breaking news
Court disputes
-
తప్పెవరిది... శిక్ష ఎవరికి ?
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సంస్థ ఆర్థిక పరిస్థితి తలకిందులవ్వడంతో ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. ప్రభుత్వ భూములను అమ్మిపెట్టడం ద్వారా హెచ్ఎం డీఏ లబ్ధి పొందిందేమీ లేకపోగా కష్టాలను కోరి తెచ్చుకున్నట్లైంది. పర్యవసానంగా అప్పులు, ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయింది. దీనికితోడు కోర్టు వివాదాలు, ఐటీ బకాయిలూ మెడకు చుట్టుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన భూముల విక్రయం వ్యవహారంపై కొత్త ప్రభుత్వాన్ని అడగలేక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఖజానాకు నిధులు సమకూర్చుకునే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వ ఆదేశానుసారం 2004 నుంచి 2013 వరకు మొత్తం 785 ఎకరాల సర్కారు భూముల్ని హెచ్ఎండీఏ వేలం ద్వారా విక్రయించింది. వీటిద్వారా వచ్చిన మొత్తం రూ.2150 కోట్లు కాగా, బ్యాంకు నుంచి రుణం తీసుకొని మరీ ప్రభుత్వ ఖజానాకు రూ.2650 కోట్ల వరకు చెల్లించింది. తెల్లాపూర్‌లో 400 ఎకరాలు విక్రయానికి పెట్టగా ఆ భూములు అమ్మకం జరగకముందే రూ.500 కోట్లు ఐఓబీ నుంచి అప్పు తెచ్చి మరీ ప్రభుత్వ ఖజానాకు జమచేసింది. ఈ నేపథ్యంలో తెల్లాపూర్ భూముల కొనుగోలు ఆగిపోవడంతో హెచ్ఎండీఏకు అప్పులు నెత్తినపడ్డాయి. దీనికితోడు కోకాపేటలో విక్రయించిన 100 ఎకరాల ప్రభుత్వ భూమి వ్యవహారం కూడా పీటముడిగా మారింది. ఈ భూముల విక్రయం ద్వారా వచ్చిన మొత్తం సొమ్ము ఎప్పుడో ప్రభుత్వ ఖజానాకు చేరిపోయింది. అయితే... ఈ భూములు కొనుగోలు చేసిన 10 సంస్థల్లో 8 సంస్థలు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. తమదికాని భూముల విక్రయాన్ని నెత్తికెత్తుకొని ఈ న్యాయపరమైన వివాదాలను ఇప్పుడు సొంతంగా భరించాల్సి వచ్చింది. కోకాపేటలో సర్వే నం. 109, 111, 114, 117లోని వంద ఎకరాల భూమి ప్రభుత్వం చెంత ఉండగానే ఇది మహ్మద్ నస్రత్ జంగ్ బహద్దూర్-1 వారసులదనీ, తాను వారి ప్రతినిధినంటూ కె.ఎస్.బి.అలీ 2006 ఏప్రిల్‌లో కోర్టులో రిట్ వేశారు. అయితే... దీన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా ఆ భూమిని హెచ్ఎండీఏకు బదలాయించి వేలం నిర్వహించమని సూచించింది. దీంతో హెచ్ఎండీఏ పక్కాగా ఆ పని పూర్తిచేసి వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేసింది. తెలిసీ మోసమా.. ? కోకాపేట భూముల విషయంలో న్యాయపరమైన వివాదం ఉన్న సంగతి ప్రభుత్వానికి ముందే తెలుసు. 2006 ఏప్రిల్‌లోనే కె.ఎస్.బి.అలీ ఈ భూమికి హక్కుదారు తానేనంటూ కోర్టులో కేసు వేశారు. ఆతర్వాత 2006 జూన్‌లో ఈ భూమిని అప్పటి ‘హుడా’ ప్రస్తుత హెచ్ఎండీఏకు ప్రభుత్వం అప్పగించింది. జులై 14న నోటిఫికేషన్ విడుదల చేసి వేలం నిర్వహించడం ద్వారా అనవసరంగా ఈ భూ వివాదంలో హెచ్ఎండీఏ కూడా పార్టీ కావాల్సి వచ్చింది. ఇప్పటికీ ఈ కేసులో హెచ్ఎండీఏ ప్రతివాదిగా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉంది. కోకాపేట భూములు విక్రయించగా వచ్చిన సొమ్ము ఇప్పటికే ప్రభుత్వ ఖజానాకు చేరినా వాటిని చెల్లించాల్సిన బాధ్యత మాత్రం హెచ్ఎండీఏపై పడింది. దీనికితోడు అసలు విక్రయాలు జరగని తెల్లాపూర్ భూములకు ప్రభుత్వానికి చెల్లించిన రూ.500 కోట్లు అప్పు కూడా హెచ్ఎండీఏనే నెత్తిన పడింది. కోకాపేట భూములు అమ్మగా వచ్చిన మొత్తానికి ఆదాయపన్ను కింద వడ్డీతో కలిపి రూ.728 కోట్లు చెల్లించాలంటూ ఐటీ అధికారులు హెచ్ఎండీఏకు తాకీదులిచ్చి పలుమార్లు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఇప్పటికే రూ.285 కోట్ల దాకా వాయిదాల పద్ధతిలో వసూలు చేశారు. మిగతా మొత్తాన్ని ఇదే రీతిలో చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ ఖ జానా ఖాళీ కావడంతో అధికారులు దిక్కులు చూస్తున్నారు. జీతాలు, ఇతర అత్యవసరాల కోసం హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) నుంచి రూ.10-20 కోట్లు అప్పుగా తీసుకొని బండి నడిపిస్తున్నారు. అయితే... కోకాపేట భూములు కొనుగోలు చేసిన ప్రైవేటు సంస్థలు మాత్రం ఏదో రకంగా తమ డబ్బును దక్కించుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్నాయి. ఈ పరిణామాలతో మహానగరాభివృద్ధి సంస్థ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వమే దీనికి ఏదో ఒక తరుణోపాయం ఆలోచించకపోతే హెచ్ఎండీఏ నావ నట్టేటిలో మునిగిపోవడం ఖాయంగా కన్పిస్తోంది. -
ఔటర్...బహు దూర్
ప్రాజెక్టు పేరు : జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్డు మొత్తం నిడివి : 158 కి.మీ. (8 లేన్లు) ప్రాజెక్టు వ్యయం : సుమారు రూ.ఏడు వేల కోట్లు పనులు ప్రారంభించింది : 2006లో నిర్దేశిత గడువు : 2012 నవంబర్ పొడిగించిన గడువు : 2013 డిసెంబర్ (ముగిసింది) ప్రస్తుతం పూర్తయిన రోడ్డు : 125 కి.మీ. అసంపూర్తిగా ఉన్న రోడ్డు : 33.3 కి.మీ. ఎప్పటికి పూర్తవుతుంది? : చెప్పలేం.. సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మకమైన ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ప్రాజెక్టు నిర్దేశిత గడువు ముగిసి ఐదు నెలలవుతున్నా... ఇంకా 33.3 కి.మీ. రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది. అసలు ఈ ప్రాజె క్టు ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేని అయోమయ పరిస్థితి ఎదురైంది. కారణాలేమైనా... ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం కారణంగా హెచ్ఎండీఏపై రూ.120 కోట్ల అదనపు భారం పడింది. అంటే... ఆ భారమంతా పరోక్షంగా ప్రజలపై పడ్డట్లే. శామీర్‌పేట నుంచి కీసర వరకు 10.3 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం ఇంతవరకు ప్రారంభం కాకపోవడం ప్రాజక్టులో పనుల తీరుకు అద్దంపడుతోంది. నిజానికి నిర్దేశిత గడువు ప్రకారం 2012 నవంబర్ నాటికి ఔటర్ రింగ్‌రోడ్డు మొత్తం 158 కి.మీ. నిర్మాణం పూర్తవ్వాలన్నది లక్ష్యం. అయితే... భూ సేకరణ విషయంలో కోర్టు వివాదాలు, విద్యుత్ హెచ్‌టీ లైన్లు, వాటర్ పైపులైన్లు తొలగించే విషయంలో సకాలంలో అనుమతులు మంజూరవక పోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకొంది. దీంతో ప్రాజెక్టు నిర్దేశిత గడువును 2013 డిసెంబర్ 30కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఆ గడువు కూడా ముగిసి ఐదు నెలలైనా ఔటర్ నిర్మాణం అంగుళం కూడా ముందుకు కదలకపోవడం గమనార్హం. అయితే.. ఓఆర్ఆర్ ప్రాజెక్టు అధికారులు మాత్రంమిగిలిపోయిన ఔటర్ పనులను వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటిస్తున్నారు. మరి ఇదెలా సాధ్యమో... స్వల్ప కాలంలో ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారన్నది వారికే తెలియాలి. తడిసి మోపెడు.. ఔటర్ రింగురోడ్డు నిర్మాణ పనులు 2006లో ప్రారంభమైనా... ఇప్పటివరకు కేవలం 125 కి .మీ. రహదారి నిర్మాణం మాత్రమే పూర్తయింది. గత ప్రభుత్వం ఔటర్ గురించి పట్టించుకోక పోవడం.. అధికారులు లక్ష్యాన్ని గాలికి వదిలేయడం.. తదితర కారణాల వల్ల ఇప్పుడు ఖర్చు తడిసి మోపెడైంది. ప్రస్తుతం శామీర్‌పేట్-కీసర మార్గంలో 10.3 కి.మీ. రోడ్డు నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. కాంట్రాక్టర్‌తో పనులు చేయించుకోవడం రాని అధికారులు నోటీసులిస్తూ కాలం వెళ్లదీశారు. ఇప్పుడు పీకల మీదకు రావడంతో ఈ గండం నుంచి బయటపడేందుకు ఇటీవలే సదరు కాంట్రాక్టు సంస్థకు ఉద్వాసన (టెర్మినేట్) పలికారు. మిగిలిపోయిన ఆ మార్గానికి మళ్లీ టెండర్లు పిలిచేందుకు తాజాగా ఎస్టిమేట్స్ (అంచనాలు) రూపొందించిన అధికారులకు ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి. పాత టెండర్ ప్రకారం 10.3 కి.మీ మార్గంలో మిగిలిపోయిన పనులకు రూ.100 కోట్లు ఖర్చవుతుండగా, కొత్త ఎస్టిమేట్స్ ప్రకారం ఆ పనులు పూర్తి చేయడానికి రూ.200 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. శామీర్‌పేట- కీసర 10.3 కి.మీ మార్గంతో పాటు కీసర-ఘట్కేసర్ మార్గంలో 11 కి.మీ.లు, ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట మార్గంలో 12 కి.మీ. మొత్తం 33.3 కి.మీ. మార్గం అసంపూర్తిగా ఉంది. అక్కడ ఇంకా 50 శాతం పనులు చేయాల్సి ఉందని అధికారులే చెబుతున్నారు. కీసర-ఘట్కేసర్, ఘట్కేసర్- పెద్దఅంబర్‌పేట మార్గంలో ప్రధాన రహదారి నిర్మాణాన్ని పూర్తిచేసి నూతన సంవత్సర కానుకగా వరంగల్-విజయవాడ జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తామని అధికారులు గతంలో ఆర్భాటంగా ప్రకటించారు. మిగతా సర్వీసు రోడ్లు, జంక్షన్ల పనులు 2014 ఆగస్టు నాటికి పూర్తిచేస్తామని గడువును కూడా ప్రకటించారు. అయితే...ఇంతవరకు ప్రధాన మార్గానికే దిక్కులేదు. ఇక సర్వీసు రోడ్లు, జంక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లక్ష్యాల మేరకు పనులు చేయనప్పుడు కాంట్రాక్టర్‌కు మొదట నోటీసులిచ్చి ఆ తర్వాత ఉద్వాసన పలకడం పరిపాటి. అయితే... రాజకీయ ఒత్తిళ్లు, అంతర్గత ఒప్పందాల వల్ల చర్యలు తీసుకొనేందుకు అధికారులు మీనమేషాలు లెక్కించారు. ఆ నిర్లక్ష్యం ఖరీదు రూ.120 కోట్లకు చేరింది. ఇదంతా పరోక్షంగా ప్రజలపై భారం పడ్డట్లే. ఎస్కలేషన్ మోత ఆలస్యం.. అమృతం విషమంటారు. సరిగ్గా ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు విషయంలో కూడా ఇదే జరిగింది. కోర్టు కే సుల వల్ల సమయానికి భూమిని అప్పగించక పోవడం, ఆర్వోబీకి సంబంధించిన డిజైన్‌ను సకాలంలో అందించకపోతే ఒప్పందంలోని నిబంధన ప్రకారం కాంట్రాక్టర్‌కు ఎస్కలేషన్ చెల్లించాలి. కండ్లకోయ జంక్షన్‌కు సుమారు రూ.15-18 కోట్ల వరకు ఎస్కలేషన్ చెల్లించాల్సి వస్తుందని అంచనా. ఘట్కేసర్ జంక్షన్, ఆర్వోబీలకు సంబంధించి కూడా ఎస్కలేషన్ చెల్లించక తప్పని పరిస్థితి. ఇలా ప్రాజెక్టులో జాప్యం వల్ల హెచ్ఎండీఏపై మరో రూ.20 కోట్ల అదనపు భారం పడింది. ఇప్పుడు శామీర్‌పేట-కీసర పనులు చేయాల్సిన కాంట్రాక్టు సంస్థకు ఉద్వాసన పలకడం వల్ల ప్రాజెక్టు వ్యయం రూ.200 కోట్లకు పెరిగింది. దీనికి మళ్లీ టెండర్ పిలిచే విషయం ఇప్పుడు పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక హైలెవెల్ కమిటీ అనుమతి తీసుకొని టెండర్‌కు వెళ్లాలని హెచ్ఎండీఏ యోచిస్తోంది. అయితే... సంస్థపై అదనంగా పడ్డ భారానికి అసలు బాధ్యులు ఎవరన్నది కొత్త ప్రభుత్వం నిగ్గు తేల్చాల్సి ఉంది.