సెలవు ఇవ్వండి.. సీజేఐకి లేఖ
లక్నో: అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన వేడుకను వీక్షించేందుకు జనవరి 22న కోర్టులకు సెలవు ఇవ్వాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ చారిత్రక సందర్భాన్ని గుర్తించడానికి తగిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నట్లు బార్ కౌన్సిల్ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా లేఖలో పేర్కొన్నారు. ఈ అభ్యర్థనను అత్యంత సానుభూతితో పరిగణించాలని సీజేఐని కోరారు.
"అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకలు, దేశవ్యాప్తంగా జరిగే ఇతర సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనడానికి కోర్టు సిబ్బందికి సెలవు రోజు అవసరం అవుతోంది." అని బార్ కౌన్సిల్ ఛైర్మన్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా అన్నారు. తక్షణ విచారణ అవసరమయ్యే అంశాన్ని ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా సర్దుబాటు చేయవచ్చు లేదా తదుపరి రోజుకు రీషెడ్యూల్ చేయవచ్చని ఆయన లేఖలో పేర్కొన్నారు.
అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సాధువులు, ప్రముఖులతో సహా 7,000 మందికి పైగా ప్రజలు ఈ వేడుకలకు హాజరవనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వివిధ దేశాల నుండి దాదాపు 100 మంది ప్రతినిధులు పాల్గొంటారు.
ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్యలో కలశ పూజ