుందామన్నా ఆ ప్రక్రియ ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి వెళ్తోంది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పోలీస్ అధికారులున్నారు.