కలవారిపై ‘కారుణ్యం’... కదల్లేని ఆచార్యుడిపై ‘కాఠిన్యం’
అతడు పొట్టి క్రికెట్ ట్వం టీ-ట్వంటీకి తెరలేపి అంతర్జాతీయంగా క్రికెట్ మార్కెట్‌ను అమాంతంగా పైకి లేపిన గడుసరి. కానీ 7 వందల కోట్ల రూపాయల క్రికెట్ కుంభకోణంలో చిక్కుకుని దేశం విడిచి పారిపోయాడు. మనిషి ఎంత వంచన చేసినా, ఎంత పెద్ద కుంభకోణంలో భాగమై అడ్డంగా ఇరుక్కున్నా, వ్యక్తిగత అంశాల్లో సహాయం కోసం ఆపన్నహస్తాలను పట్టుకోవడం తప్పు కాదన్నది మానవత్వ పరిధిలో సమర్థనీయమే కావచ్చు. ఆ మానవతా దృక్పథంతోటే విదేశాంగ మంత్రి పదవిలో ఉన్న మన చిన్నమ్మ సుష్మా స్వరాజ్ లలిత్ మోదీపై కాసింత కరుణ చూపారు. ఆయన భార్య అనారోగ్యం పాలైనందున చికిత్స కోసం లండన్ నుంచి పోర్చుగల్ వెళ్లడానికి ఆమె కాస్త కారుణ్యం చూపి మోదీని అనుమతించడంపై బ్రిటిష్ ప్రభుత్వానికి స్వయంగా సిఫార్సు చేశారు. కానీ ఈ కారుణ్యం ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ ఉచ్చులో చిక్కుకున్న బడా మోసగాడికే ఎందుకు పరిమితం అవుతోందన్నది ప్రస్తుత ప్రశ్న. ఒక వంచకుడి వ్యక్తిగత సమస్య పరి ష్కారంలో కాసింత సానుభూతి ప్రద ర్శించిన చిన్నమ్మ సుష్మ, 80 శాతం అవయవాలు కదల్లేని స్థితిలో చక్రాల కుర్చీకే పరిమితమై ఏడాదిగా నాగ పూర్ సెంట్రల్ జైలులో మగ్గుతున్న డా.జి.ఎన్. సాయిబాబా పట్ల ‘కరుణ’ చూపకపోవడంలో మతలబు ఏమిటి? నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి అనారోగ్యం పాలవు తూ జైల్లో తీవ్ర ఇబ్బంది పడుతున్నా, కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు కేంద్రప్రభుత్వ పెద్దల చు ట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నా.. పాలకులకు మానవతా దృక్పథం చూపాలనిపించడం లేదు.
అవినీతి కుంభ కోణంలో నిండా మునిగిన లలిత్ మోదీ లండన్‌లో ఏలినవారి దయతో సకల సదుపాయాలతో విలాస జీవితం గడుపుతున్నాడు. కానీ సైద్ధాంతిక విశ్వా సాన్ని అంటిపెట్టుకున్న నిస్సహాయుడిని నాగ్‌పూర్ జైల్లో అండాసెల్‌లో కుక్కారు. ఢిల్లీ విశ్వవిద్యాల యంలో పొట్టకూటికి పనిచేస్తున్న ఆచార్యుడిపై ఇంత కాఠిన్యమేల? మోదీపై అంతటి కారుణ్యం ఎందుకు అనేది ఎక్కడా చర్చకు రాదు. డా. సాయిబాబా అనారోగ్య పరిస్థితిని ఏడుగురు ఎంపీలు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లినా ఎం దుకో ఆయనకూ కారుణ్యం కలగ లేదు. ఒకవైపు కుంభకోణాల ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రముఖ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తారు.
డా.జి.ఎన్. సాయిబాబా వంటి ఆచా ర్యులకు కనీస వైద్య సదుపాయాలు అందించరు. చివరకు ముంబైపై ఉగ్రవాద దాడి కేసులో కసబ్‌కు వందల కోట్ల రూపాయలను వైద్యం, భద్రత పేరిట ఖర్చుచేసి ఉరిశిక్ష అమలు చేశారు. అదే జైల్లో సాయి బాబా అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడే అవకాశమే లేదు. ఆయనకు అవసరమైన మందులు జైల్లో అందడం లేదు.
పోర్చుగల్‌లో ఉన్న మోదీ భార్య ఆపరేషన్ విష యంలో దయ కలిగిన వారికి స్వదేశంలో పలు అనా రోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న డాక్టర్ సాయి బాబాపై దాక్షిణ్యం కలగలేదు. కరుణకూ వర్గ స్వభావం ఉందంటే ఇదేనేమో? హృద్రోగం, కాలే యం, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ మూడు చక్రాల సైకిల్లో ఉంటూ, ఒకరి సహాయం లేనిదే కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని డా. సాయిబాబా చేసిన నేరం ఏమిటి? ఆయనపై ఇంత కాఠిన్యం ఎందుకు? సంపన్న వర్గాలపై మానవతా దృష్టి చూపిస్తూ సామాన్యుల పట్ల పరమ కాఠిన్యం ప్రదర్శిస్తే ప్రజాస్వామ్యంలో విలువలు ప్రశ్నార్థకం కావా? సంవత్సర కాలంగా నాగ్‌పూర్ జైలులో మగ్గు తున్న జి.ఎన్.సాయిబాబాను మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం జైలు బయటకు పాలకులు తీసుకువస్తా రని, కనీసం గృహ నిర్బంధంలో ఉంచైనా వైద్యం అందిస్తారని ఆశిద్దాం.
(వ్యాసకర్త శాసనసభ్యులు, దుబ్బాక నియోజకవర్గం)
మొబైల్: 94403 80141
- సోలిపేట రామలింగారెడ్డి