విజయం: సెలెబ్రిటీలు మెచ్చిన చెఫ్!
పూజ వ్యాపారం 200 శాతం వృద్ధి సాధించింది. అక్కడ సగం ఉత్పత్తులు ముంబై టాప్ సెలబ్రిటీల ఇళ్లకే వెళ్లిపోతాయి. వ్యాపారాన్ని మరింత విస్తరించడంతో పాటు ఫుడ్ రైటింగ్, ఫుడ్ ఫొటోగ్రఫీ మీద కోర్సులతో స్టూడియో 15 అనే సంస్థను కూడా ఆరంభించే ప్రయత్నంలో ఉంది పూజ.
మాంద్యం రానివ్వండి. అన్ని రంగాలూ కూలిపోనివ్వండి. ఉద్యోగాలు పోనివ్వండి! కానీ ఉపాధికి, ఆదాయానికి ఢోకా లేని అంశాలు రెండుంటాయి. ఒకటి వైద్యం, ఇంకోటి తిండి! కాకపోతే మొదటి రంగం అందరినీ ఎంచుకోదు. రెండో రంగాన్ని అందరూ ఎంచుకోరు! కానీ ముంబైకి చెందిన పూజ ఢింగ్రా... సామాన్యులకు ఆసక్తి లేని రంగాన్నే ఎంచుకుంది. వండి పెట్టే నైపుణ్యం కోసం దేశాలు తిరిగింది. ప్రయోగాలు చేసింది. చివరికి విజేతగా నిలిచింది. స్ఫూర్తినిచ్చే ఈ యువ వ్యాపారవేత్త విజయగాథను తెలుసుకుందాం రండి!
వస్తువుకు లగ్జరీ ఉంటుంది. మరి తిండికి లగ్జరీ ఉంటుందా? ఉంటుంది. ముంబయిలోని ‘లీ 15 ప్యాటిసెరీ’కి వెళ్తే తెలుస్తుంది దీనికి సమాధానం. అసలా పేరు చెబితేనే చాలామందికి నోరూరిపోతుంది. ఇంతకీ అదేంటో తెలుసా... ఓ లగ్జరీ బేకరీ. అందులోని ఐటమ్స్‌కు యమా గిరాకీ. అందులోనూ మాకరాన్స్ (క్రీమ్ బిస్కెట్లు) గురించి చెప్పనవసరం లేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకెళ్తుంటారు. ఎందుకంత డిమాండ్? అది తెలుసుకోవాలంటే ఆ డిమాండును సృష్టించిన పూజ ఢింగ్రా గురించి తెలుసుకోవాలి.
పూజ వాళ్లమ్మ కొన్నాళ్లు చాకొలేట్ వ్యాపారం చేసింది. నాన్న కూడా రెస్టారెంట్ నడిపేవారు. అందుకే ఆమెకు ఫుడ్ ఇండస్ట్రీ మీదే ఆసక్తి ఏర్పడింది. అయితే పనిని ఉపాధిలా కాకుండా వృత్తిలా చూసే గుణం ఆమెను విజేతగా నిలిపింది. డబ్బు అనేది ఆమెకు ‘బై ప్రొడక్ట్’గా వచ్చి పడింది. ఐతే ఈ స్థాయికి చేరే క్రమంలో పూజ తన రాతను తనే రాసుకుంది.
ఇంటర్మీడియట్ తర్వాత తల్లిదండ్రులు పూజను న్యాయవాది కమ్మన్నారు. ఆ కోర్సులో చేరింది కూడా. కానీ వారం రోజులు గడిచాక తన గమ్యం ఇది కాదని ఆమెకర్థమైంది. లా పుస్తకాలు తలకు మించిన భారంలా కనిపించాయి. చెఫ్ కావాలని కోరుకుంది. ఆ కోరికనే తల్లిదండ్రుల ముందు పెట్టింది. అంతే, స్విట్జర్లాండ్ ఫ్లైట్ ఎక్కించేశారు వాళ్లు. అక్కడ ఓ ప్రముఖ ఇన్స్టిట్యూట్లో హాస్పిటాలిటీ కోర్సులో చేరింది. మొదట అక్కడి వారి మధ్య తనను తానో ఏలియన్లా భావించిన పూజ... మెల్లగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ప్రయత్నించింది. ఆమె తొలి ఇంటర్న్‌షిప్ ఓ కుటుంబం నడుపుతోన్న రెస్టారెంట్లో. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనే. పొద్దున బ్రేక్ ఫాస్ట్ చేయడంతో మొదలు.. పొద్దు పోయే వరకూ పనే పని. రెండో ఇంటర్న్‌షిప్ ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో. అక్కడ ఫ్లోర్లు, టాయిలెట్లు శుభ్రం చేయడం ఆమె పని. నామోషీ పడకుండా అన్ని పనులూ చేసింది. కోర్సు పూర్తయ్యేసరికి అంతర్జాతీయ డెలిగేట్స్ సెమినార్లు నిర్వహించే స్థాయికి చేరుకుంది. స్విస్ నుంచి తిరిగొచ్చాక ప్యారిస్ వెళ్లి అక్కడ మరో హాస్పిటాలిటీ కోర్సు చేసింది.
తర్వాత ఏం చేయాలి? వ్యాపారంలోకి ఎలా దిగాలో తెలియక.. తన ఇంటి కిచెన్‌నే ప్రయోగశాలగా మార్చుకుంది పూజ. తాను నేర్చుకున్న వంటలు ఇక్కడ ప్రయత్నించబోతే.. అన్నీ దెబ్బకొట్టేశాయి. విదేశాల్లో దొరికే పదార్థాలు ఇక్కడ దొరకలేదు. దాంతో ఇక్కడ దొరికే పదార్థాలతో బేకరీ ఐటమ్స్‌ను తయారు చేయడం మొదలుపెట్టింది. తాను తయారు చేసిన పదార్థాలతో ఫుడ్ ఎగ్జిబిషన్లకు తిరిగింది. దాంతో ఆర్డర్లు వచ్చాయి. పూర్తిగా విశ్వాసం లభించాక ‘లీ 15 ప్యాటిసెరీ’ని ఆరంభించిందామె. కొన్నాళ్లకే ముంబయిలోని విశిష్టమైన బేకరీల్లో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది. మరో రెండు శాఖలు కూడా వెలిశాయి. తనలా షెఫ్ కావాలనుకునేవారికి పాఠాలు కూడా చెబుతోంది పూజ. ఆమె క్లాసులకు వెళ్లాలనుకుంటే, www.le15.co.in/classes.php లో వివరాలున్నాయి.
- ప్రకాష్ చిమ్మల