బాంబే హైకోర్టుకు వర్షం సెలవులు!
భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవులు ఇవ్వడం చూశాం కానీ హైకోర్టుకు కూడా సెలవు ప్రకటించడం ఎప్పుడైనా విన్నారా? బాంబే హైకోర్టుకు ఇలా సెలవు ప్రకటించారు. ముంబై మహానగరంలో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. దీంతో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అక్కడి హైకోర్టుకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే విద్యాసంస్థలు మూతపడ్డాయి. యూనివర్సిటీ ఆఫ్ ముంబై తన పరీక్షలను రద్దుచేసింది.
రాజకీయ కార్యక్రమాలన్నీ కూడా రద్దయిపోయాయి. అత్యవసరమైన పని ఉంటే తప్ప అసలు ప్రజలను ఇళ్ల నుంచి బయటకు కదలొద్దని ప్రజలకు అధికారులు స్పష్టంగా చెప్పారు. పిల్లలను స్కూళ్లకు పంపొద్దన్నారు. చాలా వరకు ప్రైవేటు స్కూళ్లు కూడా సెలవులు ప్రకటించేశాయి. కాంగ్రెస్, ఎన్సీపీ లాంటి పార్టీలు విలేకరుల సమావేశాలను కూడా రద్దుచేసుకున్నాయి. సముద్రంలో భారీ ఎత్తున అలలు చెలరేగే అవకాశం ఉంది కాబట్టి.. అసలు ప్రజలను ముంబై బీచ్ సమీపానికి రావొద్దని అధికారులు హెచ్చరించారు. సుమారు 4.6 మీటర్ల ఎత్తున అలలు రావొచ్చని చెప్పారు.