మరో గుడ్‌న్యూస్.. త్వరలోనే జేఎల్ఎం పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన జేఎల్ఎం పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలోనే చేపడతామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్) సీఎండీ రఘుమారెడ్డి ప్రకటించారు. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. కార్పొరేట్ కార్యాలయంలో సీపీడీసీఎల్ సాధించిన వార్షిక ప్రగతిని శుక్రవారం మీడియాకు వివరించారు.
నీరు, విద్యుత్‌లను వృథా చేయకూడదని, పొదుపుగా వాడుకోవాలని సూచించారు. గతేడాది డిసెంబర్ 30న రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 10,724 మెగవాట్లు ఉండగా, శుక్రవారం రికార్డు స్థాయిలో 14,107 మెగావాట్లు నమోదైందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో గతేడాది మార్చిలో 3,435 మెగావాట్లు నమోదైంది. 2023 మార్చి నాటికి 4,000 మెగావాట్లు దాటే అవకాశం ఉందని చెప్పారు.
కొంతమంది రైతులు తమ మోటార్లకు ఆటోమెటిక్ స్టాటర్లు బిగించి అవసరం లేకపోయినా విద్యుత్ సహా నీటిని వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వృథాను అరికట్టడం వల్ల లోటునే కాకుండా విద్యుత్ నష్టాలను అధిగమించొచ్చన్నారు.
చదవండి: గ్రూప్–3లో 1,365 కొలువులు