బుకీని బురిడీ కొట్టించిన మహిళ
రూ.40 లక్షలకు టోకరా
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరుకు చెందిన ఒక క్రికెట్ బుకీని హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ రూ.40 లక్షలకు టోకరా వేసింది. పోలీసులు వస్తున్నారనే భయంతో తన వద్ద ఉన్న రూ.40 లక్షలను పక్కింట్లో ఉన్న మహిళకు ఇచ్చి తర్వాత తీసుకుంటానని చెప్పాడు. అయితే కొద్దిసేపటి తర్వాత క్రికెట్ బుకీ అక్కడికి వచ్చి డబ్బు బ్యాగ్ ఇవ్వమని అడుగగా ఏ బ్యాగ్ అని ఆమె చెప్పడంతో అతను తెల్లమొహం వేశాడు. దీంతో ఆ బుకీ రాజకీయ నాయకుల సహకారంతో పోలీసుల వద్ద పంచాయితీ పెట్టాడు. ఈ ఘటన మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రొద్దుటూరు పట్టణంలోని చాపల మార్కెట్ సమీపంలో నివాసం ఉంటున్న ఓ క్రికెట్ బుకీ తరచూ హైదరాబాద్‌లో ఉంటూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుంటాడు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో అతను కొన్ని రోజుల నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లోని ఇందిరానగర్‌లో ఉన్న అపార్ట్మెంట్లో ఉంటున్నాడు.
పోలీసులు వస్తున్నారని ..
మూడు రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులు క్రికెట్ బుకీ ఉన్న అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. వారిని సెక్యూరిటీ ప్రశ్నించడంతో పోలీసులమని చెప్పారు. ఈ క్రమంలోనే వారు తన గదికి వస్తున్నారనే సమాచారం తెలియడంతో క్రికెట్ బుకీ తన వద్ద ఉన్న రూ.40 లక్షలున్న బ్యాగ్‌ను పక్కనే ఉన్న ఇంట్లోకి విసిరి వేశాడు. ఇందులో రూ.40 లక్షలు ఉన్నాయని. తర్వాత వచ్చి తీసుకుంటానని ఇంట్లో ఉన్న మహిళకు చెప్పి పరారయ్యాడు. రెండు గంటల తర్వాత వచ్చి తన బ్యాగ్ ఇవ్వమని అడిగాడు. ఆమె ఏమీ తెలియనట్లు ఏం బ్యాగ్ అని ప్రశ్నించడంతో ఖంగుతున్నాడు. ఇప్పుడే కదా రూ.40 లక్షల నగదు ఉన్న బ్యాగ్ ఇచ్చి వెళ్లాను అని క్రికెట్ బుకీ చెప్పగా ఆమె తనకు ఎప్పుడిచ్చావని బదులు ఇవ్వడంతో అతను వెళ్లిపోయాడు. తర్వాత అతను స్థానికంగా ఉన్న కొందరి పరిచయస్తులతో పాటు రాజకీయ నాయకుల సహకారంతో పోలీసు అధికారి వద్ద పంచాయితీ పెట్టించినట్లు తెలిసింది. క్రికెట్ బుకీని బంగారు వ్యాపారస్తుడిగా చిత్రీకరించి పోలీసులకు ఫిర్యాదు చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. కొంత మొత్తానికి సెటిల్మెంట్ చేసుకున్న పోలీసులు డబ్బు దోపిడీకి గురైందని కేసు నమోదు చేసినట్లు తెలిసింది.