సీబీఐ సమావేశంలో ప్రసంగించనున్న ద్రవిడ్
న్యూఢిల్లీ: క్రీడల్లో అవినీతి కార్యకలాపాలపై సీబీఐ ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తన అభిప్రాయాలను పంచుకోనున్నాడు. సోమవారం నుంచి మూడో రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ని ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించనున్నారు. ఈ ఏడాది ప్రపంచ క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదాలతో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ‘క్రీడల్లో నైతికత, నియమావళి - చట్టం అవసరం మరియు సీబీఐ పాత్ర’పై ప్రత్యేక సెషన్‌ను ఏర్పాటు చేశారు. మంగళవారం జరిగే ఈ సెషన్‌లో రాహుల్ ద్రవిడ్, అంతర్జాతీయ స్పోర్ట్స్ సెక్యూరిటీ డెరైక్టర్ క్రిస్ ఈటన్, బీసీసీఐ అవినీతి వ్యతిరేక యూనిట్ చీఫ్ రవి సవానీ పాల్గొననున్నారు. సమస్యను క్షేత్ర స్థాయిలో గుర్తించే ప్రయత్నం చేయడం సెషన్ ముఖ్య ఉద్దేశమని సీబీఐ అధికార ప్రతినిధి కంచన్ ప్రసాద్ అన్నారు.