IT dues
-
తప్పెవరిది... శిక్ష ఎవరికి ?
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సంస్థ ఆర్థిక పరిస్థితి తలకిందులవ్వడంతో ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. ప్రభుత్వ భూములను అమ్మిపెట్టడం ద్వారా హెచ్ఎం డీఏ లబ్ధి పొందిందేమీ లేకపోగా కష్టాలను కోరి తెచ్చుకున్నట్లైంది. పర్యవసానంగా అప్పులు, ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయింది. దీనికితోడు కోర్టు వివాదాలు, ఐటీ బకాయిలూ మెడకు చుట్టుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన భూముల విక్రయం వ్యవహారంపై కొత్త ప్రభుత్వాన్ని అడగలేక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఖజానాకు నిధులు సమకూర్చుకునే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వ ఆదేశానుసారం 2004 నుంచి 2013 వరకు మొత్తం 785 ఎకరాల సర్కారు భూముల్ని హెచ్ఎండీఏ వేలం ద్వారా విక్రయించింది. వీటిద్వారా వచ్చిన మొత్తం రూ.2150 కోట్లు కాగా, బ్యాంకు నుంచి రుణం తీసుకొని మరీ ప్రభుత్వ ఖజానాకు రూ.2650 కోట్ల వరకు చెల్లించింది. తెల్లాపూర్‌లో 400 ఎకరాలు విక్రయానికి పెట్టగా ఆ భూములు అమ్మకం జరగకముందే రూ.500 కోట్లు ఐఓబీ నుంచి అప్పు తెచ్చి మరీ ప్రభుత్వ ఖజానాకు జమచేసింది. ఈ నేపథ్యంలో తెల్లాపూర్ భూముల కొనుగోలు ఆగిపోవడంతో హెచ్ఎండీఏకు అప్పులు నెత్తినపడ్డాయి. దీనికితోడు కోకాపేటలో విక్రయించిన 100 ఎకరాల ప్రభుత్వ భూమి వ్యవహారం కూడా పీటముడిగా మారింది. ఈ భూముల విక్రయం ద్వారా వచ్చిన మొత్తం సొమ్ము ఎప్పుడో ప్రభుత్వ ఖజానాకు చేరిపోయింది. అయితే... ఈ భూములు కొనుగోలు చేసిన 10 సంస్థల్లో 8 సంస్థలు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. తమదికాని భూముల విక్రయాన్ని నెత్తికెత్తుకొని ఈ న్యాయపరమైన వివాదాలను ఇప్పుడు సొంతంగా భరించాల్సి వచ్చింది. కోకాపేటలో సర్వే నం. 109, 111, 114, 117లోని వంద ఎకరాల భూమి ప్రభుత్వం చెంత ఉండగానే ఇది మహ్మద్ నస్రత్ జంగ్ బహద్దూర్-1 వారసులదనీ, తాను వారి ప్రతినిధినంటూ కె.ఎస్.బి.అలీ 2006 ఏప్రిల్‌లో కోర్టులో రిట్ వేశారు. అయితే... దీన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా ఆ భూమిని హెచ్ఎండీఏకు బదలాయించి వేలం నిర్వహించమని సూచించింది. దీంతో హెచ్ఎండీఏ పక్కాగా ఆ పని పూర్తిచేసి వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేసింది. తెలిసీ మోసమా.. ? కోకాపేట భూముల విషయంలో న్యాయపరమైన వివాదం ఉన్న సంగతి ప్రభుత్వానికి ముందే తెలుసు. 2006 ఏప్రిల్‌లోనే కె.ఎస్.బి.అలీ ఈ భూమికి హక్కుదారు తానేనంటూ కోర్టులో కేసు వేశారు. ఆతర్వాత 2006 జూన్‌లో ఈ భూమిని అప్పటి ‘హుడా’ ప్రస్తుత హెచ్ఎండీఏకు ప్రభుత్వం అప్పగించింది. జులై 14న నోటిఫికేషన్ విడుదల చేసి వేలం నిర్వహించడం ద్వారా అనవసరంగా ఈ భూ వివాదంలో హెచ్ఎండీఏ కూడా పార్టీ కావాల్సి వచ్చింది. ఇప్పటికీ ఈ కేసులో హెచ్ఎండీఏ ప్రతివాదిగా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉంది. కోకాపేట భూములు విక్రయించగా వచ్చిన సొమ్ము ఇప్పటికే ప్రభుత్వ ఖజానాకు చేరినా వాటిని చెల్లించాల్సిన బాధ్యత మాత్రం హెచ్ఎండీఏపై పడింది. దీనికితోడు అసలు విక్రయాలు జరగని తెల్లాపూర్ భూములకు ప్రభుత్వానికి చెల్లించిన రూ.500 కోట్లు అప్పు కూడా హెచ్ఎండీఏనే నెత్తిన పడింది. కోకాపేట భూములు అమ్మగా వచ్చిన మొత్తానికి ఆదాయపన్ను కింద వడ్డీతో కలిపి రూ.728 కోట్లు చెల్లించాలంటూ ఐటీ అధికారులు హెచ్ఎండీఏకు తాకీదులిచ్చి పలుమార్లు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఇప్పటికే రూ.285 కోట్ల దాకా వాయిదాల పద్ధతిలో వసూలు చేశారు. మిగతా మొత్తాన్ని ఇదే రీతిలో చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ ఖ జానా ఖాళీ కావడంతో అధికారులు దిక్కులు చూస్తున్నారు. జీతాలు, ఇతర అత్యవసరాల కోసం హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) నుంచి రూ.10-20 కోట్లు అప్పుగా తీసుకొని బండి నడిపిస్తున్నారు. అయితే... కోకాపేట భూములు కొనుగోలు చేసిన ప్రైవేటు సంస్థలు మాత్రం ఏదో రకంగా తమ డబ్బును దక్కించుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్నాయి. ఈ పరిణామాలతో మహానగరాభివృద్ధి సంస్థ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వమే దీనికి ఏదో ఒక తరుణోపాయం ఆలోచించకపోతే హెచ్ఎండీఏ నావ నట్టేటిలో మునిగిపోవడం ఖాయంగా కన్పిస్తోంది. -
‘క్రమబద్ధీకరణ’ కష్టమేనా?
సాక్షి, హైదరాబాద్ : మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో ఎల్ఆర్ఎస్/బీపీఎస్ పెండింగ్ దరఖాస్తులు అటకెక్కాయి. ఎల్ఆర్ఎస్, బీపీఎస్‌ల క్రమబద్ధీకరణకు మరోసారి అవకాశమిచ్చే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎటూ తేల్చక పోవడంతో అయోమయం నెలకొంది. ఈ విషయమై రెండు నెలల క్రితం కొత్త ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన కరువైంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో ఐటీ బకాయిల కింద రూ.485 కోట్లు తక్షణం చెల్లించాల్సి రావడంతో హెచ్ఎండీఏ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇందుకు సర్కార్ నిధులు సమకూర్చక పోయినా... కనీసం ఎల్ఆర్ఎస్/బీపీఎస్ పెండింగ్ దరఖాస్తులనైనా క్లియర్ చేసేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. విషయాన్ని సచివాలయం స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫైల్ సీఎం వద్ద ఉందని చెబుతుండటంతో చేసేదిలేక వెనుదిరుగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖను పర్యవేక్షిస్తున్నందున హెచ్ఎండీఏ చైర్మన్ హోదాలో చర్యలు చేపట్టి సంస్థను ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలని అధికారులు అభ్యర్థిస్తున్నారు. రూ.200 కోట్ల ఆదాయం నగర శివార్లలో 80 వేలకు పైగా అక్రమ లే అవుట్లు, నిర్మాణాలున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. వీటిని క్రమబద్ధీకరిస్తే మరో రూ.200 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందని అంచనా. ఇప్పటికే మొత్తం ఫీజు చెల్లించిన వారు 1000 మంది, సగం ఫీజు చెల్లించిన వారు 15 వేలకు పైగా ఉన్నారు. అయితే క్రమబద్ధీక రించినట్లుగా వారికి అధికారిక పత్రం ఇవ్వలేదు. ఎల్ఆర్ఎస్/బీపీఎస్‌లపై ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేదాకా తామేం చేయలేమంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసినా రూ.100 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. వారిపై చర్యలేవీ? ఎల్ఆర్ఎస్, బీపీఎస్‌ల కింద దరఖాస్తు చేసుకున్న వారికి మినహా అసలు ఈ పథకాన్ని ఇంతవరకు పట్టించుకోని వారి సంగతే హెచ్ఎండీఏకు పట్టినట్లులేదు. వారికి నోటీసులు జారీ చేసేందుకు హెచ్ఎండీఏ వద్ద తగిన జాబితా అంటూ లేదు. శివార్లలో అనేక విద్యాసంస్థలు, పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. పలుచోట్ల అడ్డగోలుగా లే అవుట్లు వెలిశాయి. వీటిలో కనీసం 5 శాతం కూడా దరఖాస్తు చేసుకున్న పాపానపోలేదు. నిజాంపేట, బాచుపల్లి ప్రాంతాల్లో ఎల్ఆర్ఎస్ కింద 4500 దరఖాస్తులు రాగా వీరిలో 10 శాతం కూడా ఫీజు చెల్లించలేదు. శామీర్‌పేట, తూముకుంట, కొంపల్లి, కొహెడ, నాగారం, దమ్మాయిగూడెం ప్రాంతాల్లో క్రమబద్ధీకరించాల్సిన లేఅవుట్లు అధికంగా ఉన్నాయి. మణికొండ, బండ్లగూడ, పీరాన్‌చె రువు, అమీన్పూర్, ఫీర్జాదిగూడ, బోడుప్పల్ ప్రాంతాల్లో 30-40 శాతం మేర మాత్రమే ఫీజు వసూలయ్యాయి. అందరూ క్రమబద్ధీకరణకు ముందుకు వస్తే హెచ్ఎండీఏకు రూ.250-300కోట్లు ఆదాయం వచ్చే అవకాశముందని తెలుస్తోంది.