వన్డే ప్రపంచకప్‌కు అఫ్ఘాన్
షార్జా: నిత్యం ఏదో ఒక చోట బాంబు దాడులు.. దీనికి తోడు తాలిబాన్ మత చాందసవాదుల దురాగతాలు.. ఇన్ని అడ్డంకుల మధ్య అఫ్ఘానిస్థాన్ దేశ క్రికెట్ జట్టు నిజంగా అద్భుతాన్నే సాధించింది. ప్రపంచ క్రికెట్లో తమ ఉనికిని చాటుకోవాలని చూస్తున్న ఈ జట్టు పట్టుదలతో పోరాడి ఏకంగా 2015 వన్డే ప్రపంచకప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది.
రెండో ప్రపంచ క్రికెట్ లీగ్ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో అఫ్ఘాన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత కెన్యా 43.3 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అఫ్ఘాన్ 20.5 ఓవర్లలో 3 వికెట్లకు 96 పరుగులు చేసి నెగ్గింది. దీంతో మొత్తం 14 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాల ద్వారా 19 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 24 పాయింట్లతో అగ్రస్థానం సాధించిన ఐర్లండ్.. ప్రపంచకప్‌కు ఇప్పటికే అర్హత సాధించింది.
వడివడిగా ప్రయాణం
కింది స్థాయి నుంచి అగ్రభాగానికి చేరుకునే క్రమంలో అఫ్ఘాన్ జట్టు పోరాట పటిమ అద్భుతం. 2008లో ఐసీసీ ప్రపంచ క్రికెట్ లీగ్‌లో అతి తక్కువ స్థాయి అయిన ఐదో డివిజన్లో పోటీ పడి నెగ్గింది. దీంతో 2011 ప్రపంచకప్ క్వాలిఫై టోర్నీకి అర్హత సాధించింది. 2009లో తొలిసారిగా జట్టుకు వన్డే హోదా మంజూరైంది. 2010లో ఈ జట్టు చెప్పుకోదగ్గ ఫలితం సాధించింది. ప్రపంచ టి20 క్వాలిఫైలో ఐర్లాండ్‌ను ఓడించి విండీస్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. అక్కడ విఫలమైనా తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోగలిగింది. 2012 టి20 ప్రపంచకప్‌కూ అర్హత సాధించింది. ఈ జూన్‌లో అఫ్ఘానిస్థాన్ ఐసీసీ అసోసియేట్ మెంబర్ అయ్యింది.