ఇదేం పద్ధతి..మందుబాబులూ?
► తరగతి గదుల ముందే పగులకొట్టిన మద్యం సీసాలు
► సంతనూతలపాడు జెడ్పీ హైస్కూలో ఘటన
► ఆకతాయిలకు చెక్పెట్టాలంటున్న స్థానికులు
సంతనూతలపాడు(చీమకుర్తి రూరల్): వందల మంది విద్యార్థులు చదువుకునే విద్యాలయం అది. లేతపాదాలతో చిన్నారులు తరగతి గదుల ముందు వరండాల్లో తిరుగుతుంటారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మందుబాబులు మద్యం సేవించిన తర్వాత మద్యం సీసాలను తరగతి గదుల ముందే పగలకొట్టి ఇష్టానుసారంగా వెళ్లిపోయారు. సంతనూతలపాడు జిల్లా పరిషత్ హైస్కూలు తరగతి గదులు, క్రీడా ప్రాంగణాల్లోని పలు ప్రాంతాల్లో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి.
స్థానికులు హైస్కూల్లో మందుబాబులు చేస్తున్న ఆగడాలకు సంబంధించిన ఆనవాళ్లను ఆదివారం సాక్షి దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వివరాలలోకి వెళితే సంతనూతలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో సంతనూతలపాడుతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన దాదాపు 600 మంది విద్యార్థులు ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యనభ్యసిస్తుంటారు. లేదపాదాలతో అటూ ఇటూ తిరుగుతూ ఉంటారనే విషయాన్ని కూడా మరిచిపోయిన మద్యం సేవించిన పెద్ద మనుషులు మందు సేవించిన అనంతరం ఖాళీ సీసాలను పాఠశాల ఆవరణలోనే పడేశారు.
కొన్ని సీసాలను విసిరి కొట్టడమో లేక పగలకొట్టడం వలన సీసా పెంకులు తరగతి గదుల ముందున్న వరండాల్లో వెదజల్లినట్లు పడి ఉన్నాయి. సెలవు రోజుల్లో ఇలాంటి ఆగడాలు మరింత ఎక్కువుగా ఉంటున్నాయి. పాఠశాల తెరిచిన తర్వాత వచ్చిన విద్యార్థులు పాఠశాల ఆవరణలో జాగ్రత్తగా ఉండక పోతే పగిలిన సీసా పెంకులతో లేని పోని ప్రమాదాలకు గురవుతారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హైస్కూల్లో రాత్రిళ్లు వాచ్మెన్లను నియమించడంతో పాటూ పోలీసులు ఒక రౌండ్ హైస్కూల్ వైపు వచ్చి వెళితే ఇలాంటి ఆకతాయిల ఆగడాలకు చెక్‌పెట్టవచ్చని స్థానికులు విన్నవించుకుంటున్నారు.