అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్
మాచారెడ్డి, న్యూస్‌లైన్: ప్రజా సమస్యలను పక్కనబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జల రామక్రిష్ణారెడ్డి ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాసమస్యల పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన మాచారెడ్డి చౌరస్తాలో మాట్లాడారు. ముందుగా మాచారెడ్డి చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ వారసత్వ పాలనతో కొనసాగుతున్న కాంగ్రెస్ అవినీతి, అక్రమాలు, కుంభకోణాలలో ముందంజలో ఉందన్నారు. ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టిం చుకోవడం లేదన్నారు. విద్యుత్ సమస్య రోజురోజుకు జఠిలమవుతోందన్నారు. ఏడు గంటల పాటు విద్యుత్తును అందిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 3 నుంచి 4 గంటలైనా అందించడం లేదన్నారు. విద్యుత్తు ఎప్పుడు వ స్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో రైతాంగం కొట్టుమిట్టాడుతోందన్నారు. గుజరాత్లో నరేంద్రమోడీ ప్రభుత్వం 24 గంటలు విద్యుత్తును అందిస్తోందన్నారు.
రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అల్లాడుతున్నారన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కరువై గల్ఫ్‌బాట పడుతున్నారన్నారు. అక్కడ ఉపాధి కరువై స్వదేశానికి తిరిగి వచ్చి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఉపాధి కరువై ఒక వైపు యువత పెడదోవ పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గల్ఫ్ బాధితులకు జాబ్ మేళా పేరుతో హల్చల్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఎలాంటి భరోసానివ్వడం లేదన్నారు. సుస్థిర పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. యువత బీజేపీవైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాళ్ళపల్లి విఠల్‌గుప్తా, ఆదిలాబాద్ ఇన్చార్జి ఉప్పునూతుల మురళీధర్‌గౌడ్, దళిత మోర్చ రాష్ట్ర నాయకులు కొత్తపల్లి మల్లయ్య తదితరులు ఉన్నారు.