తప్పెవరిది... శిక్ష ఎవరికి ? | Change of conservation zone opposed | Sakshi
Sakshi News home page

తప్పెవరిది... శిక్ష ఎవరికి ?

Published Mon, Jan 12 2015 4:16 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

తప్పెవరిది... శిక్ష ఎవరికి ? - Sakshi

తప్పెవరిది... శిక్ష ఎవరికి ?

హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సంస్థ ఆర్థిక పరిస్థితి తలకిందులవ్వడంతో ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. ప్రభుత్వ భూములను అమ్మిపెట్టడం ద్వారా హెచ్‌ఎం డీఏ లబ్ధి పొందిందేమీ లేకపోగా కష్టాలను కోరి తెచ్చుకున్నట్లైంది. పర్యవసానంగా అప్పులు, ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయింది. దీనికితోడు కోర్టు వివాదాలు, ఐటీ బకాయిలూ మెడకు చుట్టుకున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన భూముల విక్రయం వ్యవహారంపై కొత్త ప్రభుత్వాన్ని అడగలేక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఖజానాకు నిధులు సమకూర్చుకునే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వ ఆదేశానుసారం 2004 నుంచి 2013 వరకు మొత్తం 785 ఎకరాల సర్కారు భూముల్ని హెచ్‌ఎండీఏ వేలం ద్వారా విక్రయించింది. వీటిద్వారా వచ్చిన మొత్తం రూ.2150 కోట్లు కాగా, బ్యాంకు నుంచి రుణం తీసుకొని మరీ ప్రభుత్వ ఖజానాకు రూ.2650 కోట్ల వరకు చెల్లించింది.

తెల్లాపూర్‌లో 400 ఎకరాలు విక్రయానికి పెట్టగా ఆ భూములు అమ్మకం జరగకముందే రూ.500 కోట్లు ఐఓబీ నుంచి అప్పు తెచ్చి మరీ ప్రభుత్వ ఖజానాకు జమచేసింది. ఈ నేపథ్యంలో తెల్లాపూర్ భూముల కొనుగోలు ఆగిపోవడంతో హెచ్‌ఎండీఏకు అప్పులు నెత్తినపడ్డాయి. దీనికితోడు  కోకాపేటలో విక్రయించిన 100 ఎకరాల ప్రభుత్వ భూమి వ్యవహారం కూడా పీటముడిగా మారింది.

ఈ భూముల విక్రయం ద్వారా వచ్చిన మొత్తం సొమ్ము ఎప్పుడో ప్రభుత్వ ఖజానాకు చేరిపోయింది. అయితే... ఈ భూములు కొనుగోలు చేసిన 10 సంస్థల్లో 8 సంస్థలు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. తమదికాని భూముల విక్రయాన్ని నెత్తికెత్తుకొని ఈ న్యాయపరమైన వివాదాలను ఇప్పుడు సొంతంగా భరించాల్సి వచ్చింది. కోకాపేటలో సర్వే నం. 109, 111, 114, 117లోని వంద ఎకరాల భూమి ప్రభుత్వం చెంత ఉండగానే ఇది మహ్మద్ నస్రత్ జంగ్ బహద్దూర్-1 వారసులదనీ, తాను వారి ప్రతినిధినంటూ కె.ఎస్.బి.అలీ 2006 ఏప్రిల్‌లో కోర్టులో రిట్ వేశారు. అయితే... దీన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా ఆ భూమిని హెచ్‌ఎండీఏకు బదలాయించి వేలం నిర్వహించమని సూచించింది. దీంతో హెచ్‌ఎండీఏ పక్కాగా ఆ పని పూర్తిచేసి వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేసింది.
 
తెలిసీ మోసమా.. ?
కోకాపేట భూముల విషయంలో న్యాయపరమైన వివాదం ఉన్న సంగతి ప్రభుత్వానికి ముందే తెలుసు. 2006 ఏప్రిల్‌లోనే కె.ఎస్.బి.అలీ ఈ భూమికి హక్కుదారు తానేనంటూ కోర్టులో కేసు వేశారు. ఆతర్వాత  2006 జూన్‌లో ఈ భూమిని అప్పటి ‘హుడా’ ప్రస్తుత హెచ్‌ఎండీఏకు  ప్రభుత్వం అప్పగించింది. జులై 14న  నోటిఫికేషన్ విడుదల చేసి వేలం నిర్వహించడం ద్వారా అనవసరంగా ఈ భూ వివాదంలో హెచ్‌ఎండీఏ కూడా పార్టీ కావాల్సి వచ్చింది.  

ఇప్పటికీ  ఈ కేసులో హెచ్‌ఎండీఏ ప్రతివాదిగా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉంది. కోకాపేట భూములు విక్రయించగా వచ్చిన సొమ్ము ఇప్పటికే ప్రభుత్వ ఖజానాకు చేరినా వాటిని చెల్లించాల్సిన బాధ్యత మాత్రం హెచ్‌ఎండీఏపై పడింది. దీనికితోడు అసలు విక్రయాలు జరగని తెల్లాపూర్ భూములకు ప్రభుత్వానికి చెల్లించిన రూ.500 కోట్లు అప్పు కూడా హెచ్‌ఎండీఏనే నెత్తిన పడింది.

కోకాపేట భూములు అమ్మగా వచ్చిన మొత్తానికి ఆదాయపన్ను కింద వడ్డీతో కలిపి రూ.728 కోట్లు చెల్లించాలంటూ ఐటీ అధికారులు హెచ్‌ఎండీఏకు తాకీదులిచ్చి పలుమార్లు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఇప్పటికే రూ.285 కోట్ల దాకా వాయిదాల పద్ధతిలో వసూలు చేశారు. మిగతా మొత్తాన్ని ఇదే రీతిలో చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ ఖ జానా  ఖాళీ కావడంతో అధికారులు దిక్కులు చూస్తున్నారు.

జీతాలు, ఇతర అత్యవసరాల కోసం హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) నుంచి రూ.10-20 కోట్లు అప్పుగా తీసుకొని బండి నడిపిస్తున్నారు. అయితే... కోకాపేట భూములు కొనుగోలు చేసిన ప్రైవేటు సంస్థలు మాత్రం ఏదో రకంగా తమ డబ్బును దక్కించుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్నాయి. ఈ పరిణామాలతో మహానగరాభివృద్ధి సంస్థ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వమే దీనికి ఏదో ఒక తరుణోపాయం ఆలోచించకపోతే హెచ్‌ఎండీఏ నావ నట్టేటిలో మునిగిపోవడం ఖాయంగా కన్పిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement