భారత్ బోణీ
పాక్‌పై విజయం
అండర్-19 ప్రపంచకప్
దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత కుర్రాళ్లు అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్లో శుభారంభం చేశారు. తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. సర్ఫరాజ్ ఖాన్ (78 బంతుల్లో 74; 5 ఫోర్లు; 1 సిక్స్), సంజూ సామ్సన్ (101 బంతుల్లో 68; 2 ఫోర్లు; 1 సిక్స్) మెరుపులకు తోడు స్పిన్నర్ దీపక్ హుడా (5/41) కట్టుదిట్టమైన బౌలింగ్ తోడవడంతో పాక్ 40 పరుగుల తేడాతో ఓడింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 262 పరుగులు చేసింది.
94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందిలో పడిన జట్టును సామ్సన్, సర్ఫరాజ్ అద్భుత రీతిలో ఆదుకున్నారు. అవతలి ఎండ్ నుంచి సహకారం అందడంతో రెచ్చిపోయిన సర్ఫరాజ్ బౌండరీలతో చెలరేగాడు. స్పిన్నర్లపై ఆధిపత్యం చూపిస్తూ పరుగులు పిండుకున్నాడు. తొలి పరుగు తీసేందుకు 15 బంతులు ఎదుర్కొన్న తను ఆ తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. మంచి సమన్వయంతో ఆడిన ఈ జోడి ఐదో వికెట్‌కు 119 పరుగులను జోడించింది. రెండు ఓవర్ల వ్యవధిలో వీరిద్దరు అవుటయ్యారు. చివర్లో హుడా (18 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) మెరుపు ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.
హుడా మేజిక్
లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన పాకిస్థాన్ 48.4 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు సమీ అస్లాం (85 బంతుల్లో 64; 6 ఫోర్లు), ఇమామ్ (62 బంతుల్లో 39; 2 ఫోర్లు) భారత బౌలర్లను సులువుగానే ఎదుర్కొన్నారు. వీరి ఆటతో తొలి వికెట్‌కు 109 పరుగులు లభించాయి. అయితే ఇప్పటిదాకా పటిష్టంగానే కనిపించిన పాక్ ఆటగాళ్లను స్పిన్నర్ హుడా వణికించాడు. పోరాడుతున్న సౌద్ షకీల్ (40 బంతుల్లో 32; 3 ఫోర్లు)తో పాటు మిడిలార్డర్‌ను పూర్తిగా హుడా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేని పాక్ తమ చివరి తొమ్మిది వికెట్లను కేవలం 113 పరుగులకే కోల్పోయి ఓడిపోయింది. హైదరాబాదీ సీవీ మిలింద్కు ఓ వికెట్ దక్కింది.