
ఖజానా ఖాళీ !
* ఆర్థిక సంక్షోభంలో హెచ్‌ఎండీఏ
* ఈనెల జీతాలూ కష్టమే ?
* ఆదాయపన్ను, అప్పులపై వడ్డీతో విలవిల
* గండం గట్టెక్కాలంటే రూ.100కోట్లు తక్షణావసరం
సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ మహా నగరాభివృద్ధికి దిశా నిర్దేశం చేయాల్సిన హెచ్‌ఎండీఏ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోవడంతో హెచ్‌ఎండీఏ ఖజానా ఖాళీ అయింది. దీంతో ఉద్యోగులకు ఈ నెల జీతాలు ఎలా చెల్లించాలో అర్థంగాక అధికారులు తలలు పట్టుకొంటున్నారు.
రియల్ బూమ్ తగ్గడంతో హెచ్‌ఎండీఏకు వివిధ అనుమతుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇప్పటికే బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులకు వడ్డీ, అసలు వాయిదాలు, ఐటీ బకాయిలు సంస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20 నాటికి సర్వీసు ట్యాక్స్, ఐటీ బకాయీలు, హడ్కో, ఇండియన్ బ్యాంకులకు రుణం- వడ్డీలు కలిపి మొత్తం రూ.50 కోట్లు చెల్లించాల్సి రావడం అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
వీటికితోడు ఉప్పల్ భగత్ లేఅవుట్ అభివృద్ధి ప్రాజెక్టు బిల్లులతో పాటు హుస్సేన్‌సాగర్, ఇతర నిర్వహణ బిల్లులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి ఉంది. నిజానికి ఐటీ బకాయిల కింద రూ.11.5 కోట్లు నవంబర్‌లోనే చెల్లించాల్సి ఉన్నా డబ్బుల్లేకపోవడంతో ఆపేశారు. వాటిని ఈ నెలాఖరుకు చెల్లించాల్సి ఉంది. అలాగే హడ్కో నుంచి తీసుకొన్న రుణం తాలూకు వడ్డీ రూ.35 కోట్లు, ఇండియన్ బ్యాంకుకు రూ.2.5 కోట్లు, సర్వీసు ట్యాక్స్ కింద రూ.1.50 కోట్లతో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల బిల్లులు మరో రూ.50 కోట్ల దాకా చెల్లించాల్సి ఉందని అధికారులు హడలిపోతున్నారు.
ప్రభుత్వం నుంచి తక్షిణం రూ.100 కోట్లు ఆర్థిక సాయం అందితే తప్ప ఈ గండం నుంచి గట్టెక్కే పరిస్థితి కన్పించడం లేదు. నిజానికి గత నెలలోనే సంస్థ ఆర్థిక పరిస్థితి తిరగబడింది. దీంతో వెంటనే అధికారులు రూ.100 కోట్లు ప్రత్యేక గ్రాంట్ కింద ఇచ్చి హెచ్‌ఎండీఏను ఆదుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే, ఇంతవరకు సర్కార్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
ఆగిన చెల్లింపులు
హెచ్‌ఎండీఏ ఖజానా నిండుకోవడంతో చిన్నచిన్న బిల్లులు సైతం చెల్లించలేని పరిస్థితి ఎదురైంది. ఈ పరిస్థితి బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకొంటూ ఈ నెలాఖరు వరకు ఏ బిల్లును కూడా పంపవద్దంటూ అంతర్గతంగా అన్ని విభాగాలకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఉప్పల్ భగత్ లేఅవుట్ అభివృద్ధి ప్రాజెక్టు తాలూకు గత నెల బిల్లు రూ.4 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉండగా రూ.2 కోట్లు మాత్రమే చెల్లించారు.
అలాగే అర్భన్ ఫారెస్ట్రీకి నిర్వహణ బిల్లులు ఆపేశారు. సంస్థకు ఆర్థిక వనరుగా ఉన్న ప్లానింగ్ విభాగం నుంచి నెలకు రూ.20-22కోట్ల ఆదాయం వచ్చేది. అయితే, నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా లేకపోవడంతో అనుమతుల కోసం హెచ్‌ఎండీఏ వైపు కన్నెత్తి చూసే నాధుడే లేకుండా పోయాడు. గత నెలలో ఈరూపేణా రూ.6-7 కోట్లు కూడా ఆదాయం రాకపోవడం వాస్తవ పరిస్థితికి అద్దంపడుతోంది. ఈ కారణంగానే విధిలేని పరిస్థితుల్లో బిల్లుల చెల్లింపును నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు.