రన్నింగ్‌లో రేసుగుర్రం.. సానబెడితే.. చిరుతే..
అనపర్తి(తూర్పు గోదావరి): ఆ యువకుడు పరుగెత్తాడంటే చిరుత కూడా వెనుకబడాల్సిందే. పరుగుల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకోవాలన్నదే అతడి ఆశయం. పేదరికం అడ్డుపడుతున్నా.. మెళకువలు నేర్పే కోచ్ లేకున్నా.. లక్ష్యాన్ని సాధించాలన్న కసితో ముందుకు దూసుకుపోతున్న ఆ యువకుడి పేరు ఉందుర్తి రమేష్. అనపర్తికి చెందిన ఈ యువకుడు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి చనిపోయాడు. తల్లి లక్ష్మి కూలి పనులు చేస్తోంది. చిన్నప్పటి నుంచీ పరుగులో రమేష్‌ది ముందంజే. యూనివర్సిటీ, రాష్ట్ర స్థాయిల్లో జరిగిన పోటీల్లో పతకాలు సాధించాడు.
చదవండి: Extramarital Affair: వద్దన్నా వినకుండా.. ఆమె ఇంటివద్దకెళ్లి..
అథ్లెటిక్స్‌లో 10కే, 5కే ఆఫ్ మారథాన్ పూర్తి చేశాడు. నిత్యం స్థానిక జీబీఆర్ మైదానంలో నిరంతరం సాధన చేస్తూ కనిపిస్తాడు. ఇతడి సంకల్పానికి జీబీఆర్ యోగా, వాకర్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు, జీబీఆర్ విద్యాసంస్థల అధినేత తేతలి కొండబాబు తోడుగా నిలుస్తున్నారు. రెండేళ్ల క్రితం వంద కిలోమీటర్ల దూరాన్ని 9.20 గంటల్లో చేరుకుని రికార్డు సృష్టించాడు. తాజాగా 140 కిలోమీటర్ల దూరాన్ని 14 గంటల్లో పరుగెత్తాలనే లక్ష్యాన్ని 70 నిమిషాలు ముందే చేరుకుని అబ్బురపరిచాడు.
బుధవారం రాత్రి జీబీఆర్ కళాశాల నుంచి, బలభద్రపురం, బిక్కవోలు, జి.మామిడాడ, పెదపూడి, ఇంద్రపాలెం లాకులు, కాకినాడ, జగన్నాథపురం వంతెన, కోరంగి మీదుగా యానాం సరిహద్దు చేరుకుని తిరిగి అదే దారిలో గురువారం ఉదయం సుమారు 7.30 గంటలకు అనపర్తి జీబీఆర్‌కు చేరుకున్నాడు. ఇతడి పరుగు ప్రతిభకు ముచ్చటపడిన ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, తేతలి కొండబాబుతో పాటు పలువురు ఘనంగా సత్కరించారు.
రికార్డును తిరగరాస్తా..
జాతీయ స్థాయి రన్నింగ్ రేస్ పోటీల్లో పాల్గొని రికార్డులు నెలకొల్పడడమే తన లక్ష్యమని రమేష్ చెబుతున్నాడు. వికాస్ మాలిక్ అనే రన్నర్ 160 కిలోమీటర్ల దూరాన్ని 18.20 గంటల్లో పూర్తి చేసి నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేయడమే లక్ష్యంగా శ్రమిస్తున్నానని వివరించాడు. ప్రభుత్వ సహకారం లభిస్తే మరిన్ని రికార్డులు నెలకొల్పుతానని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నాడు. కనీసం ఈ రంగంలో తనకు కొంచెం మార్గదర్శకంగా నిలిస్తే అబ్బురపరిచే విజయాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.