వేతనాల పెంపునకు కృషి చేస్తా
నల్లగొండ టౌన్ : సర్వ శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న పార్ట్‌టైం ఆర్ట్స్, క్రాఫ్ట్ టీచర్లకు వేతనాలను పెంచడానికి తన వంతుగా కృషి చేస్తానని జిల్లా విద్యాశాఖాధికారి చంద్రమోహన్ అన్నారు. శనివారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో ఆర్ట్స్, క్రాఫ్ టీచర్లు ఏర్పాటు చేసిన ఆర్ట్స్, క్రాఫ్ట్ గ్యాలరీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమస్యలను పరిస్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపిస్తామన్నారు. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు కొండేటి నివాస్ మాట్లాడుతూ ఉద్యోగ భద్రతను కల్పించడంతో పాటు వేతనాన్ని రూ.6 వేల నుంచి రూ.18 వేలకు పెంచాలని, మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. వేసవి సెలవుల్లో కూడా వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వేణు సంకోజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ ఏఎంఓ శ్రీనివాస్‌గౌడ్, సంఘం గౌరవాధ్యక్షుడు ఉపేంద్రాచారి, కోశాధికారి వనజాదేవి, ఉపాధ్యక్షులు రామకృష్ణ, శ్రీరాములు, నాయకులు పోతరాజు మౌనిక, నరేష్, జానయ్యగౌడ్, బొజ్జ అంజయ్య, దుర్గ, మనోహర్, ఏచూరి శైలజ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, క్రాఫ్ట్, ఆర్ట్ టీచర్లు వేసిన చిత్రాలు, తయారు చేసిన వివిధ రకాల క్రాఫ్ట్ వస్తువులు ఎంతగానో ఆకట్టుకున్నాయి.