పాపం.. ఈ ఆవులు ఎలా చిక్కుకున్నాయో!
న్యూజిలాండ్‌లో పెను భూకంపం సంభవించిన తర్వాత చాలామంది నిరాశ్రయులయ్యారు. ఎక్కడికక్కడ ఇరుక్కుపోయారు. కానీ, గతంలో ఎప్పుడూ లేనట్లుగా మూడు ఆవులు చిత్రంగా ఒక కొండ పైభాగంలో చిక్కుకుపోయి ఏం చేయాలో, కిందకు ఎలా రావాలో అర్థం కాక అమాయకంగా చూస్తూ ఉండిపోయాయి. నిజానికి ఇది కొండ కానే కాదు... గడ్డితో నిండిన ఒక ద్వీపం. కానీ ఆ ద్వీపంలో చాలా భాగం భూకంపం కారణంగా ధ్వంసం కావడంతో, చివరకు ఒక కొండలా అది మిగిలిపోయింది. ద్వీపంలో మేతకు వెళ్లిన రెండు ఆవులు, ఒక దూడ ఆ కొండ పైభాగంలో చిక్కుకుపోయాయి.
న్యూస్‌హబ్ అనే వార్తా సంస్థ హెలికాప్టర్ నుంచి ఈ ఆవులను వీడియో తీసింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నమోదైన భూకంపం కారణంగా న్యూజిలాండ్ విలవిల్లాడింది. అందులో భాగంగానే ఈ ఆవులు కూడా ఇరుక్కుపోయాయి. అయితే, ఈ ఆవులు ఎవరివన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. భూకంప కేంద్రం ఉన్న ప్రాంతానికి కైకౌరా అనే ఈ ప్రాంతం చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ భూకంప ప్రభావం వల్ల ఇద్దరు మరణించారు. 2011 సంవత్సరంలో ఇప్పుడు సంభవించిన దాని కంటే తక్కువ తీవ్రతతోనే క్రైస్ట్ చర్చ్ నగరంలో భూకంపం వచ్చినా, అప్పట్లో మాత్రం 185 మంది మరణించారు. న్యూజిలాండ్‌లో మొత్తం జనాభా 47 లక్షలు కాగా, పశుసంపద మాత్రం కోటికి పైగానే ఉంది!