సాహసం చేయరా డింభకా..
దక్షిణాఫ్రికాలోని కృగర్ నేషనల్ పార్క్ గుండా రోడ్డుపై వెళ్లాలంటే సాహసం చేయక తప్పదు. ఎప్పుడు ఏ క్రూర మృగం మంద అడ్డం వచ్చి రోడ్డుపై భైఠాయిస్తుందో చెప్పలేం. అలాంటి సమయాల్లో పైప్రాణాలు పైనేపోతాయనే భయం పట్టుకున్నప్పటికీ సంయమనం పాటిస్తూ అడ్డం వచ్చిన జంతువులను చాకచక్యంగా తప్పించుకోవాల్సిందే. వాటికి చిర్రెత్తేలా హారన్ మోగించడం, స్పీడ్‌గా తప్పించుకుపోదామనే తొందరలో ఇంజన్ సౌండ్ మోతెక్కేలా కారును నడపకూడదు. మన మానాన మనం ఏ జంతువుకు భంగం వాటిల్ల కుండా వెళితే వాటి మానాన అవి పోతాయని ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. నీలిరంగు కారులో వస్తున్న ఓ కుర్రాడికి హఠాత్తుగా ఓ డజను సింహాలు ఎదురయ్యాయి.
అవి రోడ్డు దాటి వెళ్లిపోతాయని ఆ కుర్రాడు కారాపితే అవికాస్త కారు ముందే భైఠాయించాయి. అవి సరిపోనట్టు ఓ ఏనుగు నింపాదిగా కారు వేనకగా వచ్చి కాసేపు అక్కడే తచ్చాడింది. కారును వెనక్కి తిప్పలేని, ముందుకు పోనివ్యలేని పరిస్థితి. ధైర్యంగా కాసేపు అలాగే ఉండడంతో వెనకున్న ఏనుగు వెళ్లిపోయింది. ముందున్న సింహాలు కొంత దారిచ్చాయి. ఆ కుర్రాడు నీలిరంగు కారును మెల్లగా సింహాలను దాటించి బతుకుజీవుడా అనుకుంటూ తుర్రుమన్నాడు. ఈ చిత్రాన్ని ముందున్న కారులోని స్టెల్లా స్టీవర్ట్ అనే టూరిస్టు తీసింది. ఆమె ఎప్పుడో తీసిన ఈ చిత్రాన్ని ఇప్పుడు బయటపెట్టింది. అంతటి సాహసం చేసిన ఆ కుర్రాడు ఎవరనేదిమాత్రం తెలియరాలేదు.