cricket match fixing
-
‘ఆ రెండు టెస్టుల్లో ఫిక్సింగ్ జరగలేదు’
దుబాయ్: సుమారు మూడేళ్ల క్రితం ‘క్రికెట్స్ మ్యాచ్ ఫిక్సర్స్’ పేరుతో ప్రముఖ టీవీ చానల్ ‘అల్ జజీరా’ ప్రసారం చేసిన రెండు డాక్యుమెంటరీలలోని ఆరోపణలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొట్టి పారేసింది. ఇందులో పేర్కొన్న అంశాలపై తాము పూర్తి స్థాయిలో విచారణ జరిపామని, ఎక్కడా తప్పు జరగలేదని స్పష్టం చేసింది. డాక్యుమెంటరీ తొలి భాగంలో రెండు టెస్టు మ్యాచ్‌లలో స్పాట్ ఫిక్సింగ్ జరిగిందని చెప్పిన చానల్... రెండో భాగంలో 2011–12 మధ్య కాలంలో 15 మ్యాచ్‌లలో ఫిక్సింగ్ చోటు చేసుకుందని ఆరోపించింది. 2016లో భారత్, ఇంగ్లండ్ మధ్య చెన్నైలో జరిగిన టెస్టు (ఇందులో భారత్ ఇన్నింగ్స్, 75 పరుగులతో గెలిచింది)...2017లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రాంచీలో జరిగిన టెస్టు (మ్యాచ్ డ్రాగా ముగిసింది)లలో ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లు ఫిక్సర్ల సూచనల ప్రకారం బ్యాటింగ్ చేసినట్లు అల్ జజీరా వెల్లడించింది. అయితే సుదీర్ఘ కాలం విచారణ జరిగిన ఐసీసీ వీటన్నింటిని తప్పుగా తేల్చింది. అసలు చానల్ సమర్పించిన ఆధారాలు ఏ రకంగానూ నమ్మశక్యంగా లేవని స్పష్టం చేసింది. ‘చానల్ చూపించిన దృశ్యాలను బట్టి చూస్తే ఏదీ అసహజంగా అనిపించలేదు. ఫిక్సింగ్‌ను సూచించే విధంగా ఎలాంటి అంశం అందులోనూ కనిపించలేదు. అసలు అందులో చెప్పే విషయాలేవీ నమ్మశక్యంగా లేవు. ఇలాంటి అంశాలపై పట్టు ఉన్న నలుగురు నిపుణులతో మేం నియమించిన కమిటీ అన్ని అంశాలను పరిశీలించి తమ నివేదిక ఇచ్చింది’ అని ఐసీసీ ప్రకటించింది. మొత్తంగా ఈ వివాదంతో సంబంధం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురికి కూడా క్లీన్చిట్ ఇచ్చింది. -
బుకీతో ఏసీఎస్‌యూ అధికారికి లింకు!
న్యూఢిల్లీ: ఐసీసీకి ఇది నిజంగా ఇబ్బందికర వార్తే. క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లను అరికట్టేందుకు పనిచేస్తున్న ఐసీసీ అవినీతి వ్యతిరేక యూనిట్ (ఏసీఎస్‌యూ)కు చెందిన ఉన్నతాధికారికి బుకీలతో సంబంధాలున్నాయని ఓ టీవీ చానెల్ వెల్లడించింది. బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన టి20 ప్రపంచకప్ సందర్భంగా భారత బుకీతో ఐసీసీ ఏసీఎస్‌యూ అధికారి జరిపిన సంభాషణల ఆడియో టేపును ‘బంగ్లా ట్రిబ్యూన్’ అనే చానెల్ విడుదల చేసింది. జాగ్రత్తగా బంగ్లాదేశ్‌ను విడిచి వెళ్లమని బుకీతో అధికారి చెబుతున్నట్టు ఆ టేపుల్లో ఉంది. అంతేకాకుండా టోర్నీ సందర్భంగా ఆ బుకీని ఢాకా పోలీసులు అరెస్ట్ చేస్తే.. అతడు తన ఇన్ఫార్మర్ అని ఈ అధికారే తప్పించాడని పేర్కొంది. ఈ ఆరోపణలపై ఐసీసీ ఇప్పటిదాకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. -
‘స్టింగ్ కింగ్’ తేజ్‌పాల్ పతనం
క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్, రక్షణ కొనుగోళ్లలో ముడుపులు వంటి అక్రమాలను స్టింగ్ ఆపరేషన్లతో బట్టబయలు చేసిన తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ ప్రతిష్ట మట్టిగొట్టుకుపోయింది ఈ ఏడాదే. తన కుమార్తె స్నేహితురాలు, తన పత్రికలోనే పనిచేస్తున్న మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. నవంబర్‌లో గోవాలోని ఓ హోటల్ లిఫ్టులో ఆయన తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మహిళా జర్నలిస్టు ఆరోపించడంతో తేజ్పాల్ను అరెస్టు చేశారు. -
సీబీఐ సమావేశంలో ప్రసంగించనున్న ద్రవిడ్
న్యూఢిల్లీ: క్రీడల్లో అవినీతి కార్యకలాపాలపై సీబీఐ ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తన అభిప్రాయాలను పంచుకోనున్నాడు. సోమవారం నుంచి మూడో రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ని ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించనున్నారు. ఈ ఏడాది ప్రపంచ క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదాలతో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘క్రీడల్లో నైతికత, నియమావళి - చట్టం అవసరం మరియు సీబీఐ పాత్ర’పై ప్రత్యేక సెషన్‌ను ఏర్పాటు చేశారు. మంగళవారం జరిగే ఈ సెషన్లో రాహుల్ ద్రవిడ్, అంతర్జాతీయ స్పోర్ట్స్ సెక్యూరిటీ డెరైక్టర్ క్రిస్ ఈటన్, బీసీసీఐ అవినీతి వ్యతిరేక యూనిట్ చీఫ్ రవి సవానీ పాల్గొననున్నారు. సమస్యను క్షేత్ర స్థాయిలో గుర్తించే ప్రయత్నం చేయడం సెషన్ ముఖ్య ఉద్దేశమని సీబీఐ అధికార ప్రతినిధి కంచన్ ప్రసాద్ అన్నారు.