
జమ్ము: దేశ విభజన అంశంపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ విభజనకు జవహర్‌లానెహ్రూనే కారణమని ఆరోపించారు. శనివారం జమ్మూలోని షేర్–ఇ–కశ్మీర్ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘దేశ విభజనకు మహ్మద్ అలీ జిన్నా కారణం కాదు.. అప్పటి జాతీయ నేతలు జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్‌లే కారణం. ముస్లింలకు మైనారిటీ హోదా ఇచ్చేందుకు ఈ ముగ్గురు నేతలు అంగీకరించకపోవటమే విభజనకు దారి తీసింది. మొదట్లో జిన్నా పాకిస్తాన్ కావాలని అడగలేదు.
ముస్లింలకు, సిక్కులకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించటంతో ప్రత్యేక దేశం డిమాండ్ వైపు జిన్నా మొగ్గు చూపటానికి దారి తీసిందని నేను భావిస్తున్నాను. లేకుంటే దేశం విడిపోయేది కాదు..బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లు ఉండేవికావు, భారత్ మాత్రమే ఉండేది’ అని తెలిపారు. మతాన్ని రాజకీయాల్లో వాడుకోవటాన్ని ఆయన ఖండించారు. మతం ఆధారంగా దేశాన్ని విభజించవద్దని ఆయన బీజేపీని కోరారు. ఇది దేశ అభివృద్ధికి, ఐక్యతకు, శాంతికి విఘాతం కలిగిస్తుందని చెప్పారు. దేశ విభజనకు కారకులెవరనే అంశంపై గత కొన్నేళ్లుగా సర్వత్రా చర్చ సాగుతోంది. పాకిస్తాన్ విడిపోవటానికి నెహ్రూ కారణమని కొందరు.. కాదు, జిన్నానే కారణమని మరికొందరు వాదిస్తున్నారు.